Top
logo

తెలుగు రాష్ట్రాల్లో నేటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ

తెలుగు రాష్ట్రాల్లో నేటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ
X
Highlights

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరుకుంది. ఆఖరి నిమిషంలో టికెట్లు దక్కించుకున్న ఆశావాహులు,...

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరుకుంది. ఆఖరి నిమిషంలో టికెట్లు దక్కించుకున్న ఆశావాహులు, టికెట్లు దక్కని అసంతృప్తులు, సంఖ్యాశాస్త్రం, ముహూర్తాలు, జాతకాలతో ఇప్పటివరకు వేచి ఉన్న వారంతా ఈ రోజు నామినేషన్ల బాట పట్టనున్నారు. దీంతో అటు ఏపీ ఇటు తెలంగాణల్లో నేడు నామినేషన్ల జాతర జరగనుంది.

ఈ నెల 18 నుంచి ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఈ సాయంత్రం మూడు గంటలకు ముగియనుంది. చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఆవాహహులు పోటీకి దిగుతున్నారు. ఏపీలో అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్‌కు ఎన్నికల జరుగుతూ ఉండటంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలవుతున్నాయి. శ్రీకాకుళం నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీ తరపున నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో పాటు శ్రీకాకుళం పార్లమెంట్ వైసీపీ అభ్యర్ధిగా దువ్వాడ శ్రీనివాసరావు, బీజేపీ అభ్యర్ధిగా సాంబమూర్తి ఈ రోజే నామినేషన్ వేయనున్నారు. ఇక జిలాల్లోని నరసన్నపేట నుంచి టీడీపీ అభ్యర్ధిగా బగ్గు రమణమూర్తి నామినేషన్ దాఖలు చేస్తారు .

విజయనగరం జిల్లాలో మంత్రి సుజయ కృష్ణ రంగారావు బొబ్బిలి నుంచి నామినేషన్ వేయనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టీడీపీ అభ్యర్ధిగా బడేటి బుజ్జి, కొవ్వూరు నుంచి అనిత నామినేషన్లు వేయనున్నారు. ఇక అరకు పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత తాను స్ధాపించిన జన జాగృతి పార్టీ నుంచి విశాఖ ఎంపీతో పాటు విశాఖ సౌత్ ఎమ్మెల్యేగా నామినేషన్ వేయనున్నారు. ఇక కర్నూలు జిల్లా శ్రీశైలం నుంచి టీడీపీ అభ్యర్ధిగా బుడ్డా రాజశేఖరరెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న జమ్ములమడుగులో అధికార, విపక్షాల అభ్యర్ధులు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీడీపీ తరపున మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, వైసీపీ తరపున సుధీర్ రెడ్డి నామినేషన్‌ వేయనున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా జమ్ములమడుగులో పోలీసులు 144 సెక్షన్ విధించారు. బయటి వ్యక్తులు రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ సీటు దక్కించుకున్న అభ్యర్ధులతో పాటు కాంగ్రెస్‌లోని పలువురు అభ్యర్ధులు నామినేషన్లు వేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 220 నామినేషన్లు దాఖలు కాగా ఇందులో నిజామాబాద్ నుంచి అత్యధికంగా 60 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ రోజు మరో వంద మంది నామినేషన్లు వేస్తారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి సీట్లు దక్కించుకున్న అభ్యర్ధులు కూడా నేడు నామినేషన్లు వేయనున్నారు. దీంతో నామినేషన్ కేంద్రాలు సందడిగా మారనున్నాయి.

వాస్తవానికి నామినేషన్లకు ఎనిమిది రోజులు సమయం ఉన్నా సరైన మూహూర్తాలు లేకపోవడం, వరుస సెలవులతో పలు చోట్ల నామినేషన్ల దాఖలు ఆలస్యమయ్యింది. ప్రధాన పార్టీలకు చెందిన అధినేతలు శుక్రవారమే తమ నామినేషన్లు దాఖలు చేశారు.

Next Story