Top
logo

వలస కూలీలకు కలిసి వచ్చిన ఎన్నికలు...ఉగాదికి వచ్చి ఎన్నికల...

వలస కూలీలకు కలిసి వచ్చిన ఎన్నికలు...ఉగాదికి వచ్చి ఎన్నికల...
Highlights

ఉగాది పండగ ఈసారి ఓట్ల పండగను తెచ్చింది. ఓటు వేసేందుకు వలస కూలీలను రప్పించేందుకు నేతలు ప్రయత్నాలు...

ఉగాది పండగ ఈసారి ఓట్ల పండగను తెచ్చింది. ఓటు వేసేందుకు వలస కూలీలను రప్పించేందుకు నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రానుపోను ఖర్చులు భరించేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 10న రైళ్లు, బస్సుల్లో సీట్లు మొత్తం ఫుల్ అయ్యాయి. ఆర్టీసీ అదనపు బస్సులు నడిపే ఏర్పాట్లు చేస్తోంది.

కరువుప్రాంతమైన రాయలసీమ నుంచి లక్షలాది మంది పక్క రాష్ట్రాల కోసం పనుల కోసం వలస వెళ్లారు. ఎక్కడ ఉన్నా ప్రతి సంవత్సరం ఉగాదికి సొంత గ్రామాలకు వస్తారు. పండగకు వచ్చిన వీరంతా ఒక వారం పాటు ఇక్కడే గడుపుతారు. ఏప్రిల్ 6న ఉగాది 11న శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఉండటం వలస కూలీలకు కలిసిచ్చింది.

రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి తదితర ప్రాంతాల నుంచి సుమారు 4లక్షల మంది పక్కల రాష్ట్రాలకు పనుల కోసం వలస వెళ్తారు. ఎక్కువగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు , చత్తీస్‌గఢ్, కేరళలకు వెళతారు. బెంగళూరు, మైసూరు, మంగళూరుతో పాటు హైదరాబాద్, పుణె తదితర ప్రాంతాల్లో భూగర్భ కేబుల్ ఏర్పాటు, పైప్‌లైన్, భవన నిర్మాణ పనులు చేస్తుంటారు.

వలస వెళ్లిన వారిని ఓట్ల కోసం రప్పించేందుకు నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈసారి పండగకు ఊరికి వచ్చి వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు, పైఖర్చులు భరిస్తామంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు, వారి కుటుంబీకులు వలసలు అధికంగా ఉండే ప్రాంతాలకు వెళ్లి వారితో సంప్రదింపులు సాగిస్తున్నారు. ముఖ్యంగా కూలీలను తీసుకెళ్లే మేస్త్రీలకు ఇప్పుడు డిమాండ్ ఉంది. నేతలు వారిని సంప్రదించి ఓటర్లను గ్రామాలకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎన్నికల రోజు సొంతూళ్లకు రావాలని ఇతరప్రాంతాల్లో ఉండేవారంతా ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆర్టీసీ, రైల్వేలో ఏప్రిల్ 10న అత్యధికంగా టికెట్లు అమ్ముడయ్యాయి. అసలు ఖాళీలు లేవు. రైలులో వెయింటింగ్ లిస్టులో చూడాలన్నా టికెట్లులేవు. బస్సులో అయితే సంక్రాంతి, దసరా సీజన్ మించి డిమాండ్ పెరిగింది. బస్సులు ఇది వరకే నిండిపోగా ఆర్టీసీ అదనంగా 50 బస్సులను వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటు బస్సులు అదనంగా నడువనున్నాయి.


లైవ్ టీవి


Share it
Top