
CIP Disease: నొప్పి తెలియని వింత వ్యాధి CIP (Congenital Insensitivity to Pain) గురించి మీకు తెలుసా? గాయమైనా, ఎముక విరిగినా కనీసం స్పందన ఉండని ఈ అరుదైన జన్యుపరమైన రుగ్మత ఎందుకు వస్తుంది? దీని లక్షణాలు, ప్రమాదాలు, నివారణ మార్గాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకోండి.
CIP Disease: సాధారణంగా మనకు చిన్న దెబ్బ తగిలినా ప్రాణం విలవిలలాడిపోతుంది. కానీ, ప్రపంచంలో కొందరు వ్యక్తులకు ఎంత పెద్ద గాయమైనా, చివరకు ఎముక విరిగినా లేదా శరీరం కాలినా అస్సలు నొప్పి తెలియదు. వినడానికి ఇది ఏదో వింతగా ఉన్నా, నిజానికి ఇది ప్రాణాంతకమైన ఒక అరుదైన వ్యాధి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైద్య పరిభాషలో దీనిని 'కంజెనిటల్ ఇన్సెన్సిటివిటీ టు పెయిన్' (CIP) అని పిలుస్తారు. అసలు ఏంటి ఈ వ్యాధి, దీని వల్ల ఎలాంటి ప్రమాదాలు ఎదురు కావచ్చు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
CIP వ్యాధి అంటే..
ఇది పుట్టుకతోనే వచ్చే అత్యంత అరుదైన జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి ఉన్నవారికి నొప్పిని అనుభవించే శక్తి ఉండదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 కోట్లలో ఒకరికి మాత్రమే ఈ పరిస్థితి కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. నొప్పి తెలియకపోవడం వల్ల శరీరానికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వీరు దానిని గుర్తించలేరు, దీంతో పరిస్థితి విషమించే వరకు వారికి చికిత్స అందదు. పలువురు వైద్య నిపుణులు ఈ వ్యాధి రావడానికి గల కారణాలను వివరించారు. ఇది SCN9A అనే జన్యువులో వచ్చే మార్పుల వల్ల సంభవిస్తుందన్నారు. అలాగే ఈ వ్యాధి ఉన్న వారిలో శరీరంలో ఎక్కడైనా గాయమైనప్పుడు ఆ సంకేతాలను మెదడుకు చేరవేసే వ్యవస్థ పని చేయదని చెప్పారు. ఇది ఒక 'ఆటోసోమల్ రిసెసివ్' వ్యాధి అని వెల్లడించారు. అంటే తల్లిదండ్రులు ఇద్దరిలోనూ ఈ జన్యు లోపం ఉన్నప్పుడు మాత్రమే వారికి పుట్టే బిడ్డకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందన్నారు.
లక్షణాలు ఇలా గుర్తించండి..
పిల్లలు పుట్టిన వెంటనే ఈ వ్యాధిని గుర్తించడం కష్టం. కానీ వారు పెరుగుతున్న కొద్దీ కొన్ని లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
* దెబ్బలు తగిలినా, రక్తం వస్తున్నా పిల్లలు ఏడవరు.
* తెలియకుండానే తమ నాలుకను లేదా పెదవులను బలంగా కొరుక్కుంటారు.
* వేడి వస్తువులను పట్టుకున్నా చేతులు కాలుతున్నా ఏమాత్రం స్పందించరు.
* ఎముకలు విరిగినా సాధారణంగానే తిరుగుతుంటారు.
దురదృష్టవశాత్తు, ఈ వ్యాధికి ప్రస్తుతం వైద్య శాస్త్రంలో ఎటువంటి చికిత్స, మందులు లేదా టీకాలు లేవని చెబుతున్నారు. ఇది జన్యుపరమైన లోపం కావడంతో దీనిని నివారించడం సాధ్యం కాదని వైద్యులు అంటున్నారు. నిజానికి నొప్పి అనేది మన శరీరానికి ఒక 'అలారం' లాంటిది. లోపల ఏదైనా వ్యాధి ఉన్నా, ఇన్ఫెక్షన్ సోకినా నొప్పి ద్వారానే మనకు తెలుస్తుంది. కానీ CIP బాధితులకు ఆ అలారం పని చేయదని వెల్లడించారు. ఈ వ్యాధి ఉన్నవారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే 25 ఏళ్ల వయసు లోపే మరణించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి ఉన్నవారు నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని, ప్రతిరోజూ వారి శరీరాన్ని వారే స్వయంగా పరీక్షించుకుంటూ ఎక్కడైనా గాయాలు ఉన్నాయేమో చూసుకోవడం ఒక్కటే ప్రస్తుతానికి ఉన్న మార్గం అని చెబుతున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




