
Kidney Health: నీరు అమృతమా? విషమా? అతిగా తాగితే వచ్చే ముప్పులివే!
అధికంగా నీరు తాగితే కిడ్నీలపై ఒత్తిడి.. హైపోనాట్రీమియా నుంచి శరీర అసమతుల్యత వరకు ప్రమాదాలపై నిపుణుల హెచ్చరిక!
నీరు ఎంత ఎక్కువ తాగితే ఆరోగ్యానికి అంత మంచిదని చాలా మంది భావిస్తారు. కానీ, పరిమితికి మించి నీరు తాగడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి, అయితే పరిమితికి మించి నీళ్లు తీసుకుంటే కిడ్నీల పనితీరుపై ప్రతికూల ప్రభావంపడే అవకాశం ఉందని చెబుతున్నారు. అసలు ఎక్కువగా నీరు తీసుకుంటే కలిగే అనర్థాలు ఏంటి, వాటితో కిడ్నీలకు వచ్చే ప్రమాదం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కిడ్నీలపై అధిక నీటి ప్రభావం..
ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. అవసరానికి మించి నీరు తాగినప్పుడు, కిడ్నీలు ఆ నీటిని పదే పదే ఫిల్టర్ చేయాల్సి వస్తుంది. ఇది కిడ్నీల సామర్థ్యంపై అదనపు ఒత్తిడిని పెంచుతుంది. శరీరంలో నీరు ఎక్కువైతే సోడియం స్థాయిలు పడిపోతాయి. దీనివల్ల కణాలలో నీరు చేరి మెదడు, కండరాలకు హాని కలిగే ప్రమాదం ఉందన్నారు. ఎక్కువగా నీరు తీసుకోవడం చేస్తే మన శరీరం మనకు కొన్ని ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుందని చెబుతున్నారు. అవి ఏంటంటే.. మూత్రం రంగు మరీ తెల్లగా ఉండటం, లేదా పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం అధిక హైడ్రేషన్‌కు సంకేతం అని చెప్పారు.
అవసరానికి మించి నీటిని తీసుకుంటున్నప్పుడు ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు పేర్కొన్నారు:
* వికారం, తలతిరగడం.
* తరచుగా తలనొప్పి, విపరీతమైన అలసట.
* చేతులు, కాళ్ళు వాపు రావడం లేదా బరువుగా అనిపించడం.
* రాత్రివేళ సరిగ్గా నిద్ర పట్టకపోవడం.
రోజుకు నీరు ఎంత తాగాలంటే..
నీటి అవసరం అనేది వ్యక్తి వయస్సు, బరువు, చేసే శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తికి రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీరు సరిపోతుందని స్పష్టం చేశారు. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా శారీరక శ్రమ వల్ల చెమట పట్టినప్పుడు మనం తీసుకునే నీటిని కొంచెం ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగడం ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు. లేత పసుపు రంగులో మూత్రం రావడం ఆరోగ్యకరమైన సంకేతం అని వెల్లడించారు.
కేవలం నీరు తాగడమే కాకుండా, కిడ్నీలు పదిలంగా ఉండాలంటే ఈ అలవాట్లు ముఖ్యం అని వైద్య నిపుణులు చెబుతున్నారు..
* ఆహారంలో ఉప్పు, వేయించిన పదార్థాలను పరిమితం చేయండి.
* డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ (నొప్పి నివారణ మందులు) వాడటం కిడ్నీలకు ప్రమాదకరం.
* రక్తపోటు, చక్కెర స్థాయిలు అదుపులో ఉంటేనే కిడ్నీలు సురక్షితంగా ఉంటాయి.
* తగినంత నిద్ర, మితమైన వ్యాయామం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం.
మీ శరీర తత్వాన్ని బట్టి నీటిని తీసుకోవడమే ఉత్తమ మార్గం అని వైద్యులు సూచిస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




