Uric Acid Causes: యూరిక్ యాసిడ్ సమస్య ఎందుకు వస్తుంది? నివారణకు పాటించాల్సిన చిట్కాలు

Uric Acid Causes: యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరగడానికి కారణాలు, లక్షణాలు, నివారణ మార్గాలు ఏమిటో తెలుసుకోండి. ఆహారంలో మార్పులతో సమస్యను ఎలా అదుపులో ఉంచుకోవచ్చో తెలుసుకోండి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 Feb 2026 5:26 PM IST
Uric Acid Causes: యూరిక్ యాసిడ్ సమస్య ఎందుకు వస్తుంది? నివారణకు పాటించాల్సిన చిట్కాలు
X

Uric Acid Causes: యూరిక్ యాసిడ్ సమస్య ఎందుకు వస్తుంది? నివారణకు పాటించాల్సిన చిట్కాలు

Uric Acid Causes: ఈ మధ్యకాలంలో యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్ అనే పదార్థం శరీరంలో విచ్ఛిన్నమయ్యే సమయంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. సాధారణ పరిస్థితుల్లో ఇది రక్తంలో కరిగి, మూత్రపిండాల ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అయితే శరీరం అధికంగా యూరిక్ యాసిడ్ ఉత్పత్తి చేసినా లేదా కిడ్నీలు దాన్ని సరిగా బయటకు పంపలేకపోయినా, రక్తంలో ఇది పేరుకుపోతుంది. ఈ పరిస్థితినే వైద్య పరిభాషలో ‘హైపర్ యూరిసెమియా’గా పేర్కొంటారు.

యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల గౌట్, తీవ్రమైన కీళ్ల నొప్పులు, కిడ్నీ రాళ్లు, ఇతర మెటబాలిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రెడ్ మీట్, లివర్, కిడ్నీలు, సీఫుడ్ వంటి ఆహారాల్లో ప్యూరిన్లు అధికంగా ఉండటంతో ఇవి ఎక్కువగా తీసుకునే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్, సోడాలు, ప్రాసెస్ చేసిన స్వీట్లు కూడా యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతున్నాయి.

తగినంత నీరు తాగకపోవడం వల్ల కిడ్నీల పనితీరు తగ్గి, వ్యర్థాలు శరీరం నుంచి బయటకు వెళ్లడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, కిడ్నీ వ్యాధులు ఉన్నవారిలో యూరిక్ యాసిడ్ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ తీసుకోవడం యూరిక్ యాసిడ్ విసర్జనకు అడ్డంకిగా మారుతుందని కూడా స్పష్టం చేస్తున్నారు.

ఈ సమస్యను నియంత్రించాలంటే ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం, మాంసాహారాన్ని పరిమితం చేయడం, తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువు నియంత్రణలో ఉంచుకోవడం కూడా చాలా అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story