logo

మూడు పార్టీల త్రిముఖ వ్యూహం ఎలా ఉండబోతోంది?

మూడు పార్టీల త్రిముఖ వ్యూహం ఎలా ఉండబోతోంది?
Highlights

ఎగ్జిట్‌పోల్స్‌ వచ్చాయి ఎగ్జాక్ట్‌ ఫలితాల కోసం దేశం ఎదురుచూస్తోంది. ఎన్డీయేదే విజయమంటూ ఎగ్జిట్‌పోల్స్‌ ఢంకా...

ఎగ్జిట్‌పోల్స్‌ వచ్చాయి ఎగ్జాక్ట్‌ ఫలితాల కోసం దేశం ఎదురుచూస్తోంది. ఎన్డీయేదే విజయమంటూ ఎగ్జిట్‌పోల్స్‌ ఢంకా బజాయిస్తుంటే రాబోయే కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్రపై తెలుగు రాష్ట్రాల్లోని మూడు ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఎన్నికలు ముగిసీ ముగియగానే చంద్రబాబు జాతీయ బాట పడితే ఎగ్జిట్‌పోల్స్‌ వచ్చాక కూడా కేసీఆర్‌, జగన్‌ పల్లెత్తు కూడా మాట్లాడకుండా రాజకీయ వ్యూహాలు పదును పెడుతున్నారు. ఇంతకీ ఎవరి ప్లాన్‌ ఏంటి? ఎవరేం చేయబోతున్నారు? మూడు పార్టీల త్రిముఖ వ్యూహం ఎలా ఉండబోతోంది?

సారు... కారు... పదహారు... అంటోంది టీఆర్ఎస్‌. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యాన్ని చూపించిన టీఆర్ఎస్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా 17కి, 16 సీట్లు తమవేనంటోంది. ఎగ్జిట్‌పోల్స్‌లో కూడా దాదాపు అన్ని సర్వేలు టీఆర్ఎస్‌కే పట్టం కట్టడంతో తిరుగులేని ఆధిక్యంలో కారు జోరు తగ్గదని టీఆర్ఎస్‌గా గట్టిగా నమ్ముతోంది? మరి అనుకున్నన్ని సీట్లు వస్తే కేంద్రంలో కారు పోషించే పాత్ర ఏంటి?

సారు... కారు... పదహారు

ఇది టీఆర్ఎస్‌ స్లోగన్‌

అసెంబ్లీ ఆధిక్యాన్ని కొనసాగిస్తే...

తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే....

కారు పార్టీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటి?

ఇవీ తెలంగాణ రాజకీయాలపై సామాన్యమైన అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరినీ, రాజకీయ విశ్లేషకులను ఆలోచింపచేస్తున్న ప్రశ్నలు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచీ రాబోయే కేంద్రం ప్రభుత్వంలో తాము ప్రధాన పాత్ర పోషిస్తామని ముందునుంచీ ఆ పార్టీ నేతలు కుండబద్దలు కొడుతూనే ఉన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతున్నదని, కీలకంగా మారే ప్రాంతీయ పార్టీల్లో కారుదే కీరోల్‌ అంటూ చెబుతూనే ఉన్నారు. జాతీయ పార్టీలకు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసేంత మెజార్టీ రాదన్న నమ్మకంతో ఉన్న కారు పార్టీ యూపీఏ, ఎన్డీయేలో లేని ఇతరపక్షాలు కీలకంగా మారుతామని చెబుతోంది. సంకీర్ణాల వల్ల స్థిరమైన ప్రభుత్వం ఉండదనే మాట సరికాదంటున్నారు ఆ పార్టీ అగ్రనేతలు.

ఏమైనా పదహారు మంది ఎంపీలను గెలిపించుకొని తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్ర రాజకీయాల్లో కీలకం కానున్నదంటున్నారు విశ్లేషకులు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములై రాష్ట్రానికి రావాల్సిన నిధులను, దక్కాల్సిన ప్రయోజనాలను, తెలంగాణ విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను సాధించి రాష్ట్రంలో మరింత పట్టు సాధించేందుకు కారు పార్టీ ఖతర్నాక్‌ వ్యూహ రచన చేస్తుందంటున్నారు పరిశీలకులు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నివర్గాల ప్రజలకు మేలు చేసే లక్ష్యంతో అనేక పథకాలు అమలు చేసి ప్రజల్లో విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించిందని చెబుతున్న పార్టీ నేతలు 16 మంది ఎంపీలను గెలిపించుకొని దేశంలో సంకీర్ణ రాజకీయాల్లో క్రియాశీలపాత్ర నిర్వహించబోతున్నదని తేల్చిచెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములమై రాష్ర్టానికి రావాల్సిన అన్నింటిని సాధిస్తామంటున్న కారు పార్టీ కేంద్రాన్ని అడుక్కునే స్థాయి నుంచి డిమాండ్‌ చేసే స్థాయికి వస్తామని చెబుతోంది.

ఇక జగన్‌ పార్టీ కూడా కింగ్‌మేకర్‌గా మారుతుందా? వైసీపీ కూడా సేమ్‌ టు సేమ్‌ తెలంగాణలో టీఆర్ఎస్‌ వ్యూహాన్నే అమలు చేస్తుందన్న చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో ఫ్యాన్‌ విన్‌ అయితే పోషించే పాత్ర ఏంటి? అనుకున్నన్ని స్థానాలు ఖాతాలో వేసుకుంటే ఏ పార్టీకి మద్దతిచ్చి కీ రోల్‌ పోషిస్తుంది?

వైసీపీ కింగ్‌ మేకర్‌ అవుతుందా?

ఫ్యాన్‌ విన్‌ అయితే కేంద్రంలో ఎవరికి లాభం

కేంద్ర రాజకీయాల్లో వైసీపీ పాత్ర ఏంటి?

ఏ కూటమికి జగన్‌ పార్టీ మద్దతిస్తుంది?

తెలంగాణలో టీఆర్‌ఎస్ ఏ స్ట్రాటజీనైతే అమలు చేస్తుందో అదే వ్యూహాన్ని జగన్‌ అమలు చేస్తున్నారా? కేంద్ర రాజకీయాల్లో, రాబోయేది సంకీర్ణ సర్కారే అంటూ జరుగుతున్న చర్చల్లో వైసీపీ పాత్ర ఏంటన్న దానిపై రాజకీయవర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీపై గెలుపుపై ధీమా వచ్చిందంటున్న విశ్లేషకులు కేంద్రంలో పోషించేబోయే పాత్రపై అంచనాలు వేసుకుంటున్నారని చెబుతున్నారు. పోలింగ్ శాతం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకతకు దారి తీస్తోందని వైసీపీ అంచనా వేస్తుంది.

ఏపీలో అధికారం తమదే అనే నమ్మకంలో ఉన్న వైసీపీ కేంద్రంలోనూ తమ పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తుందని గట్టిగా నమ్ముతోంది. కేంద్రంలో హంగ్ వస్తే ఏదో ఒక కూటమిలో చేరనున్న వైసీపీకి కచ్చితంగా కొన్ని మంత్రి పదవులు లభించడం ఖాయమంటోంది. రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ అధికారంలో తమ భాగస్వామ్యం ఉంటుందని భావిస్తున్న వైసీపీ అధినేత లైన్ క్లియర్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారన్నది విశ్లేషకుల అంచనా. ఒకవేళ తాము అనుకున్న దానికంటే ఎంపీ సీట్లు అధికంగా వచ్చి కేంద్రంలో మరిన్ని పదవులు వచ్చే అవకాశం ఉంటే పోషించే పాత్రపై వైసీపీలో సమాలోచనలు చేస్తోంది.

తర్వాతి వంతు తెలుగుదేశం. ఫలితాలు వెలువడ్డాక టీడీపీ పాత్ర ఏంటి? కేంద్రంలో పోషించబోయే పాత్ర ఏంటి? కమలంతో కలహాలున్నా కాపురం చేస్తారా? లేదా యూపీయేకు స్నేహ హస్తాన్ని అందిస్తారా? కేంద్రంలో, సంకీర్ణ రాజకీయాల్లో చక్రం తిప్పిన అనుభవమున్న చంద్రబాబు ఈసారి ఎలాంటి వ్యూహాన్ని పట్టాలెక్కించనున్నారు?

కమలంతో కలహాల కాపురం చేస్తారా?

యూపీయేకు స్నేహ హస్తాన్ని అందిస్తారా?

గతంలో చక్రం తిప్పిన అనుభవంతో ఇప్పుడేం చేస్తారు?

సంకీర్ణమే ఏర్పడితే చంద్రబాబు స్టెప్పేంటి?

ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తరువాత బీజేపీకి బద్ధ శత్రువుగా మారిపోయారు చంద్రబాబు. మరీ ముఖ్యంగా మోడీ, అమిత్ షాకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. కాంగ్రెస్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రావాలని చంద్రబాబు బలంగా కోరుకుంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకు బదులుగా ఏపీ నుంచి వైసీపీ మద్దతు తీసుకుంటే పరిస్థితి ఏంటనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జగన్ కేంద్రంలో కాంగ్రెస్‌తో కలిస్తే తాను ఎటు వైపు ఉండాలనే అంశంపై కూడా చంద్రబాబు ఓ క్లారిటీతో ఉన్నారని చెబుతున్నారు తమ్ముళ్లు.

మోడీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ మరో నాయకుడిని తెరపైకి తీసుకొస్తే మళ్లీ కమలానికి మద్దతిచ్చేందుకు చంద్రబాబు సుముఖంగానే ఉంటారా? ప్రస్తుతం కాంగ్రెస్ కోసం కేంద్రంలో చక్రం తిప్పుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితులు మారి బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. ఈ క్రమంలోనే ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు జాతీయ రాజకీయ రాజకీయాల్లో ఏ రకంగా వ్యవహరించాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారన్న టాక్‌ ఉంది.


లైవ్ టీవి


Share it
Top