సూర్య నటనా విశ్వరూపం 'ఆకాశం నీ హద్దురా'

సూర్య నటనా  విశ్వరూపం  ఆకాశం నీ హద్దురా
x
Highlights

మంచి సినిమా కోసం మొహం వాచిపోయిన ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని పంచిన 'ఆకాశం నీ హద్దురా' సినిమా!

చాలా కాలంగా మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఆ ఆశ తీరింది. అయితే, అది డబ్బింగ్ సినిమా కావడం కొంత నిరాశ అయినా, కరోనా వేళలో ఒటీటీ బాటలో ఉత్తి చెత్త సినిమాలను చూస్తూ కాలక్షేపం చేస్తున్న ప్రేక్షకులకు 'ఆకాశమే హద్దు' గా నటుడు సూర్య వినోదాన్ని అందించారు. అవును.. సూర్య నటించిన ''ఆకాశం నీ హద్దురా'' సినిమా ఈరోజు (12.11.2020) అమెజాన్ ప్రైం లో విడుదల అయింది. ఒటీటీ లో ఇప్పటివరకూ నేరుగా విడుదలైన సినిమాలు అన్నీ ప్రేక్షకులను నిరాశ పరిచాయి. మొదటిసారిగా ఈ సినిమా అందరూ మెచ్చేలా వచ్చింది.

ఈ సినిమా ఒక నిజజీవిత కథ ఆధారంగా తీశారు. ఎయిర్‌ డెక్కన్‌ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితంలోని అంశాల ఆధారంగా వచ్చిన 'సింప్లీ ఫ్లై' అనే పుస్తకంలోని కథకు సినిమా హంగులు చేర్చి ఈ 'ఆకాశం నీ హద్దురా'' సినిమా రూపొందించారు. ఈ సినిమాలో సూర్య హీరోగా నటించడంతో సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీంతో సినిమా పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి ప్రేక్షకులకు. మరి సినిమా ఎలా ఉందొ ఏమిటో ఓసారి పరిశీలిద్దాం..

కథేమిటంటే..

ముందే చెప్పినట్టు ఇది ఒక నిజ జీవిత కథ. చంద్ర మహేష్ (సూర్య) అనే ఒక పైలెట్ 2003లో విమానం ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తాడు. దానకి ఏవియేషన్ అధికారులు అంగీకరించరు. అయినా సరే, ఆ అధికారులతో గొడవపడి మరీ ఆ విమానాన్ని ల్యాండ్ చేయిస్తాడు. ఇది ఎందుకు జరిగింది.. తరువాత అధికారులు చంద్ర మహేష్ పై తీసుకున్న చర్యలు ఏమిటి? దానికి అతని రియాక్షన్ ఏమిటి? అసలు ఎందుకు ఆ విమానాన్ని అత్యవసరంగా కిందికి దించాడు? ఇక ఇందులో అతని భార్య సుందరి (అప్రర్ణ), పరేష్ గోస్వామి (పరేష్ రావెల్), భక్తవత్సలం నాయుడు (మోహన్ బాబు) ఏం చేశారు అనేదే సినిమా. నిజ జీవిత కథల్ని తెరమీద చాలా చూసుంటాం. అవన్నీ ఆకట్టుకోలేదు. కారణాలు చాలా ఉండవచ్చు. ఆకట్టుకున్న కొన్నిటికి మాత్రం కారణం ఒక్కటే..నిజ జీవిత కథను తెరమీద ప్రేక్షకులకు వినోదాన్ని పంచె విధంగా అందించడమే. సరిగ్గా ఈ సినిమా కూడా అలానే వినోదాన్ని పంచుతూనే విషయాన్ని చెబుతుంది.

ఎలా ఉందంటే..

నిజజీవిత కథల్ని చెప్పేటప్పుడు సాధారణంగా సూటిగా వరుస క్రమంలో చెబుతూ పోతారు. కానీ, ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే.. ఈ కథను వెనక్కి..ముందుకీ అనే పద్ధతిలో చెప్పారు. సరిగ్గా ఇక్కడే జాగ్రత్తగా సినిమాటిక్ అంశాలను జోడించడానికి స్పేస్ తీసుకున్నారు. అందులో వినోదాన్ని చేర్చడానికి అవకాశాన్ని కల్పించుకున్నారు. అంటే ఒక నిజమైన కథను.. సినిమాటిక్ కథగా మార్చారు స్క్రీన్ ప్లే తో. ఇక్కడే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొదటి భాగం అంతా పూర్తి కమర్షియల్ సినిమా హంగులతో పాటలు.. వినోదంతో నడిచిపోతుంది. ఇక రెండో భాగంలో అసలు కథ మొదలవుతుంది. హీరో విమానయాన సంస్థ ఏర్పాటు చేయాలనుకోవడం.. దానికోసం పడే కష్టాలు.. అన్నీదాటి విజయవంతం కావడం..వీటి మధ్యలో హీరో హీరోయిన్ల మధ్య నడిచే సన్నివేశాలు సినిమాని ఉత్సుకతతొ చూసేలా చేశాయి. దీంతో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మంచి సినిమా చూసిన అనుభూతికి లోనవుతారు.

ఎవరెలా..

ఈ సినిమా సూర్య సినిమా. అతన్ని తప్పితే మరొకర్ని ఈ సినిమాకి ఊహించలేనంతగా పాత్రలో ఇమిడిపోయారు సూర్య. కొన్ని సన్నివేశాల్లో అయితే.. అప్రయత్నంగా సూర్య నటనకు మనం చప్పట్లు కొట్టేస్తాం. అంత అద్భుతంగా చేశారు సూర్య. ఇక విలన్ గా పరేష్ రావెల్.. భాక్తవత్సలంగా మోహన్ బాబు.. తమ పాత్రల పరిధి మేరకు చక్కని నటన చూపించారు. హీరోయిన్ అపర్ణ ఈ పాత్రకు సరిగ్గా సరిపోయింది. ఇతర పాత్రలు ఇలా వచ్చి.. అలా వెళ్ళిపోయినా ఆకట్టుకునేలా చేశారు.

సాంకేతికంగా..

ఈ సినిమా క్రెడిట్ పూర్తిగా సుధా కొంగరదే. సూర్య లాంటి హీరోతో నిజ జీవిత కథ అంటే ఏంటో బ్యాలెన్సింగ్ ఉండాలి. సూర్య ఇమేజిని హ్యాండిల్ చేయగలగాలి. ఈ రెండిటినీ సుధా కొంగర చక్కగా సమన్వయమ చేసుకున్నారు. సినిమాటిక్ గా కథను చెప్పడానికి చేసిన ప్రయత్నమే సగం విజయానికి కారణం.. ఇక సూర్య ను ఆ పాత్రలో ఒదిగిపోయెలా చేసిన స్క్రీన్ ప్లే చాలా బావుంది. కాకపొతే.. ఈ క్రమంలో సినిమా నిడివి ఎక్కువగా అనిపిస్తుంది. కొంత తగ్గించొచ్చు అని కూడా అనిపిస్తుంది. ఇది చిన్న మైనస్ అంతే.. ఇక సినిమా అంతా సాంకేతికంగా ఉన్నత విలువలతో ఉంది. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం బాగుంది. రెండు పాటలు మాత్రం చాలా బావున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు అదనపు బలాన్నిచ్చింది. అలాగే కెమెరామెన్‌ నికేత్‌ కెమెరా ఫ్రేమింగ్ చక్కగా కుదిరింది. డైలాగులు కూడా బాగానే ఉన్నాయి. రాకేందు మౌళి చక్కని మాటలు అందించారు. ఎడిటింగ్ బావుంది కానీ.. కొంచెం నిడివి తగ్గించే ప్రయత్నం సతీష్ సూర్య చేసి ఉంటె బావుండేది అనిపిస్తుంది.

చివరగా డబ్బింగ్ సినిమా అయినా.. ఓటీటీ లో తొలి హిట్ సినిమా. ప్రేక్షకుల వినోదానికి 'ఆకాశం నీ హద్దురా' అనిపించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories