ప్రభుత్వంలో కదిలిక తెప్పించిన రైతుల ఎన్నికల అస్త్రం

ప్రభుత్వంలో కదిలిక తెప్పించిన రైతుల ఎన్నికల అస్త్రం
x
Highlights

నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో రాజకీయం రసవత్తరంగా మారింది. రైతు సమస్యలు నేతలకు గట్టి సెగ తగులుతోంది. ఎర్రజొన్నలు., పసుపు మద్దతు ధరపై రైతులు ఎన్నికల...

నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో రాజకీయం రసవత్తరంగా మారింది. రైతు సమస్యలు నేతలకు గట్టి సెగ తగులుతోంది. ఎర్రజొన్నలు., పసుపు మద్దతు ధరపై రైతులు ఎన్నికల అస్త్రాన్ని ప్రయోగించారు. ఎన్నో ఎళ్లుగా గిట్టుబాటు ధర కోసం పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు స్పందించకపోవడంతో తమ సమస్యను జాతీయ స్థాయిలో నేతలను ఆకట్టుకోవాలనుకున్నారు. తాజాగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో వందమందికి పైగా నామినేషన్లు వేశారు. రైతులు ప్రయోగించిన ఎన్నికల అస్త్రం ప్రభుత్వంలో కదలిక తెచ్చింది. రైతులతో చర్చలు మొదలు పెట్టిన గులాబీ నేతలు తగిన న్యాయం చేస్తాం నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గులాబీ చర్చలు ఫలిస్తాయా లేక ప్రతిబందకంగా మారుతాయా అన్నది ఆసక్తి కరంగా మారింది.

పసుపు, ఎర్రజొన్న సాగు చేసే రైతులు తమ నిరసన సెగను ఢిల్లీకి తగిలించాలని భీష్మించుకున్నారు. అత్యధికంగా పసుపు, ఎర్రజొన్న సాగు చేస్తున్న రైతులు ఉన్న నిజామాద్ జిల్లా నుంచి ఎంతో కాలంగా పోరాటాలు చేస్తూ వస్తున్నారు. అయినా ప్రభుత్వాల నుంచి సరైన స్పందన రావటం లేదని భావించిన రైతులు కొత్త పంథా ఎంచుకున్నారు. అందుకు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. రైతులు ప్రయోగించిన ఎన్నికల అస్త్రంతో ప్రభుత్వంలో కదలికను తెప్పించింది. సీఎం కేసీఆర్ ఆదేశంతో జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి రంగంలోకి దిగారు. రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపారు. తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

టీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల నేతలు రంగంలోకి దిగి ఎవరి స్థాయిలో వారు నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు. నామినేషన్లు వేయవద్దని దాఖలు చేసిన వాటిని ఉపసంహరించుకోవాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. ఎర్రజొన్నలు పసుపు పంటలకు మద్దతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు. ఎవరెన్ని ఒత్తిళ్లు తెచ్చినా నామినేషన్లు ఉపసంహరించుకోబోమని రైతులు చెబుతున్నారు.

పసుపు రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం ఉండే విధంగా బీజేపీ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆర్మూర్ లో బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. సభా వేదిక నుంచి పసుపు రైతుల కోసం ప్రకటన చేయనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

పసుపు బోర్డు ఏర్పాటుపై ఇచ్చిన హామీలు ఏ ప్రభుత్వమూ నెరవేర్చలేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి పసుపు, ఎర్రజొన్నలకు మద్దతు ధర ప్రకటించి పసుపు బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

నేటితో నామినేషన్ల పర్వం ముగుస్తుంటడంతో భారీగా రైతులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్ష పార్టీలు రైతులతో జరుపుతున్న చర్చలపైనే అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ చర్చలు ఫలిస్తాయా రాజకీయ పార్టీల నేతల హామీతో రైతులు దిగివస్తారా లేక ఎన్నికల బరిలో ఉంటారో అన్నది మరి కొన్ని రోజుల్లో తేలనున్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories