Vitamin Deficiency : కాళ్లు, చేతులు తిమ్మిర్లు ఎక్కుతున్నాయా? అయితే అది ఆ విటమిన్ లోపమే

Vitamin Deficiency : కాళ్లు, చేతులు తిమ్మిర్లు ఎక్కుతున్నాయా? అయితే అది ఆ విటమిన్ లోపమే
x

Vitamin Deficiency : కాళ్లు, చేతులు తిమ్మిర్లు ఎక్కుతున్నాయా? అయితే అది ఆ విటమిన్ లోపమే

Highlights

మన శరీరం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే రకరకాల విటమిన్లు, ఖనిజాలు అవసరం.

Vitamin Deficiency : మన శరీరం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే రకరకాల విటమిన్లు, ఖనిజాలు అవసరం. వాటిలో అతి ముఖ్యమైనది విటమిన్ బి12. చాలా మంది దీని గురించి పెద్దగా పట్టించుకోరు కానీ, మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, నరాల ఆరోగ్యానికి, డిఎన్‌ఏ నిర్మాణానికి ఇది చాలా కీలకం. శరీరంలో ఈ విటమిన్ తగినంత లేనప్పుడు అది కేవలం శారీరక సమస్యలనే కాకుండా, మానసిక సమస్యలకు కూడా దారితీస్తుంది. మీ శరీరంలో బి12 లోపం ఉందని సూచించే కొన్ని ముఖ్యమైన లక్షణాలను నిపుణులు వివరిస్తున్నారు.

కాళ్లు, చేతుల్లో జుమ్మనిపించడం

మీకు తరచుగా కాళ్లు లేదా చేతుల్లో సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుందా? లేదా తిమ్మిర్లు ఎక్కుతున్నాయా? అయితే మీ శరీరంలో విట‌మిన్ బి12 తక్కువగా ఉందని అర్థం. ఈ విటమిన్ లోపం వల్ల నరాల పనితీరు దెబ్బతింటుంది. ఇది నరాల చుట్టూ ఉండే రక్షణ పొరపై ప్రభావం చూపడం వల్ల ఇటువంటి మొద్దుబారినట్లు లేదా జుమ్మనిపించే లక్షణాలు కనిపిస్తాయి.

నిరంతర అలసట, నీరసం

రోజంతా ఏదో ఒక పని చేస్తూ అలసిపోవడం వేరు, కానీ ఏ పని చేయకపోయినా విపరీతమైన అలసటగా అనిపిస్తే అది బి12 లోపం కావచ్చు. శరీరంలోని కణాలకు ఆక్సిజన్‌ను చేరవేసే ఎర్ర రక్త కణాలు తగ్గడం వల్ల శరీరం త్వరగా అలసిపోతుంది. దీనివల్ల చిన్న పని చేసినా ఆయాసం రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటివి జరుగుతాయి.

చర్మం రంగు మారడం

మీ చర్మం గతంలో కంటే పాలిపోయినట్లు లేదా తెల్లగా మారుతోందా? విటమిన్ బి12 లోపం వల్ల శరీరంలో రక్తం తగ్గి ఎనీమియా(రక్తహీనత) ఏర్పడుతుంది. తగినన్ని ఎర్ర రక్త కణాలు లేకపోవడం వల్ల చర్మం తన సహజమైన కాంతిని కోల్పోయి పాలిపోయినట్లు కనిపిస్తుంది. కొందరిలో కళ్లు కూడా కాస్త పసుపు రంగులోకి మారే అవకాశం ఉంది.

జ్ఞాపకశక్తి తగ్గడం, మానసిక సమస్యలు

విటమిన్ బి12 నేరుగా మెదడు పనితీరుతో ముడిపడి ఉంటుంది. దీని లోపం ఉన్నవారిలో ఏకాగ్రత లోపించడం, విషయాలను త్వరగా మర్చిపోవడం, తరచుగా మూడ్ మారిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. తీవ్రమైన లోపం ఉంటే అది డిప్రెషన్‌కు కూడా దారితీయవచ్చు. జీర్ణక్రియ సమస్యలు కూడా ఈ విటమిన్ లోపానికి ఒక సంకేతమే అని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories