Health Alert: ఇండియాకు డేంజర్ బెల్స్‌..గ్రామీణ ప్రాంతాల్లో ప్రాణాంతకమైన వ్యాధి..!

Health Alert
x

Health Alert: ఇండియాకు డేంజర్ బెల్స్‌..గ్రామీణ ప్రాంతాల్లో ప్రాణాంతకమైన వ్యాధి..!

Highlights

Scrub Typhus: గ్రామీణ ప్రాంతాల్లో స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉందని, దీని వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (CMC) వెల్లూరు పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది.

Scrub Typhus: గ్రామీణ ప్రాంతాల్లో స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉందని, దీని వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (CMC) వెల్లూరు పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో 32,000 మంది ప్రజలపై చేసిన అధ్యయనంలో, స్క్రబ్ టైఫస్ జ్వరంతో ఆసుపత్రిలో చేరే ప్రధాన కారణాల్లో ఒకటిగా గుర్తించారు. స్క్రబ్ టైఫస్ అనేది ఓ రకమైన బ్యాక్టీరియం ద్వారా కలిగే తీవ్రమైన అంటువ్యాధి. ఇది చిగర్స్ (larval mites) అనే సూక్ష్మ క్రిముల ద్వారా మనుషులకు సంక్రమిస్తుంది. చాలా మంది రోగుల్లో ఈ వ్యాధి లక్షణరహితంగానే ఉంటుందనేమో గానీ, 8శాతం నుంచి 15శాతం వరకు బాధితులు తీవ్రమైన జ్వరంతో ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కొందరికి ఐసీయూ చికిత్స కూడా అవసరం అవుతోంది.

ఈ అధ్యయనం లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ (LSHTM) సహకారంతో New England Journal of Medicine లో ప్రచురించారు. పరిశోధకుల వివరాల ప్రకారం, COVID-19 తర్వాత, ఆసుపత్రుల్లో జ్వరం కారణంగా చేరే కేసులలో 30శాతం స్క్రబ్ టైఫస్ కారణంగా ఉన్నాయని గుర్తించారు. స్క్రబ్ టైఫస్ లక్షణాలు సంక్రమణమైన 10 రోజుల తర్వాత ప్రదర్శించబడతాయి. ఈ వ్యాధి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఎక్కువగా చిగర్ కాటు చేసిన ప్రదేశంలో ఒక నల్లటి గాయంలా ఏర్పడటం దీని ప్రత్యేక లక్షణం.

సకాలంలో చికిత్స తీసుకోకపోతే, ఈ వ్యాధి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు (ARDS), షాక్, మెనింజిటిస్, మూత్రపిండ విఫలం లాంటి పరిస్థితులకు దారితీసి మరణానికీ కారణమవుతుంది. పరిశోధనలో స్క్రబ్ టైఫస్ సంక్రమణ కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని గుర్తించారు. తీవ్రత పెరిగినప్పటికీ, స్క్రబ్ టైఫస్ నిర్ధారణ కోసం ప్రాధమిక స్థాయిలో సరైన పరీక్షలు లేవు. తీవ్రమైన లక్షణాలు ఉన్నప్పుడే పెద్ద ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించాల్సిన పరిస్థితి ఉంది. డాక్టర్ క్యారల్ దేవామణి (CMC వెల్లూరు) వివరించినట్టు, స్క్రబ్ టైఫస్ నిర్ధారణకు సౌకర్యాలు ఎక్కువగా మెట్రో నగరాల్లోని పెద్ద ఆసుపత్రులకే పరిమితమైపోయాయి.

స్క్రబ్ టైఫస్‌కి వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం, దీని గురించి అవగాహన లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో దీని ప్రభావం మరింత పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది. దీని నివారణ కోసం డాక్సీసైక్లిన్ (Doxycycline), అజిత్రమైసిన్ (Azithromycin) వంటి యాంటీబయాటిక్స్‌ను ఉపయోగిస్తారు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఈ వ్యాధిపై అవగాహన పెంచడం, తగిన వైద్య సదుపాయాలను కల్పించడం అత్యవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు. స్క్రబ్ టైఫస్‌ను ఎదుర్కొనాలంటే, గ్రామీణ ప్రజలను దాని ప్రమాదాల గురించి అవగాహన కలిగించడం, ప్రారంభ దశలోనే పరీక్షలు నిర్వహించడం, తగిన సమయంలో చికిత్స అందించాల్సిన అవసరం ఉందని వారు హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories