Pediatric Liver Disease: పిల్లల కాలేయ వ్యాధి.. పెరిగిన ప్రమాదం..ఆహారపు అలవాట్లే కారణమా?

Pediatric Liver Disease
x

Pediatric Liver Disease: పిల్లల కాలేయ వ్యాధి.. పెరిగిన ప్రమాదం..ఆహారపు అలవాట్లే కారణమా?

Highlights

Pediatric Liver Disease: నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లలోని లోపాలు, జన్యు కారణాల వల్ల పెద్దలకే కాదు, చిన్న పిల్లలకు కూడా కాలేయ సంబంధిత వ్యాధులు వేగంగా వస్తున్నాయి.

Pediatric Liver Disease: నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లలోని లోపాలు, జన్యు కారణాల వల్ల పెద్దలకే కాదు, చిన్న పిల్లలకు కూడా కాలేయ సంబంధిత వ్యాధులు వేగంగా వస్తున్నాయి. వీటిలో ఒకటి పిడియాట్రిక్ లివర్ డిసీజ్, ఇది పిల్లలకు ప్రాణాంతకం కూడా కావచ్చు. పీడియాట్రిక్ డాక్టర్లు తెలిపిన ప్రకారం.. పిడియాట్రిక్ లివర్ డిసీజ్ అంటే పిల్లలలో కాలేయానికి సంబంధించిన వ్యాధులు అని అర్థం. పుట్టినప్పటి నుంచి కౌమారదశ వరకు పిల్లలలో ఈ సమస్యలు రావచ్చు. ఇది కేవలం ఒకే వ్యాధి కాదు, అనేక రకాల కాలేయ సంబంధిత సమస్యల సమూహం. ఇది నెమ్మదిగా పిల్లల కాలేయాన్ని దెబ్బతీస్తుంది. అమెరికన్ లివర్ ఫౌండేషన్ ప్రకారం.. ఫ్యాటీ లివర్ డిసీజ్, వైరల్ హెపటైటిస్ (హెపటైటిస్ ఏ, బీ, సీ), ఆటోఇమ్యూన్ హెపటైటిస్, మెటబాలిక్ లివర్ డిసీజ్ వంటివి కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీసే కొన్ని వ్యాధులు. ఈ వ్యాధులు కాలేయ కణాలను నాశనం చేసి, దాని పనితీరును క్షీణింపజేస్తాయి.

పిల్లలలో కాలేయ వ్యాధికి కారణాలు ఏమిటి?

పిల్లలలో కాలేయం దెబ్బతినడానికి అనేక కారణాలు ఉండవచ్చు. పుట్టుకతోనే కాలేయం నిర్మాణంలో లోపాలు ఉండటం ఒక కారణం. వంశపారంపర్యంగా వచ్చే కొన్ని జన్యుపరమైన సమస్యలు కూడా కాలేయ వ్యాధులకు కారణం కావచ్చు. ఉదాహరణకు, విల్సన్ వ్యాధి లేదా ఆల్ఫా-1 యాంటిట్రిప్సిన్ లోపం. హెపటైటిస్ ఎ, బి, సి వంటి వైరస్‌ల సంక్రమణలు కాలేయానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. శరీరంలో కొన్ని ఎంజైమ్‌ల లోపం వల్ల కాలేయం సరిగా పనిచేయకపోవచ్చు. శరీర రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కాలేయంపై దాడి జరిగి, ఆటోఇమ్యూన్ హెపటైటిస్ వంటి సమస్యలు రావచ్చు. అధిక కొవ్వు లేదా చక్కెర ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ పెరగవచ్చు, ఇది కాలేయానికి హానికరం.

కాలేయ వ్యాధి లక్షణాలు

పిల్లలలో కాలేయ వ్యాధి వచ్చిన తర్వాత కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లలు తరచుగా జబ్బు పడటం, వాంతులు చేసుకోవడం, సరిగా బరువు పెరగకపోవడం లేదా బరువు తగ్గడం వంటివి గమనించాలి. చర్మం లేదా కళ్ళు పసుపు రంగులోకి మారడం కాలేయం సరిగా పనిచేయడం లేదని స్పష్టమైన సంకేతం. పొట్ట ఉబ్బినట్లు కనిపించడం, మూత్రం రంగు ముదురు పసుపు లేదా గోధుమ రంగులోకి మారడం, మలం రంగు లేతగా లేదా బంకమట్టి రంగులో ఉండటం వంటివి కూడా లక్షణాలే. పిల్లలు నిరంతరం అలసట, బలహీనతతో ఉండటం, ఆకలి లేకపోవడం, సరిగా ఆహారం తీసుకోకపోవడం వంటివి కూడా గమనించాలి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం.

వ్యాధి నిర్ధారణ, చికిత్స

పిల్లలలో కాలేయ వ్యాధిని నిర్ధారించడానికి డాక్టర్లు కొన్ని పరీక్షలు చేస్తారు. రక్త పరీక్షలు ద్వారా కాలేయం ఎంత బాగా పనిచేస్తుందో తెలుసుకుంటారు. అల్ట్రాసౌండ్ లేదా సీటీ స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలు కాలేయం లోపలి భాగాన్ని స్పష్టంగా చూడటానికి ఉపయోగపడతాయి. కొన్నిసార్లు బయాప్సీ ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు. అనువంశిక వ్యాధుల అనుమానం ఉంటే జన్యు పరీక్షలు చేస్తారు. చికిత్స విషయానికి వస్తే, ఇది వ్యాధి తీవ్రత మరియు రకాన్ని బట్టి మారుతుంది. కొన్ని సందర్భాలలో మందులతో మెరుగుదల ఉంటుంది. కానీ తీవ్రమైన పరిస్థితులలో కాలేయ మార్పిడి అవసరం కావచ్చు. బైల్ అట్రేసియా వంటి కేసులలో సరైన సమయంలో శస్త్రచికిత్స చాలా అవసరం.

పిల్లలకు కాలేయ వ్యాధులు రాకుండా నివారించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు. గర్భిణులకు సరైన సమయంలో టీకాలు, పోషకాహారం అందించాలి. నవజాత శిశువులకు హెపటైటిస్ బీ టీకా ను సరైన సమయంలో వేయించాలి. పిల్లలకు సమతుల్య ఆహారం అందించాలి, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ నుండి పిల్లలను దూరంగా ఉంచాలి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయిస్తూ ఉండాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories