కేసీఆర్‌ చేతిలోనే ఆ శాఖలు

కేసీఆర్‌ చేతిలోనే ఆ శాఖలు
x
Highlights

మంత్రులకు శాఖల కేటాయింపులోనూ సీఎం కేసీఆర్ మార్క్ కనబడుతోంది. కొత్త మంత్రులకు శాఖలను కేటాయించిన కేసీఆర్ కీలకమైన పలు శాఖలను తన దగ్గరే ఉంచుకున్నారు....

మంత్రులకు శాఖల కేటాయింపులోనూ సీఎం కేసీఆర్ మార్క్ కనబడుతోంది. కొత్త మంత్రులకు శాఖలను కేటాయించిన కేసీఆర్ కీలకమైన పలు శాఖలను తన దగ్గరే ఉంచుకున్నారు. ఇరిగేషన్, రెవెన్యూలాంటి కీలక శాఖలను తన వద్దే ఉంచుకున్న కేసీఆర్ ఈసారి బడ్జెట్‌ ను కూడా తానే ప్రవేశపెట్టనున్నారు.

కొత్త మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం కేసీఆర్‌ కీలక శాఖలను మాత్రం తన వద్దే ఉంచుకున్నారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రితో పాటు మహమూద్‌ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. అలీకి హోం శాఖను కేటాయించిన సీఎం 66 రోజుల తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించారు. అయితే, మంత్రుల ఎంపికతో పాటు శాఖల కేటాయింపుపైనా పలు రకాల ప్రచారాలు జరిగినా కీలక శాఖలను మాత్రం తన వద్ద ఉంచుకున్నారు సీఎం కేసీఆర్. ఆర్థిక శాఖ, నీటి పారుదల శాఖ, రెవెన్యూ, పురపాలక ఇలాంటి ప్రధానమైన శాఖలేవీ కొత్త మంత్రులకు కేటాయించలేదు.

రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాగునీటి రంగంపై జరిగిన సమీక్షలో ఇక మీ మంత్రిని నేనే, అని సీఎం పేర్కొనడంతో నీటిపారుదల శాఖను ఆయనే నిర్వహిస్తారనే వాదనలు వినిపించాయి. గత కొన్నిరోజులుగా ప్రాజెక్టులపై సమీక్షలు చేయడం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో చర్చించడాన్ని బట్టి సాగునీటి శాఖ సీఎం దగ్గరే ఉంటుందని స్పష్టమైంది. అయినా, మంత్రివర్గ విస్తరణ తర్వాత దీనిపై మరింత స్పష్టత వస్తుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఇరిగేషన్ శాఖను ఎవరికీ కేటాయించకుండా తన వద్దే ఉంచుకున్నారు. దీంతో పాటు పలు కీలక శాఖలను కూడా ఎవరికీ కేటాయించలేదు.

గత ప్రభుత్వంలో కేటీఆర్‌ నిర్వహించిన మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమలు హరీశ్‌ రావు నిర్వహించిన ఇరిగేషన్‌ తో పాటు ఎవరికీ కేటాయించని కీలకమైన ఆర్థిక, రెవెన్యూ శాఖలను సీఎం కేసీఆర్‌ వద్దే ఉన్నాయి. దీంతో మంత్రులకు శాఖల కేటాయింపులో కేసీఆర్‌ మార్క్‌ కనిపించిందని టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. తొలి ప్రభుత్వంతో పోలిస్తే, ఈసారి మంత్రివర్గం వైవిధ్యం కనిపిస్తోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

మరోవైపు, ఆర్థిక శాఖను ఎవరికీ కేటాయించనందున ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ముఖ్యమంత్రే ప్రవేశపెట్టనున్నారు. గత ప్రభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖను కొంతకాలం శ్రీనివాసయాదవ్‌ నిర్వహించారు. ఆయన నుంచి తప్పించిన తర్వాత ఎవరికీ కేటాయించకుండా ముఖ్యమంత్రి వద్దే ఉండగా, ఇప్పుడు కూడా ఎవరికీ కేటాయించలేదు. విద్యుత్తు శాఖ, సమాచార శాఖ, మైనింగ్‌ కూడా ఎవరికీ అప్పగించలేదు. శాఖలను క్రమబద్ధీకరించి కేటాయిస్తారనే ప్రచారం జరిగినా ప్రస్తుత శాఖల కేటాయింపులో అదెక్కడా కనిపించలేదు. ఇలా ముఖ్య శాఖలన్నీ ముఖ్య మంత్రి దగ్గరే ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories