రాహుల్ వయనాడ్ పోటీ ఎవరికి చెక్ ?

రాహుల్ వయనాడ్ పోటీ ఎవరికి చెక్ ?
x
Highlights

దక్షిణాదిన రాహుల్ ని పోటీకి దింపి కాంగ్రెస్ సగం ఎన్నికలను గెలిచేసిందా? వయనాడ్ లో కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహం చూస్తే అదే అనిపిస్తోంది. అంతే కాదు తమ...

దక్షిణాదిన రాహుల్ ని పోటీకి దింపి కాంగ్రెస్ సగం ఎన్నికలను గెలిచేసిందా? వయనాడ్ లో కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహం చూస్తే అదే అనిపిస్తోంది. అంతే కాదు తమ సింప్లిసిటీతో రాహల్, ప్రియాంక కేరళ ప్రజల మదిని దోచేశారు. ఉత్తర, దక్షిణ అంతరాలను చెరిపేస్తానంటున్న రాహుల్ బీజేపీ సీట్లకు ఏ మేరకు గండి కొడతారో చూడాలి.

దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తొలిసారిగా దక్షిణ భారత దేశానికి రాజకీయాల్లో ప్రాధాన్యత పెంచుతూ రంగంలోకి దిగారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అందుకే వ్యూహాత్మకంగా వయనాడ్ నుంచి బరిలోకి దిగుతున్నారు. సోదరి ప్రియాంకతో కలసి ఒకరోజు ముందే వయనాడ్ కు చేరుకుని, అక్కడ గెస్ట్ హౌస్ లో బస చేసి కార్యకర్తలను కలుసుకున్నారు.

రాహుల్ ఎంట్రీ తోనే సగం విజయం సాధించాలని తపనపడిన కాంగ్రెస్ అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది. ఆయనకు అఖండ ఘన స్వాగతం పలికింది. ఆత్మీయ స్వాగతం పలికింది. దేశమంతా ఒక్కటేనని నిరూపించడానికే తాను వయనాడ్ నుంచి బరిలోకి దిగుతున్నానన్నది రాహుల్ కామెంట్.

ఇక నామినేషన్ వేసినప్పుడూ రాహులే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. పార్టీ పెద్దలు, కార్యకర్తలు, సోదరి ప్రియాంక కలసి రాగా ఓపెన్ టాప్ జీపులో నామినేషన్ కు వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి ఊమన్ చాందీ, కేరళ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల ఇతర సీనియర్ నేతలు రాహుల్ గెలుపుతో కేరళలో కాంగ్రెస్ భవితవ్యం మారుతుందనే ఆశలో ఉన్నారు.

మరోవైపు రాహుల్ రాకపై వయనాడ్ పులకించింది. నిప్పులు గక్కుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డు కిరువైపులా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రాహుల్ కి స్వాగతం పలికారు. వాహనానికి దారి కల్పించడం భద్రతా బలగాలకు కష్టంగా మారింది. ఫోటోలు తీసుకుంటూ, సెల్ఫీలు దిగుతూ కాంగ్రెస్ కార్యకర్తలు సందడి చేశారు.

ఇక రాహుల్ ధైర్యవంతుడు, యువకుడు, నిజమైన స్నేహితుడూ అంటున్నారు ప్రియాంక నా అన్నను మీ చేతిలో పెట్టాను ఆయన బాధ్యత ఇక మీదే నంటూ ట్విట్టర్ ద్వారా సెంటిమెంట్ సంధిస్తున్నారు. బీజేపీ పాలనలో ఉత్తర, దక్షిణ భారతాలుగా దేశం విడిపోయిందంటున్న రాహుల్ ఈ విభేదాలు తొలగాలని, దక్షిణాది ప్రాధాన్యత పెరగాలని అన్నారు.

రోడ్ షో సందర్భంగా తొక్కిసలాటలో గాయపడిన ఇద్దరు జర్నలిస్టులను అంబులెన్సులోకి ఎక్కించడానికి సాయపడి తన పెద్ద మనసు చాటుకున్నారు రాహుల్. అంతేకాదు గాయపడిన జర్నలిస్టు చెప్పులను ప్రియాంకా గాంధీ అంబులెన్స్ వరకూ మోయడం ఆశ్చర్యం కలిగించింది. జనం మధ్యకొస్తే ఈ అన్నా చెల్లెళ్లు ఎంతలా మమేకమవుతారనడానికి ఇదే నిదర్శనం.

కేరళ నుంచి బరిలోకి దిగడాన్ని ఎల్డీఎఫ్ కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా రాహుల్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరోవైపు అమేథీలో బీజేపీ అభ్యర్ధి స్మృతీ ఇరానీ మాత్రం రాహుల్ ను తీవ్రంగా విమర్శించారు. అమేథీ ప్రజలను మోసగించి కేరళకు పారిపోయారన్నారు. నమ్ముకున్న కార్యకర్తలను వంచించారన్నారు.

వాస్తవానికి దక్షిణాది నుంచి మోడీ పోటీ చేస్తారంటూ కొంత కాలంగా ఊహాగానాలు సాగుతున్నా అనూహ్యంగా రాహుల్ పోటీకి సిద్ధపడ్డారు. ఇక్కడ నుంచి పార్టీ అధ్యక్షుడు బరిలోకి దిగితే దక్షిణాది కాంగ్రెస్ ఎంపీలందరికీ ప్రోత్సాహకరంగా ఉంటుంది. బీజేపీకి దక్షిణాదిన పెద్దగా ఓటు బ్యాంకు లేకపోవడం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశం. వయనాడ్ మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉండటం వ్యూహాత్మకంగా కలిసొస్తుంది. కాగా మైనారిటీల ఓట్లు చీలడం ద్వారా రాహుల్ సులభంగా గెలిచే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.





Show Full Article
Print Article
Next Story
More Stories