Top
logo

యూపీలో వ్యూహం పన్నడంలో రాహుల్ విఫలం...ఇది కాంగ్రెస్ కి దెబ్బే...

యూపీలో వ్యూహం పన్నడంలో రాహుల్ విఫలం...ఇది కాంగ్రెస్ కి దెబ్బే...
Highlights

2019 ఎన్నికల్లో గెలుపు వ్యూహం పన్నడంలో రాహుల్ విఫలమవుతున్నారా? అన్ని రాష్ట్రాలు చక్కబెట్టుకుని గెలుపుకు...

2019 ఎన్నికల్లో గెలుపు వ్యూహం పన్నడంలో రాహుల్ విఫలమవుతున్నారా? అన్ని రాష్ట్రాలు చక్కబెట్టుకుని గెలుపుకు కీలకమైన యూపీలో బోల్తా పడ్డారా? ఎస్పీ, బీఎస్పీలను నిర్లక్ష్యం చేసి భారీ మూల్యం చెల్లించుకుంటున్నారా? అందుకే ఇప్పుడు వారిని కాకా పడుతున్నారా?

2019 సార్వత్రిక ఎన్నికలు ప్రధాన పార్టీల మధ్య టెన్షన్ పెంచుతున్నాయి. మోడీకీ గత ఎన్నికల్లా ఈ ఎన్నికలు గెలవడం అంత సులభం కావని తేలిపోయింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ చాలా కాలం తర్వాత రాష్ట్రాల్లో మెల్లిగా పాదుకోడం మొదలు పెట్టింది. కర్ణాటకలో సంకీర్ణం, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్లలో అధికారంలోకి రావడం కాంగ్రెస్ ఈ రెండేళ్లలో సాధించిన గొప్ప విజయం. ఇక మోడీ సొంత గడ్డ గుజరాత్ లో గెలుపు దక్కకపోయినా పోటీ నువ్వా, నేనా అన్న రీతిలోనే సాగింది. సంకీర్ణ రాజకీయాలే భవిష్యత్ రాజకీయాలన్నట్లుగా పరిణామాలు కనిపిస్తున్నాయి.

రాహుల్ చాలా కాలం పోరాటం తర్వాత నాయకుడుగా ఇప్పుడిప్పుడే రాణిస్తున్నారు కాస్త అనుభవం అక్కరకొస్తున్నట్లుగా కనిపిస్తోంది. చిన్న పార్టీలను, ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోవడంలో రాహుల్ సక్సెస్ అవుతున్నారనే చెప్పుకోవచ్చు. మరోవైపు ఎన్డీ ఏ కూటమిలో మాత్రం మిత్రులు ఒక్కరొక్కరుగా తప్పుకుంటున్నారు. అధికారానికి కీలకంగా చెప్పుకునే యూపీలో 2014లో 80 సీట్లకు బీజేపీ మిత్రపక్షాలు73 గెలవడంతో ఈ సారి అక్కడ రాజకీయం మలుపు తిరిగింది. ఈసారి ఎస్పీ, బీఎస్పీ కలసి బరిలోకి దిగుతున్నాయి.

యూపీని గెలిస్తే దేశాన్ని గెలిచేసినట్లేనని విశ్లేషకులు చెబుతుంటారు. కానీ కీలకమైన యూపీ విషయంలో రాహుల్ పొరపడ్డారనే అనుమానాలు కలుగుతున్నాయి. తూర్పు యూపీని గెలిచేందుకు ప్రత్యేకించి తన సోదరి ప్రియాంకను రంగంలోకి దించారు అదే సగం విజయం సాధించినట్లుగా ఫీలవుతున్నారో ఏమో తెలీదు కానీ కీలకమైన బీఎస్పీ, ఎస్పీ లను దారికి తెచ్చుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. బహుజనులు ఎక్కువగా ఉన్న యూపీలో మాయావతి ఒక బలమైన శక్తి ఆమెను కలుపుకుపోయే ప్రయత్నం చేయకపోవడం కాంగ్రెస్ కి పెద్ద దెబ్బే మాయావతి మరో రెండు చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని యూపీలో గెలుపు తనదేనని ధీమాగా ఉన్నారు యూపీలోనే కాదు దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ తో పొత్తు ఉండదని స్పష్టంగా చెప్పేసింది. యూపీలో కాంగ్రెస్ కి పెద్దగా సీన్ లేకపోయినా ఎక్కువ సీట్లు అడిగి పొరపాటు చేసింది. యూపీలో చేసిన పొరపాటును బీహార్ లో రాహుల్ పూడ్చుకున్నారు బీహార్ లో ఈశాన్యప్రాంతంలో ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ సీట్లు కేటాయించి రాహుల్ తెలివిగా వ్యవహరించారు. మిత్ర పక్షాలకు ఏకంగా 20 సీట్లు కేటాయించి కాంగ్రెస్ కేవలం 9 సీట్లతో సరిపెట్టుకోవడం వ్యూహాత్మకంగా మంచిదే.

మైనారిటీలు, ముస్లింలలో అభద్రతా భావం కలిగించిన మోడీని గద్దె దింపాలంటూ జనవరి నెలలో మమత ఆధ్వర్యంలో కొల్ కాతాలో మహా ఘటబంధన్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి రాహుల్ వెళ్లక పోయినా తాన వారితోనే ఉన్నానంటూ మద్దతు ప్రకటించారు.

మరోవైపు దేశాన్ని 40 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల షరతులకు తలొగ్గడం అనేది అవమానకరమైన చర్య అని కొందరు సీనియర్లు అంటున్నారు. ప్రాంతీయ పార్టీల పై ఆధారపడకుండా పార్టీ తనంత తానుగా బలం పుంజుకోవాలంటున్నారు. 2014లో మోడీ చాలా పెద్ద వేవ్ తో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత బీజేపీ తన ప్రాభవం కోల్పోయిందని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నా రానున్న ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఆ పార్టీకే ఉన్నాయి. ప్రతిపక్షంలో ఐక్యత లేకపోవడం, హిందూ ఎజెండాతో అడుగులేస్తున్న మోడీ ఈ ఎన్నికలలో సునాయాసంగా గెలిచేస్తారని రాజకీయ విశ్లేషకుల అంచనా.

అసలే కాషాయఎజెండాతో అడుగులేస్తున్న కమలం ఈ సారి గెలిస్తే పూర్తి హిందూ దేశంగా మారిపోతుందని లౌకిక వాద అన్న పదాన్ని తొలగించాల్సి వస్తుందని మరికొందరు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. కాబట్టి 2019 ఎన్నికలు గాంధీ కుటుంబాన్ని గెలిపించడం కోసం కాదు దేశ అస్తిత్వాన్ని నిలబెట్టడం కోసం అని కాంగ్రెస్ శ్రేణులు బలంగా ప్రచారం చేస్తున్నాయి.

Next Story