రఫేల్‌ కేసు : కేంద్రానికి సుప్రీం షాక్‌

రఫేల్‌ కేసు : కేంద్రానికి సుప్రీం షాక్‌
x
Highlights

రాఫెల్‌ అంశంపై సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. రాఫెల్‌ తీర్పును పునః సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై కేంద్రం లేవనెత్తిన...

రాఫెల్‌ అంశంపై సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. రాఫెల్‌ తీర్పును పునః సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై కేంద్రం లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరాలను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రివ్యూ పిటిషనర్లు దాఖలు చేసిన పత్రాల మెరిట్‌ ఆధారంగా కేసు విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది. విచారణ తేదీని త్వరలోనే నిర్ణయిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.

రాఫెల్‌ ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇస్తూ గతేడాది డిసెంబరు 14న సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఆ సమయంలో ఒప్పందాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. అయితే ఈ తీర్పుపై మరోసారి సమీక్ష జరపాలని కోరుతూ ప్రశాంత్‌ భూషణ్‌, అరుణ్‌ శౌరీ, యశ్వంత్‌ సిన్హా న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు.

అయితే, రాఫెల్‌ ఒప్పందానికి సంబంధించి కొన్ని కీలక పత్రాలు బహిర్గతమయ్యాయి. వీటిని ది హిందూ పత్రిక ప్రచురించగా ఆ పత్రాలను రివ్యూ పిటిషనర్లు కోర్టుకు సమర్పించారు. ఈ పత్రాల ప్రాతిపదికన విచారణ జరపాలని కోరారు. అయితే దీనిపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. రక్షణశాఖ నుంచి ఆ పత్రాలను దొంగలించి వాటి ఫొటో కాపీలను కోర్టుకు ఇచ్చారని, వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరింది. అలా అక్రమ మార్గంలో తీసుకొచ్చిన పత్రాల ఆధారంగా తీర్పును రివ్యూ చేయడం సరికాదని పేర్కొంది. వాదోపవాదాలు విన్న అనంతరం కేంద్రం లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరాలను న్యాయస్థానం కొట్టివేసింది. పిటిషనర్లు దాఖలు చేసిన పత్రాల మెరిట్‌ ఆధారంగా రివ్యూ పిటిషన్లపై విచారణ జరిపేందుకు న్యాయస్థానం అంగీకరించింది. త్వరలోనే విచారణ తేదీని ఖరారుచేస్తామని వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories