ఏపీ ఎన్నికల ప్రచారంలో నయా ట్రెండ్

ఏపీ ఎన్నికల ప్రచారంలో నయా ట్రెండ్
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ, జనసేన పార్టీలు ముక్కోణపు సమరంలో పోరాడుతున్నాయి. టీపీడీ...

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ, జనసేన పార్టీలు ముక్కోణపు సమరంలో పోరాడుతున్నాయి. టీపీడీ అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలోనే చావో బతుకో సమరంలో సర్వశక్తులూ ఒడ్డి అధికారం నిలుపుకోడానికి తంటాలు పడుతున్నారు. చంద్రబాబు తరపున రెండురాష్ట్రా ముఖ్యమంత్రులు, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ప్రచారం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో వేసవి తీవ్రతతో పాటు ఎన్నికల ప్రచారం సైతం రోజురోజుకూ వేడెక్కుతోంది. ప్రధానపార్టీల నేతలు వివిధ నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటనలూ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకోడానికి తంటాలు పడుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం మరో అడుగు ముందుకు వేసి జాతీయస్థాయిలో తనకు ఉన్న పరిచయాలను ఆసరా చేసుకొని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రచారబరిలోకి దించారు.

ముస్లిం మైనారీ ఓటర్లు అధికసంఖ్యలో ఉన్న కడప, ఆళ్లగడ్డ ఎన్నికల ప్రచారసభల్లో జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లాతో కలసి చంద్రబాబు పాల్గొన్నారు. జగన్ పరిణతి లేని నాయకుడంటూ ఫరూక్ అబ్దుల్లా పలురకాలుగా విమర్శించారు.

అంతేకాదు స్టీల్ సిటీ విశాఖలో ముగిసిన ఎన్నికల ప్రచారసభలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ చంద్రబాబుకు అండగా ప్రచారం నిర్వహించారు. మోసగాళ్లు, బడాబాబుల చౌకీదార్ మోడీ నుంచి దేశాన్ని రక్షించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విశాఖ ఓటర్లకు పిలుపునిచ్చారు. మోడీ హటావో, దేశ్ బచావో అంటూ నినదించారు.

తెలుగు భాషలో తన ఎన్నికల ప్రసంగం ప్రారంభించిన మమత తెలుగులోనే ముగించటం విశేషం. మరోవైవు ఢిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్ సైతం బీజెపీపైన, మోడీ పైన విరుచుకుపడ్డారు. మోడీకి ఓటేస్తే దేశానికి అరిష్టమేనంటూ హెచ్చరించారు. చంద్రబాబు గెలుపు చారిత్ర అవసరమంటూ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

ఇక జనసేనతో ఎన్నికల పొత్తు కుదుర్చుకొన్న వామపక్షపార్టీలు, బీఎస్పీ నాయకులు మాత్రం గ్లాసు గుర్తుకు ఓటేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మరో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని తనకు మద్దుతుగా బరిలోకి దించిన ఘనతను టీడీపీ అధినేత చంద్రబాబు దక్కించుకోగలిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories