Mouth Ulcers: నోటి పూత పదే పదే వేధిస్తోందా? అయితే మీకు డేంజర్ బెల్స్ మోగినట్లే

Mouth Ulcers
x

Mouth Ulcers: నోటి పూత పదే పదే వేధిస్తోందా? అయితే మీకు డేంజర్ బెల్స్ మోగినట్లే

Highlights

Mouth Ulcers: నోటి పూత ఎందుకు వస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన శరీరంలో ఫోలిక్ యాసిడ్, ఐరన్ లేదా విటమిన్ బి12 లోపం ఉన్నప్పుడు నోటిలో పుండ్లు ఎక్కువగా కనిపిస్తాయి.

Mouth Ulcers: నోటి పూత ఎందుకు వస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన శరీరంలో ఫోలిక్ యాసిడ్, ఐరన్ లేదా విటమిన్ బి12 లోపం ఉన్నప్పుడు నోటిలో పుండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ సరిగ్గా లేకపోయినా లేదా కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలు ఉన్నా ఈ ప్రభావం నోటిపై పడుతుంది. మసాలా దినుసులు ఎక్కువగా ఉన్న ఆహారం, అత్యధికంగా కారం తినడం వల్ల కూడా నోటి లోపల సున్నితమైన చర్మం దెబ్బతిని పుండ్లు ఏర్పడతాయి. సాధారణంగా ఇవి కొన్ని రోజుల్లో తగ్గిపోతాయి, కానీ కొందరికి ప్రతి నెలా ఇవి ఇబ్బంది పెడుతుంటాయి.

నోటి పుండ్లు ఎప్పుడు ప్రమాదకరంగా మారుతాయంటే..

ఒక పుండు నెల రోజులైనా తగ్గకుండా అలాగే ఉండటం, నోటి నుంచి రక్తం రావడం లేదా ఆ పుండు వల్ల బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. ఇది కేవలం నోటి పూత మాత్రమే కాకుండా నోటి క్యాన్సర్‌కు ప్రాథమిక సంకేతం అయ్యే అవకాశం ఉంది. అలాగే థైరాయిడ్ సమస్యలు, మధుమేహం (డయాబెటిస్), లేదా పేగు సంబంధిత వ్యాధుల వల్ల కూడా ఇలా జరగవచ్చు. కొన్ని సందర్భాల్లో హెచ్‌ఐవి వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నోటిలో తరచూ పుండ్లు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

ఎవరికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది?

ముఖ్యంగా పొగాకు వాడేవారు, ధూమపానం చేసేవారికి నోటి లోపల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. మధుమేహం ఉన్నవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల పుండ్లు త్వరగా తగ్గవు. అలాగే విటమిన్ బి12 లోపం ఉన్నవారు, నిరంతరం ఒత్తిడికి గురయ్యేవారు మరియు కడుపు సమస్యలతో బాధపడేవారు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు. మనం తీసుకునే ఆహారం మరియు మన జీవనశైలి నేరుగా మన నోటి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

వీటిని తగ్గించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ముందుగా మీ శరీరంలో విటమిన్ బి12, ఐరన్ స్థాయిలను పరీక్షించుకోవాలి. లోపం ఉంటే దానికి తగిన మందులు లేదా ఆహారం తీసుకోవాలి. మసాలా, కారంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. అన్నింటికంటే ముఖ్యంగా పొగాకు, సిగరెట్ వంటి అలవాట్లను మానుకోవాలి. రోజుకు రెండుసార్లు పళ్లు తోముకుంటూ నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. మౌత్ వాష్‌లను ఉపయోగించడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా నశిస్తుంది. ఒకవేళ పుండు మరీ ఎక్కువగా నొప్పిగా ఉంటే, తేనె లేదా కొబ్బరి నూనెను ఆ ప్రాంతంలో రాస్తే ఉపశమనం లభిస్తుంది. అయినప్పటికీ తగ్గకపోతే సొంత వైద్యం మానుకుని నిపుణులైన డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories