Top
logo

లండన్ లో నీరవ్ మోడీ...మొదటిసారి చిక్కిన ఆచూకీ

లండన్ లో నీరవ్ మోడీ...మొదటిసారి చిక్కిన ఆచూకీ
X
Highlights

విదేశాలకు పారిపోయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ ఆచూకీ...

విదేశాలకు పారిపోయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ ఆచూకీ దొరికింది. ఆయన లండన్‌లో ఉన్నట్లు తేలింది. బ్రిటన్‌కు చెందిన టెలీగ్రాఫ్ పత్రిక నీరవ్ మోడీకి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. భారత దేశంలో నిందితుడిగా ఉన్న నీరవ్ మోడీ లండన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని టెలీగ్రాఫ్ పత్రిక తెలిపింది.

నీరవ్ మోడీ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద మోసానికి పాల్పడ్డాడు. ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను 14 వేల కోట్లకు పైగా మోసం చేసి విదేశాలకు చెక్కేశాడు. పీఎన్‌బీ స్కాంలో నీరవ్‌ మోడీతో పాటు ఆయన మేనమామ, గీతాంజలి గ్రూపు అధినేత మెహుల్‌ చోక్సీ ప్రధాన నిందితులుగా ఉన్నారు. వేలకోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడి విదేశాలకు పారిపోయి నీరవ్‌, చోక్సీలు ఎక్కడున్నారో ఇప్పటి వరకు స్పష్టత లేదు. మొదటిసారి నీరవ్ మోడీ ఆచూకీ లండన్‌లో లభించింది. ఐపీఎల్ కుంభకోణం నిందితుడు లలిత్ మోడీ, వేల రుణాల ఎగవేత కేసు నిందితుడు విజయ్ మాల్యా కూడా లండన్‌‌కే పారిపోవడం విశేషం.

మరోవైపు ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ అటాచ్ చేసిన ముంబైలో నీరవ్ మోడీకి చెందిన బంగళాను అధికారులు నిన్న నేలమట్టం చేశారు. ముంబైకి 90 కిలోమీటర్ల దూరంలోని కిహిమ్ బీచ్‌కు దగ్గర్లో ఉన్న భవంతిని బాంబులతో కూల్చేశారు. 33 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నీరవ్ మోడీ ముచ్చటపడి నిర్మించుకున్న ఈ భవంతి విలువ దాదాపు 40 కోట్లు. ఈ భవన నిర్మాణం కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను అతిక్రమించి అక్రమంగా నిర్మించారని, అందుకే కూల్చి వేశామని రాయగడ్ జిల్లా అధికారులు తెలిపారు. నీరవ్ మోడీ బంగళా అత్యంత పటిష్టంగా, ధృడంగా ఉండటంతో దానిని కూల్చడానికి డైనమెట్లను వాడారు.

Next Story