వాటెన్ ఐడీయా : యువ రైతు ఆలోచన.. పంటను కాపాడింది

వాటెన్ ఐడీయా : యువ రైతు ఆలోచన.. పంటను కాపాడింది
x
Highlights

నిత్యం అడవి పందుల సంచారం. పచ్చని పంట పై పక్షుల దాడి. ఆరుగాలం శ్రమించిన పంటను కాపాడుకునేందుకు ఓ యువరైతు విసుగెత్తాడు. తనకొచ్చిన ఐడియాతో ఓ పరికరం...

నిత్యం అడవి పందుల సంచారం. పచ్చని పంట పై పక్షుల దాడి. ఆరుగాలం శ్రమించిన పంటను కాపాడుకునేందుకు ఓ యువరైతు విసుగెత్తాడు. తనకొచ్చిన ఐడియాతో ఓ పరికరం కనిపెట్టాడు. ఈ పరికరం ధాటికి అతడి పంటవైపు పశుపక్ష్యాదులు కన్నెత్తి చూడడంలేదు. ఈ యువ రైతు పేరు శ్రవణ్, నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సిర్పూర్ గ్రామవాసి. తన ఐడియాతో తయారుచేసిన పరికరంతో పశుపక్ష్యాదుల నుంచి పంటలను కాపాడుతున్నాడు.

సిర్పూర్ గ్రామంలో అధికమంది రైతులు మొక్కజొన్నను పండించేవారు. అడవి పందులు, పక్షులు దాడి చేసి పంటను ధ్వంసం చేస్తుండడంతో మొక్కజొన్న సాగును తగ్గించేశారు. శ్రవణ్ మాత్రం తమకున్న మూడెకరాల పొలంలో మొక్కజొన్న సాగును కొనసాగిస్తున్నాడు. మొక్కజొన్న పంటకు శ్రవన్ తండ్రి కాపలాకు వెళ్లేవాడు. పంటను ధ్వంసం చేసేందుకు వచ్చే పందులు, పక్షులను రాత్రి పగలు తేడా లేకుండా తరిమేవాడు. తండ్రి పడే కష్టాలు చూసి శ్రావణ్ బాధపడేవాడు.

భారీ శబ్దం చేస్తే అడవి పందులు పారిపోతుండటాన్ని శ్రవణ్ గమనించాడు. తన ఐడియాతో ఇంట్లో పాడైపోయిన ఫ్యాన్ రెక్కలు తీయించాడు. దానికి రెండు సైకిల్ చైన్ లు, స్టీల్ బిందే, ప్లేట్, కుక్కర్ ను కట్టి పరికరం తయారుచేశాడు. ఈ పరికరంలోని ఫ్యాన్ ను ఆన్ చేయగానే అది వేగంగా తిరుగుతూ భారీ శబ్దాలు చేస్తుంది.

తాను రూపొందించిన పరికరాన్ని శ్రవణ్ తన పొలంలో కట్టెలకు బిగించాడు. అంతేకాక పొలంలో డిస్కో లైట్లను అమర్చడంతో అడవి పందులు, ఇతర జంతువులు, పక్షులు మొక్కజొన్న పంట వైపు రావడం మానేశాయి. శ్రవణ్ పరికరం దెబ్బకు చుట్టుపక్కల పొలాల వైపు పశుపక్ష్యాదులు కన్నెత్తి చూడడంలేదు. తక్కువ ఖర్చుతో పశుపక్ష్యాదుల నుంచి పంటలను రక్షించే పరికరం తయారుచేసిన శ్రవన్ పై రైతులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories