కొనసాగుతోన్న టీఆర్‌ఎస్‌ ఆపరేషన్ ఆకర్ష్‌...నిజామాబాద్‌‌లో ...

కొనసాగుతోన్న టీఆర్‌ఎస్‌ ఆపరేషన్ ఆకర్ష్‌...నిజామాబాద్‌‌లో ...
x
Highlights

అటు కాంగ్రెస్‌ ఇటు టీడీపీ రెండింటికీ కంటి మీద కునుక లేకుండా చేస్తోంది టీఆర్‌ఎస్‌. అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టిన గులాబీ పార్టీ కొద్దోగొప్పో...

అటు కాంగ్రెస్‌ ఇటు టీడీపీ రెండింటికీ కంటి మీద కునుక లేకుండా చేస్తోంది టీఆర్‌ఎస్‌. అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టిన గులాబీ పార్టీ కొద్దోగొప్పో మిగిలిన ముఖ్యనేతలనూ లాగేసుకుంటోంది. టీఆర్‌ఎస్‌ ఆపరేషన్ ఆకర్ష్‌ దెబ్బకు కాంగ్రెస్‌, టీడీపీలు విలవిల్లాడిపోతున్నాయి.

టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్ కొనసాగిస్తోంది.‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్ధులను చావుదెబ్బ కొట్టిన గులాబీ పార్టీ కాంగ్రెస్‌, టీడీపీ తరపున గెలిచిన ఆ కొద్దిమంది ఎమ్మెల్యేలను కూడా లాగేసుకుంటోంది. టీఆర్‌ఎస్‌ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌ ఇప్పుడు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. ఇక టీడీపీదీ అదే పరిస్థితి. గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు ఇప్పటికే గులాబీ గూటికి చేరిపోయారు. ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికలు రావడంతో కాంగ్రెస్‌, టీడీపీల్లో కొద్దోగొప్పో ఉన్న బలమైన నేతలపై టీఆర్‌ఎస్‌ గురిపెట్టింది. 16 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తోన్న గులాబీ బాస్‌ ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. అందుకే ఆపరేషన్ ఆకర్ష్ కంటిన్యూ చేస్తూ ప్రజల్లో పట్టున్న నేతలకు వల విసురుతున్నారు. తాజాగా టీటీడీపీ సీనియర్ లీడర్ మండవ వెంకటేశ్వర్రావు కోసం ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆరే రంగంలోకి దిగారు. స్వయంగా మండవ ఇంటికెళ్లిన కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారు. దాంతో మండవ కారెక్కడం ఖాయమైంది.

నిజామాబాద్‌లో ఒక్కసారిగా మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలోనే మండవను కేసీఆర్‌‌ కలిశారనే ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్‌లో రైతులు పెద్దఎత్తున నామినేషన్లు వేయడంతో, రిస్క్‌ తీసుకోకూడదని భావించిన కేసీఆర్‌ కవిత గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది. అందుకే ఐదుసార్లు ఎమ్మెల్యేగా, అలాగే మంత్రిగా పనిచేసిన మండవకు నిజామాబాద్‌ జిల్లాలో రైతులతో మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తించి, పార్టీలోకి ఆహ్వానించినట్లు చెబుతున్నారు. మండవ రాకతో రైతన్నలు కాస్త మెత్తబడే అవకాశముందని, దాంతో కవిత గెలుపు నల్లెరు మీద నడక కావడమే కాకుండా మంచి మెజారిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories