ఇంటర్‌ విద్యార్థుల కష్టాలు కంటిన్యూ

ఇంటర్‌ విద్యార్థుల కష్టాలు కంటిన్యూ
x
Highlights

ఇంటర్‌ విద్యార్థుల కష్టాలింకా కొనసాగుతూనే ఉన్నాయి. రీ వెరిఫికేషన్‌, రీ వాల్యుయేషన్‌ పై హైకోర్టు తాజా ఆదేశాలతో సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ సందిగ్ధంలో...

ఇంటర్‌ విద్యార్థుల కష్టాలింకా కొనసాగుతూనే ఉన్నాయి. రీ వెరిఫికేషన్‌, రీ వాల్యుయేషన్‌ పై హైకోర్టు తాజా ఆదేశాలతో సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ సందిగ్ధంలో పడింది. ఈ నెల 25 న ప్రారంభం కావాల్సిన పరీక్షలు మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంటర్‌ విద్యార్థుల గందరగోళం ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ప్రశ్నాపత్రాల రీ వెరిఫికేషన్‌, రీ వాల్యుయేషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల 27 న ఫలితాలతో పాటు సమాధాన పత్రాలు కూడా వెబ్‌సైట్‌లో ఉంచాలని స్పష్టం చేసింది. దీంతో ఈ నెల 25 న ప్రారంభం కావాల్సిన ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ సందిగ్ధంలో పడింది.

విచారణలో భాగంగా కోర్టు అనుమతిస్తే గురువారమే ఫలితాలను విడుదల చేస్తామని ఈ నెల 27 నాటికి సమాధాన పత్రాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఫలితాల తరువాత గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో మరోసారి ఇబ్బందులు తలెత్తకూడదని ఇందుకోసం కేవలం ఫలితాలు విడుదల కాకుండా సమాధానపత్రాలను కూడా వెబ్‌సైట్‌లో పెడతామని వెల్లడించింది. అయితే దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఫలితాల ప్రకటన, సమాధాన పత్రాల అప్‌లోడ్ మే 27 న ఒకేసారి చేయాలని తాజా ఆదేశాలు జారీ చేసింది.

కానీ ఇప్పటికే ఈ నెల 25 నే సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించాలని ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. అయితే హైకోర్టు తాజా ఆదేశాలతో సప్లిమెంటరీ పరీక్ష నిర్వహణ సందిగ్ధంలో పడినట్లైంది. 27 న రీ వెరిఫికేషన్‌, రీ వాల్యుయేషన్‌ ఫలితాలు ప్రకటించడంతో పాటు పత్రాలను వెబ్‌సైట్లో ఉంచుతామని ప్రకటించడంతో అంతకుముందు సప్లిమెంటరీ పరీక్ష నిర్వహణ ఎలా సాధ్యం అవుతుందని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. గతంలోనే సప్లిమెంటరీ పరీక్షలపై రెండు సార్లు తేదీలు ప్రకటించి ఆ తర్వాత వాయిదా వేసిన బోర్డు ఈసారి కూడా పరీక్షలను వాయిదా వేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరోవైపు విచారణ సందర్భంగా గ్లోబరీనా సంస్థను ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఆ సంస్ధ ప్రతినిధులకు నోటీసులు జారీ చేసింది. కేసును వచ్చే నెల 6 కు వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories