హరీష్ రావు..కవిత బాటలో మరికొందరు గులాబీ నేతలు

హరీష్ రావు..కవిత బాటలో మరికొందరు గులాబీ నేతలు
x
Highlights

తెలంగాణ‌లో ట్రేడ్ యూనియ‌న్ల‌కు టీఆర్ఎస్ నేత‌లు ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతున్నారు. ఒకప్పుడు యూనియన్లను ముందు ఉండి నడిపిన నేతలు వరుసగా రాజీనామాలు...

తెలంగాణ‌లో ట్రేడ్ యూనియ‌న్ల‌కు టీఆర్ఎస్ నేత‌లు ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతున్నారు. ఒకప్పుడు యూనియన్లను ముందు ఉండి నడిపిన నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. గులాబీ బాస్ ఆదేశాలతోనే రాజీనామాలు చేస్తున్నారా సొంత నిర్ణయంతో అధ్యక్ష పదవులు వదులుకుంటున్నారా వరుస రాజీనామాలకు కారణాలేంటీ..?

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు కీలక పాత్ర పోషించాయి. టీఆర్ఎస్ పార్టీకి ఉద్యమ సమయంలో వెన్నుదన్నుగా నిలిచాయి. అదేక్రమంలో హైదరాబాద్ సిటీలో టీఆర్ఎస్ అనుబంధంగా ట్రేడ్ యూనియన్ల బలోపేతానికి టీఆర్ఎస్ నేతలు కృషి చేశారు. ఆ క్రమంలోనే ఆర్టీసీ, సింగరేణి, కాంట్రాక్టు కార్మికులు. ఎన్జీవోలు, టీజీవోలు, లాయర్లు, డాక్టర్ల సంఘాలు టీఆర్ఎస్ కు అండగా నిలిచాయి. ఆయా సంఘాల అండతో హైదరాబాద్ లో ఉద్యమాలను నిర్మించింది టీఆర్ఎస్. అప్పటి నుంచే ఆయా సంఘాలకు టీఆర్ఎస్ ముఖ్యనేతలు గౌరవ అధ్యక్షులుగా కొనసాగుతూ వచ్చారు.

తెలంగాణలో రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్న హరీష్ రావు ఆ పదవికి రాజీనామా చేశారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉన్న హరీష్ రావు పదవి నుంచి తప్పుకున్న కొద్ది రోజులకే తెలంగాణ బొగ్గు గని. విద్యుత్ కార్మిక సంఘం, అంగన్ వాడి, పాఠశాల యాజమాన్యాల సంఘాలకు గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న ఎంపీ కవిత రాజీనామా చేశారు. అటు టీఎంయూ గౌరవధ్యక్ష పదవికి హరీష్ రావు ఇటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి కవిత రాజీనామా రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇరువురు నేతలు ఆయా సంఘాలు బలోపేతం చేస్తూ వచ్చారు. గుర్తింపు సంఘాల ఎన్నికల్లో పలుమార్లు గెలిపించారు.

మరోవైపు హరీష్ రావు కవిత బాటలోనే మరికొందరు గులాబీ నేతలు నడిచే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేట్ సంఘాలకు గౌరవాధ్యక్షుడుగా కొనసాగున్నఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, కాంట్రాక్టు ఉపాధ్యాయుల సంఘం గౌరవ అధ్యక్షుడు పాతూరి సుదాకర్ రెడ్డి టీఎన్జీవో సంఘం గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్ పదవుల నుంచి తప్పుకుంటారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల ముందు పనిభారంతో రాజీనామాలు చేస్తున్నామని గులాభి నేతలు చెబుతున్నా సీఎం కేసీఆర్ ముందస్తు సూచనలతోనే పదవులు నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories