Hair Dye Side Effects: జుట్టుకు రంగు వేస్తున్నారా? అయితే జాగ్రత్త!

Hair Dye Side Effects
x

Hair Dye Side Effects: జుట్టుకు రంగు వేస్తున్నారా? అయితే జాగ్రత్త! 

Highlights

Hair Dye Side Effects: తెల్ల జుట్టును కప్పిపుచ్చుకోవడానికి మీరు హెయిర్ డై వాడుతున్నారా? అయితే జాగ్రత్త! హెయిర్ డైలోని కెమికల్స్ మీ చర్మంపై చూపే దుష్ప్రభావాలు, అలర్జీలు, మంట వంటి సమస్యల నుంచి ఎలా రక్షణ పొందవచ్చో నిపుణుల సూచనలతో కూడిన ఈ స్టోరీలో తెలుసుకోండి.

Hair Dye Side Effects: మారుతున్న జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారింది. తెల్ల జుట్టును కప్పిపుచ్చుకోవడానికి చాలామంది హెయిర్ డైలపై ఆధారపడుతున్నారు. అయితే, జుట్టుకు రంగు వేసే క్రమంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతాయని మీకు తెలుసా? చాలామంది హెయిర్ డై వేసుకునేటప్పుడు కేవలం జుట్టుపైనే దృష్టి పెడతారు. కానీ, ఆ రంగు నుదిటిపై, చెవుల వెనుక, మెడపై ఉన్న చర్మానికి తగిలినప్పుడు రసాయన చర్యలు మొదలవుతాయి. హెయిర్ డై వల్ల కలిగే నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణుల ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చర్మంపై హెయిర్ డై చూపే దుష్ప్రభావాలు ఇవే..

* డైలోని రసాయనాలు చర్మంతో చర్య జరిపినప్పుడు తీవ్రమైన దురద, ఎరుపు దద్దుర్లు లేదా వాపు రావచ్చు.

* రంగు వేసిన చోట మంటగా అనిపించడం లేదా సూదులతో గుచ్చినట్లు ఉండటం వంటివి జరుగుతాయి. ఇది ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.

* పదే పదే రసాయన రంగులు వాడటం వల్ల చర్మం తన సహజ తేమను కోల్పోయి పొడిగా, నిస్తేజంగా మారుతుంది.

ఈ చిట్కాలు పాటించండి..

* ఏదైనా కొత్త డై వాడే ముందు, చెవి వెనుక భాగంలో కొద్దిగా రాసి 24 గంటల పాటు గమనించండి. ఎలాంటి మంట లేకపోతేనే వాడండి.

* రంగు వేసుకునే ముందు నుదిటి, చెవులు, మెడ భాగంలో వాసెలిన్ లేదా ఏదైనా మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాస్తే, డై నేరుగా చర్మానికి అంటుకోదు.

* పేరున్న బ్రాండ్లు, తక్కువ కెమికల్స్ ఉన్న డైలను ఎంచుకోండి.

* రంగు వేసిన తర్వాత జుట్టుతో పాటు చర్మాన్ని కూడా శుభ్రంగా కడగాలి. రంగు చర్మంపై ఎక్కువసేపు ఉండకుండా చూసుకోవాలి.

ఎప్పుడు డాక్టర్‌ను కలవాలంటే..

జుట్టుకు రంగు వేసిన తర్వాత విపరీతమైన దురద, ముఖం వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే వెంటనే జుట్టును శుభ్రమైన నీటితో కడిగేసి, ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను కలవాలి. వీలైనంత వరకు సహజసిద్ధమైన హెన్నా లేదా మూలికా రంగులను వాడటం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు. తరచుగా డై వేసుకోవడం తగ్గించి, పోషకాహారం తీసుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories