Top
logo

నగదు లావాదేవీలపై ఈసీ కొరఢా...రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందాలు

నగదు లావాదేవీలపై ఈసీ కొరఢా...రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందాలు
X
Highlights

ఒకే రోజు 10లక్షల కంటే ఎక్కువ మొత్తం బ్యాంకు నుంచి డ్రా చేస్తున్నారా...? ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు...

ఒకే రోజు 10లక్షల కంటే ఎక్కువ మొత్తం బ్యాంకు నుంచి డ్రా చేస్తున్నారా...? ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు భారీగా నగదు బదిలీ చేస్తున్నారా....? అయితే జాగ్రత్త ఇలాంటి లావాదేవీలపై ఎన్నికల సంఘం , ఆదాయపన్ను శాఖ ఫోకస్ పెట్టింది.

ఎన్నికల నిబంధనలు బ్యాంకుల నుంచి డబ్బుల విత్ ‌డ్రాపై కొరఢా ఝుళిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 50వేల కంటే ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళితే పోలీసులు ప్రశ్నించే వారు. కానీ ఇకపై బ్యాంకు లావాదేవీలపై కూడా ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది.

నిర్ణీత స్థాయికి మించి లావాదేవీల వివరాలను బ్యాంకర్లు అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. అనుమానం కలిగిన బ్యాంకు లావాదేవీలు, ఆన్‌లైన్ చెల్లింపుల వివరాలను జిల్లా ఎన్నికల అధికారి , ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకే ఖాతా నుంచి వేర్వేరు ఖాతాలు, గ్రూపులకు చిన్న లేదా పెద్ద మొత్తం బదిలీ చేసినా వివరాలు తెలుపాలి. అభ్యర్థుల ఖర్చుకు సంబంధించి ఈసీ ప్రత్యేక నిబంధనలు అమల్లోకి తెచ్చింది. అభ్యర్థులు ప్రత్యేక ఖాతా తెరవాలి.

ఇటు నకిలీ కరెన్సీపై పోలీసులు దృష్టి సారించారు. నకిలీ కరెన్సీ తయారు చేసే వారితో పాటు చెలామణి చేసే దళారులను పట్టుకునేందుకు రాచకొండ, సైబరాబాద్ సీపీలు మహేశ్ భగవత్, సజ్జనార్‌లు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు.

ఓట్ల కోసం భారీగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో నేరగాళ్లు నకిలీ కరెన్సీ తయారు చేసే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే నగర శివారులోని అనేక ప్రాంతాల్లో నకిలీ నోట్ల తయారీ, చెలామణి చేస్తున్న అనేక ముఠాల ఆట కట్టించారు. నకిలీ నోట్లను మార్కెట్లో చెలామణి చేసేందుకు ఒరిజినల్ నోటుకు మూడు నకిలీ నోట్లు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకుని దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Next Story