Top
logo

లక్షా 82 వేల 17 కోట్లు...ఇది కేసీఆర్ పద్దు

లక్షా 82 వేల 17 కోట్లు...ఇది కేసీఆర్ పద్దు
X
Highlights

లక్షా 82 వేల 17 కోట్లు. ఇది కేసీఆర్ పద్దు. 2019-20 సంవత్సారానికి గాను ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టిన ...

లక్షా 82 వేల 17 కోట్లు. ఇది కేసీఆర్ పద్దు. 2019-20 సంవత్సారానికి గాను ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలోనూ పూర్తి బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఆరవ బడ్జెట్‌‌ను ఓటాన్ అకౌంట్ రూపంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలంగాణలో ఇదే తొలిసారి. మొత్తం లక్షా 82,017 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను సీఎం రూపొందించారు. రెవెన్యూ వ్యయం లక్షా 31,629 కోట్లు కాగా మూలధన వ్యయం 32,815 కోట్లు. ఇక రెవెన్యూ మిగులు 6,564 కోట్లు కాగా ఆర్థికలోటు 27,749 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆయా పథకాలకు నిధులు కేటాయించారు.

ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆసరా పెన్షన్లను రెట్టింపు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. 2019- 20 బడ్జెట్‌‌లో ఆసరా పెన్షన్ల కోసం 12, 067 కోట్లు కేటాయించారు. అలాగే బియ్యం సబ్సిడీ కోసం 2,744 కోట్లు,కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌కు 1,450 కోట్లు కేటాయించారు. ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగులకు 3016 భృతి ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం తాత్కాలిక బడ్జెట్‌లో 1810 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. నిరుద్యోగ భృతికి సంబంధించి విధివిధానాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

తాత్కాలిక బడ్జెట్‌లో షెడ్యూల్ కులాల ప్రగతి కోసం రూ.16,581కోట్లు కేటాయించారు. అలాగే ఎస్టీల అభ్యున్నతి కోసం 9,827కోట్లు, మైనార్టీల సంక్షేమానికి 2004 కోట్లు కేటాయించారు. ఇక సంచార జాతుల కులాలు, అత్యంత వెనుకబడిన కుటాల వారికి ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పొరేషన్‌కు 1000 కోట్లు కేటాయించారు. ఇక రైతు రుణమాఫీకి 6వేల కోట్లు , రైతు బంధు పథకానికి 12 వేల కోట్లు, రైతు బీమా కోసం 650 కోట్లు , వ్యవసాయ శాఖకు 20.107 కోట్లు కేటాయించారు. రైతు బంధు సాయం కింద ఇక నుంచి ఎకరానికి 10వేలు ఇస్తామన్న కేసీఆర్ 2018 డిసెంబర్ 11 నాటికి ఉన్న లక్ష వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ ఏడాదికిగాను తాత్కాలిక బడ్జెట్‌లో వైద్య ఆరోగ్య శాఖకు కేసీఆర్ 5,536 కోట్లు కేటాయించారు. అలాగే సాగునీటి రంగానికి రూ.22,500 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు రానున్న ఐదేళ్లలో కృష్ణా, గోదావరిలలో తెలంగాణ వాటాను సమర్థంగా వినియోగించుకొని కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అన్నారు. కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కారణంగా ఎన్ని నిధులు వస్తాయో స్పష్టత లేదనీ అందుకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని కేసీఆర్ వివరించారు.

Next Story