
Womens Health After 40
Womens Health : మహిళలు 40 ఏళ్ల లోపే బీపీ, షుగర్, విటమిన్ లెవల్స్ పరీక్షించుకోవాలి. ఎముకల బలం, కండరాల పుష్టి, సరైన క్యాన్సర్ స్క్రీనింగ్ ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Womens Health : చాలామంది మహిళలు 40 ఏళ్లు రాగానే ఒక్కసారిగా అనారోగ్యానికి గురవుతారని భయపడుతుంటారు. కానీ నిజం అది కాదు. మన శరీరంలో ఎముకల సాంద్రత తగ్గడం, ఇన్సులిన్ నిరోధకత పెరగడం, బీపీ పెరగడం వంటి మార్పులు ఎప్పుడో మొదలై ఉంటాయి. మనం వాటిని పట్టించుకోకపోయేసరికి 40 దాటాక అవి ఒక్కసారిగా బయటపడతాయి. అందుకే 40 ఏళ్ల లోపే ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ చేయించుకోవడం అనేది కేవలం భయం వల్ల చేసే పని కాదు, మన ఆరోగ్యాన్ని మనం సరిదిద్దుకునే అద్భుతమైన అవకాశం. క్యాన్సర్ సర్జన్, గట్ స్పెషలిస్ట్ డాక్టర్ అర్పిత్ బన్సల్ మహిళల దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం పాటించాల్సిన కీలక సూత్రాలను వివరించారు.
మొదటగా ఈ పరీక్షలు తప్పనిసరి
ఈ రోజు మనం ఎలా ఉన్నాం అన్నదానికంటే, రేపు మన ఆరోగ్యం ఎలా ఉండబోతుందో అంచనా వేసే బేసిక్ పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా బ్లడ్ ప్రెజర్(బీపీ) , నడుము కొలత, ఫాస్టింగ్ గ్లూకోజ్ లేదా HbA1c, లిపిడ్ ప్రొఫైల్, లివర్ మార్కర్లు తప్పనిసరి. ఇవి గుండె సంబంధిత సమస్యలను ముందే పసిగడతాయి. ముఖ్యంగా గర్భం దాల్చిన తర్వాత, పీసీఓఎస్, నిద్రలేమి, ఒత్తిడి, సరైన వ్యాయామం లేకపోవడం వల్ల మహిళల్లో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
ఎముకలు, కండరాలు.. ఆరోగ్యానికి రెండు చక్రాలు
వయసు పెరిగే కొద్దీ ఎముకల బలం తగ్గడం సహజం. అందుకే విటమిన్ డి, బి12 లెవల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఎముకల సాంద్రతను తెలుసుకోవడానికి డెక్సా (DEXA) స్కాన్ చేయించుకోవడం మంచిది. మనకు కండరాల బలం తగ్గితే ఇన్సులిన్ సెన్సిటివిటీ దెబ్బతింటుంది, దీనివల్ల గాయాలయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. చిన్న వయసులోనే ఎముకలు, కండరాల బలాన్ని పెంచుకుంటే వృద్ధాప్యం హాయిగా గడుస్తుంది.
మహిళల కోసం ప్రత్యేక స్క్రీనింగ్
గర్భాశయ క్యాన్సర్ ముప్పును తప్పించుకోవడానికి ప్యాప్ టెస్ట్ లేదా హెచ్‌పీవీ స్క్రీనింగ్ షెడ్యూల్ ప్రకారం చేయించుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 30 ఏళ్లు దాటిన మహిళలు దీనిపై దృష్టి పెట్టాలి. అలాగే రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకోవాలి. 40 ఏళ్లు రాగానే మేమోగ్రఫీ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే అంతకంటే ముందే స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది.
వీటిని అస్సలు మర్చిపోకండి
మనం సాధారణంగా బీపీ, షుగర్ చూస్తాం కానీ VO₂ Max (శరీరం ఎంత ఆక్సిజన్‌ను గ్రహిస్తుంది), HRV (గుండె స్పందనల మధ్య వైవిధ్యం) గురించి పట్టించుకోం. VO₂ Max అనేది మీ గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని చెప్తుంది. అలాగే HRV అనేది మన శరీరం ఒత్తిడి నుంచి ఎంత త్వరగా కోలుకుంటుందో తెలియజేస్తుంది. ఇప్పుడు వచ్చే స్మార్ట్ వాచీల్లో కూడా వీటిని ట్రాక్ చేసే వెసులుబాటు ఉంది. ఈ డాటాతో మన నిద్ర, వ్యాయామం, ఒత్తిడిని సరిగ్గా మేనేజ్ చేసుకోవచ్చు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




