భద్రతా బలగాలకు భారీ విజయం... పుల్వామా సూత్రధారి హతం

భద్రతా బలగాలకు భారీ విజయం... పుల్వామా సూత్రధారి హతం
x
Highlights

జమ్ము కశ్మీర్‌ పుల్వామాలో గురువారం జరిగిన ఆత్మాహుతి దాడికి ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. 40 మంది జవాన్లను బలి తీసుకున్న ఆత్మాహుతి దాడి సూత్రాధారి...

జమ్ము కశ్మీర్‌ పుల్వామాలో గురువారం జరిగిన ఆత్మాహుతి దాడికి ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. 40 మంది జవాన్లను బలి తీసుకున్న ఆత్మాహుతి దాడి సూత్రాధారి అబ్దుల్ రషీద్ ఘాజీ అలియాస్ కమ్రాన్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. 9 గంటల పాటు భారీ స్థాయిలో జరిగిన కాల్పుల్లో జైషే టాప్ కమాండర్ ఘాజీతో పాటు మరో ఉగ్రవాదిని జవాన్లు మట్టుపెట్టారు. మరో నలుగురు టెర్రరిస్టుల్ని సైన్యం చుట్టుముట్టింది. ఘాజీ మరణంతో భద్రతా బలగాలకు భారీ విజయం దక్కినట్లైంది.

ఇవాళ తెల్లవారుజామున పుల్వామా జిల్లా పింగ్లన్‌‌లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పింగ్లన్‌ ప్రాంతంలోని ఇంట్లో జైషే ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఈలోగా వారు కాల్పులకు దిగడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ ఘటనలో మేజర్‌ సహా ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటనలో ఉగ్రవాదులు చొరబడ్డ ఇంటి యజమాని కూడా మృతి చెందాడు. ఐదు రోజుల క్రితం జైషే ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ ఆత్మాహుతి దాడి జరిపిన ప్రాంతానికి దగ్గర్లోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

పుల్వామా ఎన్‌ కౌంటర్‌లో హతమైన అబ్దుల్ రషీద్ ఘాజీ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు అత్యంత సన్నిహితుడు ,నమ్మకస్తుడు. ఇతను ఆఫ్ఘనిస్థాన్‌కు చెందినవాడు. పుల్వామా ఆత్మాహుతి దాడికి మూడు రోజుల ముందు కశ్మీర్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో ఘాజీ తృటిలో తప్పించుకున్నాడు. ఘాజీతో పాటు మరో 15 మంది ఉగ్రవాదులు గత నెలలో ఫూంచ్ సెక్టార్ నుంచి భారత్‌లోకి చొరబడినట్లు ఆర్మీ అనుమానిస్తోంది. పుల్వామా దాడికి పాల్పడిన ఆత్మాహతి దళ సభ్యుడు అదిల్ అహ్మద్ దార్‌కు ఘాజీనే శిక్షణనిచ్చినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories