Sleep Divorce: రాత్రి విడిపోతారు, ఉదయాన్నే కలుస్తారు.. రోజురోజుకీ పెరుగుతోన్న స్లీప్‌ డైవర్స్‌..!

Sleep Divorce: రాత్రి విడిపోతారు, ఉదయాన్నే కలుస్తారు.. రోజురోజుకీ పెరుగుతోన్న స్లీప్‌ డైవర్స్‌..!
x
Highlights

Sleep Divorce: స్లీప్ డైవోర్స్ ఇటీవల కాలంలో చాలా తరచుగా ఈ మాట వింటున్నాం. భార్యాభర్తలు వేర్వేరు గదుల్లో నిద్రపోవడాన్ని స్లీప్ డైవోర్స్ గా చెబుతారు.

Sleep Divorce: స్లీప్ డైవోర్స్ ఇటీవల కాలంలో చాలా తరచుగా ఈ మాట వింటున్నాం. భార్యాభర్తలు వేర్వేరు గదుల్లో నిద్రపోవడాన్ని స్లీప్ డైవోర్స్ గా చెబుతారు. దీంతో కొన్ని లాభాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అదే సమయంలో స్లీప్ డైవోర్స్ విడాకులకు దారితీసే ప్రమాదం కూడా ఉందనే వాదన కూడా ఉంది. ఇండియాలో కూడా కొన్ని జంటలు స్లీప్ డైవోర్స్ ను ఫాలో అవుతున్నాయి. ఈ పరిస్థితులకు కారణం ఏంటి? దీని నుంచి బయటపడేందుకు ఏం చేయాలి? ఏ వయస్సు జంటల్లో దీన్ని పాటిస్తున్నారు? వంటి అంశాలను ఈ ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం.

స్లీప్ డైవోర్స్ ఎందుకు?

భార్యాభర్తలు లేదా భాగస్వాములు వేర్వేరు గదుల్లో లేదా వేర్వేరుగా నిద్రపోవడం ఇటీవల కాలంలో పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. 2023 లో అమెరికా అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ అధ్యయనం నిర్వహించింది. మూడోవంతు జంటల్లో రోజూ లేదా అప్పుడప్పుడూ భాగస్వాములకు దూరంగా వేరే గదిలో నిద్రిస్తున్నారని ఆ సర్వే తెలిపింది. ప్రశాంతంగా నిద్రపోవడం కోసం స్లీప్ డైవోర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. నిద్రపోయే సమయంలో భాగస్వాముల్లో ఎవరికైనా ఒకరికి గురక పెట్టే అలవాటు ఉంటే మరొకరికి ఇబ్బంది అవుతుంది. నిద్రలో నడిచే అలవాటు, తరచుగా వాష్ రూమ్ కు వెళ్లడం, అలారం సౌండ్, మొబైల్ వాడడం వంటి వాటితో ఇబ్బంది పడే వారంతా స్లీప్ డైవోర్స్ ను కోరుకుంటున్నారు. కనీసం ఏడున్నర నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం అవసరం. సరైన నిద్ర లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. సరైన నిద్ర కోసం పార్ట్‌నర్ లేకుండానే నిద్రను కోరుకుంటున్నారు. సరైన నిద్ర లేకపోతే దంపతుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు. మంచి నిద్ర ఉంటేనే దంపతుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయని, విడాకులు తీసుకునే జంటల సంఖ్య తగ్గుతుందని ది ఒహాయో స్టేట్ యూనివర్శిటీ అధ్యయనం తెలుపుతుంది. ఇందుకు స్లీప్ డైవోర్స్ పద్దతిని పాటించాలని కోరుతోంది.


స్లీప్ డైవోర్స్ కు దారితీసే కారణాలు

దంపతులు ఇద్దరూ ఉద్యోగులైతే వారి డ్యూటీ టైమింగ్స్ వేర్వేరుగా ఉంటే స్లీప్ డైవోర్స్ కు దారి తీస్తాయి. వారి ఇష్టాలు కూడా ఇందుకు మరో కారణం. కొందరికి ఉదయం 5 గంటలకే నిద్రలేవడం అలవాటు. మరికొందరికి అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండడం ఇష్టం. ఇలాంటి భిన్న అలవాట్లు, ఇష్టాలు ఉండడం కూడా స్లీప్ డైవోర్స్ కు దారితీస్తున్నాయని మానసిక వైద్యులు చెబుతున్నారు.

ధనవంతుల్లో ఎక్కువగా స్లీప్ డైవోర్స్

ఈ ట్రెండ్ మిలియనీర్ జంటల్లో ఎక్కువగా ఉందని తేలింది. ఈ విధానం పాటిస్తున్న వారిలో 43 శాతం మిలియనీర్ జంటలు ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. మారుతున్న పరిస్థితులు, ఉద్యోగాల్లో ఒత్తిడి, కుటుంబ సమస్యలు కూడా స్లీప్ డైవర్స్ కు

కారణంగా మారుతున్నాయి. 1946 నుంచి 1964 మధ్య పుట్టినవారిలో 22 శాతం మంది, 1965 నుంచి 1980 మధ్య పుట్టినవారిలో 33 శాతం, 1997 నుంచి 2012 మధ్య పుట్టినవారిలో 28 శాతం మంది భాగస్వామికి దూరంగా నిద్రిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. నేషనల్ బెడ్ ఫెడరేషన్ అధ్యయనంలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. 2020లో కలిసి నిద్రించిన జంటల్లో ఆరుగురిలో ఒకరు స్లీప్ డైవోర్స్ పాటిస్తున్నారు. 2009లో ద స్లీప్ కౌన్సిల్ నిర్వహించిన అధ్యయనంలో ప్రతి 10 జంటల్లో ఒక జంటకు వేర్వేరు మంచాలున్నాయని తేలింది. తాజాగా పరిస్థితులు గమనిస్తే గడిచిన దశాబ్దంలో వేర్వేరుగా నిద్రపోయే జంటల సంఖ్య పెరిగింది.

స్లీప్ డైవోర్స్ తో లాభాలు

స్లీప్ డైవోర్స్‌తో లాభాలున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. మంచి నిద్రకు ఇది దోహదపడుతుంది. దీంతో మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఏకాగ్రత, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌, డెసిషన్‌ మేకింగ్‌ స్కిల్స్‌ పెరుగుతాయి. బాగా నిద్రపోతే మెదడు తగినంత విశ్రాంతి తీసుకుంటుంది. ఆలోచన శక్తి పెరుగుతుంది. నిద్రలేమి సమస్య చిరాకు, ఒత్తిడికి దారితీస్తుంది. దీర్ఘకాలంలో ఇది గుండె జబ్బులకు దారితీసే ప్రమాదం ఉంది. అంతేకాదు ఊబకాయానికి కారణమౌతోంది. సరైన నిద్ర ఉంటే రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది.

స్లీప్ డైవోర్స్‌తో నష్టాలు

స్లీప్ డివోర్స్‌తో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. భాగస్వామికి కొంత కాలంపాటు దూరంగా ఉంటే నష్టం లేదు. దీర్ఘకాలం ఇది కొనసాగితే ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. అంతేకాదు కమ్యూనికేషన్ గ్యాప్ కూడా పెరుగుతుంది. ఇది శారీరక సంబంధంపై కూడా ప్రభావం చూపొచ్చు. స్లీప్ డైవోర్స్ విడాకులకు కూడా దారితీసే ప్రమాదం ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు.

ఇండియాలో కూడా పెరిగిన స్లీప్ డైవోర్స్ ట్రెండ్

స్లీప్ డివోర్స్ ట్రెండ్ ఇండియాలో పెరుగుతోంది. మధ్యప్రదేశ్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ జంటకు ఎదురైన అనుభవాన్ని ఇక్కడ మనం ఉదాహరణగా చెప్పుకోవాలి.తన పార్ట్‌నర్ గురక కారణంగా తనకు నిద్ర కరువైందని సరైన నిద్ర కోసం ఒకరు డాక్టర్ ను కలిశారు. అయితే నిద్రమాత్రలకు బదులుగా స్లీప్ డైవోర్స్ ను పాటించాలని ఆ డాక్టర్ సూచించారు. డాక్టర్ సూచన మేరకు ఆ జంట స్లీప్ డైవోర్స్ పాటిస్తున్నారు. మరో కేసులో ఓ వివాహిత తన భర్తకు నిద్రలో చేతులు, కాళ్లు కదిలించే అలవాటు ఉందని ఆమె కూడా స్లీప్ డైవోర్స్ ఫాలో అవుతున్నారు. ఇలా భారత్ లో కూడా ఈ ట్రెండ్ పెరిగిపోతోంది.

జపాన్ అనుభవాలు ఏం చెబుతున్నాయి?

జపాన్ లో భాగస్వామితో కలిసి నిద్రపోవడం కంటే విడిగా నిద్రపోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఒకే గదిలో ఉన్నా వేర్వేరు బెడ్స్ పై దంపతులు నిద్రపోతారు. మంచాలు దగ్గరగా ఉన్నా మధ్యలో పార్టిషన్ ఉంటుంది.ఇలా విడివిడిగా పడుకోని కంటినిండా నిద్రపోవడం వల్లే తమ మధ్య అనుబంధం పెరుగుతుందని జపాన్ వాసుల నమ్మకం. తమ మధ్య ప్రేమను జపనీయులు విభిన్నంగా చూపుతారు. సందర్భం వస్తే భాగస్వామిని మెచ్చుకుంటారు. ముద్దు పేర్లతో పిలుచుకుంటారు. పిల్లలు, కుటుంబంతో ఎక్కువ సేపు గడుపుతారు. శారీరక బంధం బలపడడానికి వేర్వేరుగా నిద్రించడం కూడా కారణమని జపనీస్ రిలేషన్‌షిప్ నిపుణులు చెబుతున్నారు.

స్లీప్ డైవోర్స్ కు రకరకాల కారణాలను చెబుతున్నారు. దీనికి గల కారణాలను అన్వేషించి వాటిని పరిష్కరించుకోగలిగితే నష్టాన్ని నివారించవచ్చు. ఈ ట్రెండ్ కొనసాగితే విడాకులు తీసుకొనే దంపతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. అయితే స్లీప్ డైవోర్స్‌కు అడ్డుకట్టే వేసేందుకు ఏం చేయాలనే దానిపై ఫోకస్ పెట్టాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories