19న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ...ఈసారి ఎక్కువ మంది కొత్త ముఖాలకు...

19న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ...ఈసారి ఎక్కువ మంది కొత్త ముఖాలకు...
x
Highlights

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్...

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నర్సింహన్‌‌ను కలిసిన కేసీఆర్‌ తన నిర్ణయాన్ని తెలిపారు. గవర్నర్‌తో కేసీఆర్ భేటీ తర్వాత కేబినెట్‌ విస్తరణపై ముఖ‌్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. 19న మాఘశుద్ధ పౌర్ణమి మంచి ముహూర్తం కావడంతో ఆరోజు ఉదయం 11గంటల 30 నిమిషాలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులతో ప్రమాణం చేయించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. మంత్రివర్గ విస్తరణపై సీఎంవోకు, అధికారులకు ఆదేశాలిచ్చిన కేసీఆర్‌ కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు.

తొలి విడత మంత్రివర్గ విస్తరణలో 8నుంచి 10మందికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులతోపాటు కొత్త వాళ్లతో కలిపి మంత్రివర్గ కూర్పు ఉండనున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఈసారి ఎక్కువ మంది కొత్త ముఖాలకు చోటు ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు కూడా ఛాన్స్‌ దక్కొచ్చని చెబుతున్నారు. అలాగే పాత వారిలో చాలా మందికి బెర్త్ ఉండకపోవచ్చని అంటున్నారు. ఇక టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావుకు కేబినెట్‌లో చోటు దక్కుతుందా లేదా అనేది సస్పెన్స్‌ కొనసాగుతోంది.

ప్రస్తుతం ముఖ‌్యమంత్రి కేసీఆర్‌తోపాటు హోంమంత్రి మహమూద్ అలీ మాత్రమే కేబినెట్‌లో ఉన్నారు. ఆర్థికశాఖ సహా మిగతా శాఖలన్నీ కేసీఆర్‌ వద్దే ఉన్నాయి. అయితే ఈనెల 22నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానుండటం అదే సమయంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉండటంతోనే మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి మంత్రివర్గ విస్తరణ తర్వాత అయినా ఆర్ధికశాఖను ఎవరికైనా కేటాయిస్తారా? లేక తన వద్దే ఉంచుకుంటారా? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ఆర్ధికశాఖను ఎవరికైనా కేటాయిస్తే ఫైనాన్స్‌ మినిస్టరే ఓటాన్ అకౌంట్‌ను శాసనసభలో ప్రవేశపెడతారు. లేదంటే ముఖ్యమంత్రి కేసీఆరే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories