ఎన్నికలు వాయిదా వేయండి.. ఈసీ‌కి నిజామాబాద్ అభ్యర్థుల విజ్ఞప్తి

ఎన్నికలు వాయిదా వేయండి.. ఈసీ‌కి నిజామాబాద్ అభ్యర్థుల విజ్ఞప్తి
x
Highlights

నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్‌ను వాయిదా వేయాలని అక్కడ బరిలో నిలిచిన రైతులు కోరుతున్నారు. తమకు కేటాయించిన గుర్తులను ఇమేజ్‌ రూపంలో...

నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్‌ను వాయిదా వేయాలని అక్కడ బరిలో నిలిచిన రైతులు కోరుతున్నారు. తమకు కేటాయించిన గుర్తులను ఇమేజ్‌ రూపంలో ఇప్పటివరకు ఇవ్వలేదని ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ప్రచారం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఓటింగ్ వాయిదా వేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటున్నారు.

నిజామాబాద్ ఎంపీ బరిలో నిలిచిన 185 మందిలో 178 మంది రైతులు ఉన్నారు. పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ వీరంతా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో పోటీ చేస్తున్న రైతులందరికీ ఈసీ ఎన్నికల గుర్తుల్ని కేటాయించింది. అయితే వారికి కేటాయించిన గుర్తులను ఇమేజ్‌ రూపంలో ఇప్పటివరకు ఇవ్వలేదు. గుర్తుని కేటాయించినా దానిపై స్పష్టత లేకపోవడంతో ప్రచారం చేసుకోలేకపోతున్నారు. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

నిజామాబాద్ లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గుర్తులపై ఎన్నికల సంఘం సరైన క్లారిటీ ఇవ్వలేదనీ అందుకే పోలింగ్ వాయిదా వేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రచారానికి కనీసం 10 రోజుల సమయం ఇవ్వాలని విజ్జప్తి చేశారు. వ్యవసాయం తప్ప ఎన్నికల వ్యవహారాలపై కనీస అవగాహన లేని తమకు సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయి గనక ఈ వ్యవహారంపై తమకు ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని కోరారు.

ఇక 185 మంది అభ్యర్థులకు గానూ భారీగా ఈవీఎంలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే 185 మంది ఏజెంట్లను అభ్యర్థులు నిజమించుకోవాల్సి ఉంటుంది. చిన్న పోలింగ్ బూత్‌లో 10 కంటే ఎక్కువ ఈవీఎంలను పెట్టడమే కాకుండా 185 మంది ఏజెంట్లను ఎలా కూర్చోబెడతారని ప్రశ్నిస్తున్నారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో ఎన్నికల వాయిదా వేయకపోతే కోర్టులో పిటిషన్ వేస్తామని తెలిపారు. నిజామాబాద్ బరిలో ఎక్కువ మంది రైతులే ఉండడంతో వారికి ఎన్నికల గురించి అవగాహన కల్పించాలని ఈసీ నిర్ణయించింది. ఇవాళ ఉదయం వారికి తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ నేతృత్వంలో అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories