ఆరుసీట్లతో ఎన్టీఆర్ ఫ్యామిలీ రికార్డు

ఆరుసీట్లతో ఎన్టీఆర్ ఫ్యామిలీ రికార్డు
x
Highlights

నవ్యాంధ్రప్రదేశ్ రెండో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుటుంబసభ్యులే వివిధ పార్టీల తరపున అత్యధిక సీట్లు సాధించారు. మొత్తం మూడు...

నవ్యాంధ్రప్రదేశ్ రెండో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుటుంబసభ్యులే వివిధ పార్టీల తరపున అత్యధిక సీట్లు సాధించారు. మొత్తం మూడు పార్టీల తరపున రెండు లోక్ సభ, నాలుగు శాసనసభ స్థానాల కోసం పోటీకి దిగుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆరుసీట్లతో సిక్సర్ కొట్టిన ఫ్యామిలీగా ఎన్టీఆర్ కుటుంబం నిలిచింది.

భారత రాజకీయాలలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల ప్రాబల్యం అధికం కావడం ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువయ్యింది. మరికొద్దిరోజుల్లో జరిగే నవ్యాంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వివిధ రాజకీయ కుటుంబాలకు చెందిన వ్యక్తులు వివిధ పార్టీల తరపున బరిలోకి దిగుతున్నా అత్యధిక సీట్లు సాధించిన ఘనతను మాత్రం..ఎన్టీఆర్ ఫ్యామిలీనే సొంతం చేసుకొంది.

టీడీపీ హిందూపురం సిటింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇద్దరు బావలు, ఇద్దరు అల్లుళ్లు, అక్కతో కలసి వేర్వేరు పార్టీల తరపున బరిలోకి దిగారు. టీడీపీ అభ్యర్థులుగా చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ, భరత్ బరిలోకి దిగుతుంటే బాలకృష్ణ పెద్దబావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ తరపున, అక్క పురంధీశ్వరి బీజెపీ తరపున పోటీకి దిగుతున్నారు.

విశాఖ లోక్ సభ బీజెపీ అభ్యర్థిగా ఎన్టీఆర్ పెద్దకుమార్తె దగ్గుబాటి పురంధీశ్వరి పోటీకి దిగుతుంటే మరోవైపు ఆమె భర్త, ఎన్టీఆర్ పెద్దల్లుడు, మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ తరపున పర్చూర్ అసెంబ్లీ స్థానానికి పోటీపడుతున్నారు. ప్రకాశం జిల్లా నుంచి పోటీకి దిగిన ప్రతిసారీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు విజేతగా నిలుస్తూ వచ్చారు.

మరోవైపు ఎన్టీఆర్ చిన్నల్లుడు, బాలయ్య వియ్యంకుడు చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి ఏడోసారి పోటీకి దిగుతున్నారు. 1989 నుంచి 2014 ఎన్నికల వరకూ కుప్పం నియోజకవర్గఅభ్యర్ధిగా చంద్రబాబు వరుసగా ఆరు విజయాలతో డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేశారు.

చంద్రబాబు కుమారుడు, బాలకృష్ణ పెద్దల్లుడు నారా లోకేశ్ మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. బాలకృష్ణ చిన్నల్లుడు, నారా లోకేశ్ తోడల్లుడు భరత్ విశాఖ లోక్ సభ టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. భరత్ ఇద్దరు తాతలు కావూరి సాంబశివరావు, మూర్తి పార్లమెంట్ మాజీ సభ్యులే కావడం విశేషం.

విశాఖ పార్లమెంట్ స్థానం కోసం జనసేన అభ్యర్థి జెడీ లక్ష్మీనారాయణ తో బీజెపీ తరపున పురంధీశ్వరి, టీడీపీ తరపున బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ పోటీకి దిగుతున్నారు. విశాఖ లోక్ సభ పోరు ఓ వైపు రసవత్తరంకానుంటే ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఆరుసీట్లతో సిక్సర్ కొట్టడం చూస్తే వారసత్వ, కుటుంబరాజకీయాలా మజాకానా? అనుకోక తప్పదు.

Show Full Article
Print Article
Next Story
More Stories