ఉల్లి కోసం జనం ఇక్కట్లు

ఉల్లి కోసం జనం ఇక్కట్లు
x
Onion
Highlights

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు చుక్కలను తాకుతున్నాయి. కోయకుండానే ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. పేద, మధ్య తరగతి ప్రజలకు అందనంత ఎత్తులో ఉల్లి ధరలు ఉన్నాయి. ...

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు చుక్కలను తాకుతున్నాయి. కోయకుండానే ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. పేద, మధ్య తరగతి ప్రజలకు అందనంత ఎత్తులో ఉల్లి ధరలు ఉన్నాయి. ఉల్లి రేటు రోజు రోజుకూ పెరిగిపోతుండటం.. రైతు బజార్ల వద్ద జనం క్యూలు పెరిగిపోయి తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం సబ్సిడీపై కిలో 25 రూపాయలకు అందిస్తోంది. ఈ ఉల్లిపాయల కోసం జనం క్యూకడుతున్నారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరుగుతోంది.

ఒకప్పుడు నీటి యుద్ధాలు జరిగేవి.. ఇప్పుడు ఆ నీళ్ల స్థానాన్ని ఉల్లిగడ్డలు భర్తీ చేస్తున్నాయి. 100 మార్క్ దాటిపోయిన ఉల్లిని కొనలేక.., అది లేకుండా కూరలు వండుకోలేక జనం తిప్పలు పడుతున్నారు. కిలో ఉల్లి కొనే బదులు కిలో చికెన్ కొని ప్రై చేసుకుని లాగిద్దాం అనేస్తున్నారు మరికొందరు. ఈ నేపథ్యంలో ఉల్లి సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ సర్కార్ రైతు బజార్లలో కిలో ఉల్లిని 25 రూపాయల చొప్పున అందిస్తోంది.

ఈ బంపర్ ఆఫర్ సమాచారాన్ని తెలుసుకున్న జనం తెల్లవారుజాము నుంచే రైతు బజార్ల వద్ద క్యూకడుతున్నారు. దీంతో రైతు బజార్ల వద్ద తొక్కిసలాట జరుగుతోంది. తాజాగా విజయనగరం, విశాఖ రైతు బజార్లలో ఉల్లి కొనేందుకు రిటైల్ కేంద్రాలకు భారీగా జనం తరలివచ్చారు. ఇంతలో రైతు బజారు గేట్లు తెరిచారు. జనం సునామీలు లోపలికి చొరబడ్డారు. ఈ ధాటికి పలువురు కిందపడి సొమ్మసిల్లిపోయారు.

ఇక పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని రైతు బజార్‌కూ జనం ఉల్లికోసం ఎగబడ్డారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కిలో ఉల్లిని 25 రూపాయలకు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తుంటే అక్కడి వ్యాపారులు మాత్రం కిలో 30 చొప్పున వసూలు చేస్తున్నారు. 5రూపాయలు చిల్లర లేదంటూ పచ్చి మిరపకాయలు అంటగడుతున్నారు.

అయితే, ఉల్లి ధర రోజురోజుకూ రాకెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తుండడంతో దుకాణాల్లో ఉల్లి కనిపించడం లేదు. ఇప్పటికే రిటైల్‌ ధర కిలో రూ.160 నుంచి రూ.180 మధ్య పలుకుతోంది. ఈ ధర మరింత పెరుగుతుందన్న ఉద్దేశంతో చిరువ్యాపారులు ఉల్లిపాయలు లేవంటున్నారు. గ్రామీణ ప్రాంత కిరాణా వ్యాపారులైతే అమ్మకాలు నిలిపివేస్తున్నారు. దీంతో జనానికి ఉల్లి కష్టాలు తప్పడం లేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories