వాట్పప్ మెస్సెజ్‌లతో ఆగిన రెండు వార్డుల ఎన్నికలు

వాట్పప్ మెస్సెజ్‌లతో ఆగిన రెండు వార్డుల ఎన్నికలు
x
Highlights

వాట్సప్‌లో వచ్చిన రిజర్వేషన్ల జాబితా సందేశం ఓ గ్రామ పంచాయతీలో రెండు వార్డు సభ్యులకు ఎన్నికలు నిలిపేలా చేసింది. రెవెన్యూ సరిహద్దు వివాదం కారణంగా మరో రెండు పంచాయతీల ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించారు.

వాట్సప్‌లో వచ్చిన రిజర్వేషన్ల జాబితా సందేశం ఓ గ్రామ పంచాయతీలో రెండు వార్డు సభ్యులకు ఎన్నికలు నిలిపేలా చేసింది. రెవెన్యూ సరిహద్దు వివాదం కారణంగా మరో రెండు పంచాయతీల ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించారు. అధికారుల తప్పిదం వల్ల నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు వివాదంగా మారాయి.

శాసనసభ ఎన్నికల నాటి నుంచి వాట్సాప్‌లో రకరకాల జాబితాలు హల్‌చల్‌ చేయడం మొదలైంది. పంచాయతీ ఎన్నికల్లోనూ రిజర్వేషన్ల జాబితా పేరుతో కొన్నిమెసేజ్‌లు చక్కర్లు కొట్టాయి. అదే నిజమని నమ్మిన ఓ గ్రామంలో రెండు వార్డులకు ఎన్నికలు నిలిచిపోయాయి. నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయి మండలం రంజిత్‌నాయక్‌తండాలో ఎన్నికల అధికారిక ప్రకటనకు ముందే రిజర్వేషన్‌ జాబితా ఒకటి వాట్సాప్‌లో విస్తృతంగా తిరిగింది. తర్వాత రోజు అధికారులు అసలైన జాబితా ప్రకటించినా గ్రామస్థులు పట్టించుకోలేదు. వాట్సాప్‌ సమాచారం ఆధారంగా సర్పంచి, వార్డు సభ్యులను ఏకగ్రీవం చేసుకొన్నారు.

అయితే, నామపత్రాల దాఖలు చివరి రోజు సర్పంచి అభ్యర్థితోపాటు ఆరుగురు వార్డు సభ్యుల అభ్యర్థులు పత్రాలు దాఖలు చేయడానికి వెళ్లారు. రద్దీ అధికంగా ఉండడంతో సాయంత్రానికి అవకాశం వచ్చింది. లోనికి వెళ్లిన ఆరుగురు వార్డు సభ్యుల్లో ఇద్దరు కేటాయించిన రిజర్వేషన్లకు విరుద్ధంగా పత్రాలు సమర్పించడంతో అధికారులు వాటిని తిరస్కరించారు. ఎస్టీకి రిజర్వు చేసిన వార్డు స్థానాల్లో బీసీలు వేయడానికి వీలులేదని చెప్పడంతో అవాక్కయ్యారు. తమ దగ్గర ఉన్న జాబితాలో బీసీలకు ఇచ్చారని వాదించినా ఫలితం లేకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో రెండు వార్డు స్థానాలకు ఎన్నికలు నిలిచిపోనున్నాయి. కేటాయించిన రిజర్వేషన్లను పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులు ప్రదర్శించకపోవడంతోనే తమకు అన్యాయం జరిగిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

రంజత్ నగర్ తండా పరిస్థితి ఇలా ఉంటే ఇదే మండలంలోని తిర్మన్‌పల్లి-గంగారాం తండాల్లో గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరించారు. అధికారుల తీరుతో విసిగిపోయిన గ్రామస్తులు ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు. ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి గ్రామం, దాని పక్కనే కొత్తగా ఏర్పాటైన గంగారాం తండాలకు రెవెన్యూ అధికారులు సరిహద్దులు ఏర్పాటు చేయలేదు. ఇందల్వాయి-తిర్మన్ పల్లి మధ్య ఈ సమస్య కొన్నేల్లుగా ఉంది. అధికారుల చుట్టు తిరిగి వేసారిన గ్రామస్తులు ఎన్నికల బహిష్కరణతో తమ సమస్య దొరుకుతుందని నామినేషన్లు వేయకుండా తమ నిరసన తెలిపారు.

తిర్మన్‌పల్లి గ్రామస్తులను గంగారాం తండాలో కలపడం, ప్రజాభిప్రాయ సేకరణచేయకుండా తండాను ఏర్పాటు చేయడంతో గంగారాం తండావాసులు నామినేషన్లు వేయకుండా ఎన్నికలను బహిష్కరించారు. గంగారాం తండాలో అన్ని వర్గాల ఓటర్లు ఉండగా గిరిజనులకు రిజర్వేషన్లు చేయడాన్ని గ్రామస్తులు తప్పు పడుతున్నారు.

పంచాయతీ ఎన్నికలు పకడ్బందీ ఏర్పాట్లు చేసామని చెబుతున్న అధికారులు చేసిన తప్పులను మాత్రం సరిదిద్దడం లేదు. అధికారులు జోక్యం చేసుకుని ఎన్నికలు బహిష్కరించిన గ్రామాల్లో సమస్య పరిష్కారానికి చొరవ చూపాల్సిన అవసరం ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories