శ్రీశైలంలో ఆధిపత్య పోరు

శ్రీశైలంలో ఆధిపత్య పోరు
x
Highlights

అక్కడ, ఎవరు ఏ పార్టీలో, ఎప్పుడుంటారో, ఎప్పుండరో తెలీదు. ఏ నాయకుడు ఏ టైంలో జెండా మారుస్తాడో తెలీదు. 2014లో కత్తులు దూసిన ప్రత్యర్థులే, కానీ జస్ట్...

అక్కడ, ఎవరు ఏ పార్టీలో, ఎప్పుడుంటారో, ఎప్పుండరో తెలీదు. ఏ నాయకుడు ఏ టైంలో జెండా మారుస్తాడో తెలీదు. 2014లో కత్తులు దూసిన ప్రత్యర్థులే, కానీ జస్ట్ కండువాలే మారాయంతే. మిగతాదంతా సేమ్‌ టు సేమ్. ఆధిపత్య పోరు కూడా అదే రేంజ్‌లోనే సాగుతోంది. ఫ్యాక్షన్, ముఠా గొడవలతో నిత్యం రావణకాష్టంలా కనిపించే, శ్రీశైలంలో రాజకీయం రంజుగా మారుతోంది.

కర్నూలు జిల్లా శ్రీశైలం. మహా పుణ్యక్షేత్రం. ఇప్పుడు రాజకీయ రణక్షేత్రాన్ని తలపిస్తోంది. 2009 పునర్విభజనలో భాగంగా ఏర్పడింది శ్రీశైలం నియోజకవర్గం. గత ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ నుంచి బుడ్డారాజశేఖర్ రెడ్డి, వైసీపీ నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు ఇప్పటి నుంచే పోటాపోటీగా సమావేశాలు జరుపుతూ ప్రచారాలు చేస్తున్నారు ఇద్దరు నాయకులు. అయితే బీజేపి, జనసేన పార్టీలు ఇప్పటి దాకా అభ్యర్థులను కాదు కదా నియోజకవర్గ ఇన్‌చార్జీలను కూడా ప్రకటించలేదు.

శ్రీశైలం పూర్వపు నియోజకవర్గం ఆత్మకూరు. 1978లో ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో తొమ్మిది పర్యాయాలు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్ ఐదు సార్లు, టీడీపీ మూడుసార్లు, వైసీపీ ఒకసారి గెలుపొందాయి. 2009 వరకు ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్న శ్రీశైలం, 2009 పునర్విభజన తర్వాత శ్రీశైలం నియోజకవర్గంగా ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన శ్రీశైలం నియోజకవర్గంలోకి ఆత్మకూరు, వెలుగోడు, శ్రీశైలం మండలం, నంద్యాల నియోజకవర్గంలోని బండి ఆత్మకూరు, మహానంది మండలాలు వచ్చిచేరాయి. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఈ నియోజకవర్గంలో, గతంలో మాజీమంత్రి బుడ్డా వెంగళరెడ్డిని చంపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ కూలిన ప్రమాద ఘటన పావురాలగుట్ట, శ్రీశైలం నియోజకవర్గంలో పరిధిలోకే వస్తుంది.

శ్రీశైలం నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికలలో టీడీపీ, కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలు బరిలో దిగాయి. అప్పట్లో టీడీపీ నుంచి ఎమ్మేల్యే బుడ్డారాజశేఖర్ రెడ్డి సతీమణి బుడ్డా శైలజా, కాంగ్రెస్ నుంచి ఏరాసు ప్రతాపురెడ్డి, పీఆర్పీ నుంచి బుడ్డా శేషురెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థి ఏరాసు ప్రతాపురెడ్డి విజయం సాధించారు.

తర్వాత జరిగిన రాష్ట్రవిభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడి టీడీపిలో చేరారు ఏరాసు. 2014 ఎన్నికలో టీడీపీ నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి, వైసీపీ నుంచి బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీ చేయగా, బుడ్డా రాజశేఖర్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డికి, ఎమ్మెల్యే బుడ్డాకు మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. 2014లో టీడీపీ నుంచి బరిలోకి దిగిన శిల్పా చక్రపాణిరెడ్డికి, టీడీపీ అధిష్టానం ఎమ్మెల్సీ ఇచ్చింది. అయితే నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అకాల మరణంతో నంద్యాల ఉపఎన్నికలో శిల్పా కుటుంబానికి కాకుండా భూమా కుటుంబానికి టీడీపీ టికెట్ ఇవ్వడంతో శిల్పా సోదరులు వైసీపీలో చేరారు. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ నుంచి పోటీచేసి భూమా కుటుంబం చేతిలో ఓడిపోయారు.

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపిలో చేరిన తర్వాత, వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీగా ఎమ్మెల్యే బుడ్డా సోదరుడు, బుడ్డా శేషిరెడ్డిని నియమించారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల బుడ్డా శేషిరెడ్డిని తొలగించి శిల్పా చక్రపాణిరెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు జగన్. దీంతో ఎమ్మేల్యే బుడ్డా, శిల్పాల మధ్య విభేదాలు ఏస్థాయికి చేరాయంటే, వ్యక్తిగత విమర్శలతో రచ్చరచ్చ చేసుకుంటున్నారు. ఎలాగైనా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం, టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీగా ప్రచార యాత్రలు సాగిస్తున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మేల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై నియోజకవర్గంలో ఉన్న అసంతృప్తిని ఆయుధంగా మలుచుకొని, ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు శిల్పాచక్రపాణిరెడ్డి. ఇలా వ్యూహ ప్రతివ్యూహాలతో శ్రీశైలం ఎన్నికల రణక్షేత్రాన్ని తలపిస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories