Monsoon Tips : వర్షాకాలంలో నీళ్లు తక్కువగా తాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు!

Monsoon Tips : వర్షాకాలంలో నీళ్లు తక్కువగా తాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు!
x

Monsoon Tips : వర్షాకాలంలో నీళ్లు తక్కువగా తాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు!

Highlights

సాధారణంగా వేసవిలో దాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మనం కావాల్సినంత నీళ్లు తాగుతాము. కానీ వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల దాహం అంతగా వేయదు.

Monsoon Tips : సాధారణంగా వేసవిలో దాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మనం కావాల్సినంత నీళ్లు తాగుతాము. కానీ వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల దాహం అంతగా వేయదు. దీంతో చాలా మంది నీళ్లు తాగడం తగ్గించేస్తారు. ఒకవేళ మీరు కూడా అలా తక్కువ నీళ్లు తాగుతున్నట్లయితే ఈ ముఖ్యమైన విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. దాహం వేయనంత మాత్రాన నీళ్లు తాగడం మానేస్తే, వర్షాకాలంలో కూడా డీహైడ్రేషన్ బారిన పడవచ్చు. దీనివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి వర్షాకాలంలో తక్కువ నీరు తాగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇప్పుడు వివరంగా చూద్దాం.

మలబద్ధకం, జీర్ణ సమస్యలు

శరీరంలో తగినంత నీరు లేకపోతే, మొదట వచ్చే సమస్యలలో ఒకటి మలబద్ధకం. నీరు తక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగదు. దీంతో ప్రేగులలో ఆహారం సరిగా కదలదు. ఫలితంగా మలబద్ధకం సమస్య తీవ్రమవుతుంది. ఇది దీర్ఘకాలికంగా మారితే, పైల్స్ (హెమరాయిడ్స్) వంటి మరింత తీవ్రమైన వ్యాధులు కూడా రావొచ్చు. కాబట్టి, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయడానికి, ఈ సమస్యలను నివారించడానికి తగినంత నీళ్లు తాగడం చాలా ముఖ్యం.

ఎనర్జీ తగ్గిపోతుంది

శరీరం యాక్టివ్ గా ఉండాలంటే తగినంత నీరు తాగడం చాలా అవసరం. శరీరానికి కావాల్సినంత నీరు అందకపోతే, మనం చేసే చిన్న చిన్న పనులకు కూడా త్వరగా అలసిపోతాము. తక్కువ నీటితో మెదడు కూడా సరిగా పనిచేయదు, దీంతో ఏకాగ్రత తగ్గుతుంది. నీరసంగా అనిపిస్తుంది. కాబట్టి రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి.

కిడ్నీ సమస్యలు

సాధారణంగా మన కిడ్నీలు శరీరంలోని వ్యర్థాలను, విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. కానీ శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు, కిడ్నీల పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. తక్కువ నీరు తాగడం వల్ల మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. చాలా మందికి తెలియకుండానే తక్కువ నీళ్లు తాగి ఈ సమస్యలను కొని తెచ్చుకుంటారు. కాబట్టి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే నీరు ఎక్కువగా తాగాలి.

చర్మ సమస్యలు పెరిగిపోతాయి

శరీరంలో తగినంత నీరు లేకపోతే, చర్మం దాని కాంతిని కోల్పోతుంది. ముఖం కళావిహీనంగా, పొడిగా కనిపిస్తుంది. అంతేకాకుండా మొటిమలు, దద్దుర్లు, ఇతర చర్మ సంబంధిత సమస్యలు కూడా మొదలవుతాయి. తగినంత నీరు తాగడం వల్ల చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇది చర్మం పొడిబారడం వంటి సమస్యలను తగ్గించి, చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్

శరీరంలో నీటి స్థాయి తక్కువగా ఉంటే, మూత్రంలో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది చాలా సాధారణంగా కనిపించే సమస్య. నిపుణుల ప్రకారం, ఒక రోజుకు కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలి. దీనివల్ల శరీరం నుండి వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్తాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. కాబట్టి, వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories