Top
logo

ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్న దగ్గుబాటి కామెంట్స్‌

ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్న దగ్గుబాటి కామెంట్స్‌
X
Highlights

దగ్గుబాటి ఫ్యామిలీ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. రానున్న ఎన్నికల్లో తనదైన స్టాటజీతో పావులు కదుపుతున్నారు. ...

దగ్గుబాటి ఫ్యామిలీ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. రానున్న ఎన్నికల్లో తనదైన స్టాటజీతో పావులు కదుపుతున్నారు. తల్లి , కొడుకుల రాజకీయ గేమ్‌ ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సభ్యులు వేరు వేరు పార్టీల్లో పోటీల్లో నిలవడం హాట్‌ టాపిక్‌గా మారింది. రాజకీయ పట్టుకోసం సాగుతున్న సమరంలో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఎలా మారనున్నాయి? వాచ్‌ దిస్‌ స్టోరీ.

దగ్గుబాటి పురందేశ్వరి, డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరంలేని రాజకీయ నేతలు. స్వర్గీయ ఎన్టీఆర్‌ వారసురాలిగా రాజకీయ ఎంట్రీ ఇచ్చారు పురందేశ్వరి. ఇక ఎన్టీఆర్‌ పెద్దల్లుడిగా టీడీపీ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన వెంకటేశ్వరరావు చంద్రబాబుతో విభేదించి బీజేపీలో చేరారు. ఆ తర్వాత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆహ్వానంతో కాంగ్రెస్‌లో చేరి ఎంపీ, ఎమ్మెల్యేలుగా పదవులు చేపట్టారు. కానీ రాష్ట్ర విభజన తరువాత పురందేశ్వరి బీజేపీలో చేరితే, వెంకటేశ్వరరావు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

దగ్గుబాటి పురంధరేశ్వరి కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత నందమూరి తారక రామారావు వారసురాలిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆమె ఎన్టీఆర్ కు అసలే ఇష్టం లేని కాంగ్రెస్ పార్టీలో సైతం పని చేశారు. కేంద్ర మంత్రిగా దేశ రాజకీయాల్లో పని చేసిన ఆమె గత ఎన్నికల సమయంలో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పట్టు కోల్పోయిన నేపధ్యంలో బీజేపీలో చేరారు. నాలుగేళ్లుగా బీజేపీలోనే కొనసాగుతున్నా ప్రజాభిమానాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయారు. దీంతో పార్టీ మారతారని ప్రచారం జోరందుకున్న తరుణంలో భర్త వెంకటేశ్వర్లు చేసిన కామెంట్స్‌ ఏపీ రాజకీయాల్లో దూమారం రేపాయి.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరిల వారసుడు హితేష్‌ చెంచురాం వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. పర్చూరు నియోజకవర్గం నుంచి హితేష్ రాజకీయ ఆరంగేట్రం చేయనున్నట్లు చెప్పడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాక భార్య పురందీశ్వరీ బీజేపీలోనే కంటిన్యూ అవుతారని తన కొడుకు మాత్రం వైసీపీలో వస్తారని చెప్పడంతో ప్రకాశం జిల్లాలో పొలిటికల్‌ హీటెక్కింది. హితేష్‌ ఎంట్రీతో దగ్గుబాటి ఫ్యామిలీకి రాజకీయంగా మళ్ళీ పూర్వవైభవం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దగ్గుబాటి ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నుంచి గల్లీ లీడర్ల వరకు ఫైరవుతున్నారు. దగ్గుబాటి కుటుంబం అవకాశవాద రాజకీయాలకు తెరతీసిందని ఆరోపిస్తున్నారు. అధికారం కోసం రాష్ట్రానికి నష్టం కలిగించే పార్టీలతో చేతులు కలిపారంటూ ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఇటు పర్చూరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ చీఫ్ జగన్‌ను ఎన్టీ రామారావు అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలవడంపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు రగిలిపోతున్నారు. దగ్గుబాటిని వైసీపీలోకి ఆహ్వానించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా దగ్గుబాటిని పార్టీలోకి ఆహ్వానించడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా పార్టీ కోసం శ్రమిస్తున్న నేతలకు ఒక్కమాట కూడా చెప్పకపోవడంపై గుర్రుగా ఉన్నారు.

పర్చూరులో పరిస్థితి ఇలా ఉంటే దగ్గుబాటి చర్యలు రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి. రాజకీయంగా ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న దగ్గుబాటి కుటుంబం నుంచే ఇద్దరూ వేరు వేరు పార్టీల్లో ఉండటాన్ని విశ్లేషకులు తప్పుబడుతున్నారు. భార్యను బీజేపీలోనే కొనసాగిస్తూ కుమారుడుని వైసీపీలోకి తీసుకురావడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా దగ్గుపాటి సేప్‌గేమ్‌ ప్లాన్‌ చేసుకున్నట్లు అర్థం అవుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మరోసారి కేంద్రంలో బీజేపీ పాగా వేసినా దగ్గుబాటి చేతిలో అధికారం ఉన్నట్లే అని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే దగ్గుబాటి ఫ్యామిలీ, వైసీపీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంతో పోల్చితే పర్చూరులో పరిస్థితులు మారాయి. ఒకప్పుడు ఈ నియోజకవర్గంలో దగ్గుబాటి బలమైన వర్గంగా పేరుతెచ్చుకుంది. కానీ సామాజిక సమీకరణల పరంగా చూస్తే నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువ. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్ హితేష్‌కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. మరి రాజకీయ అరంగేట్రం చేస్తున్న హితేష్‌ని నియోజకవర్గ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారోననేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Next Story