ముగిసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు...అభ్యర్థుల్లో...

ముగిసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు...అభ్యర్థుల్లో...
x
Highlights

తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు క్యాంప్‌ల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు...

తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు క్యాంప్‌ల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూన్‌ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే, పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా టీఆర్ఎస్ అభ్యర్థులను క్రాస్ ఓటింగ్ భయం వెంటాడుతోంది.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇంతకాలం క్యాంపుల్లో గడిపిన ప్రజాప్రతినిధులు నేరుగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్యాంప్‌ల వద్దకు వెళ్లి ఓటు హక్కు ఉన్న వారితో మాక్ పోలింగ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్ గెలుపుకోసం కృషి చేయాలని సూచించారు. ఓటింగ్ రోజు క్యాంప్‌ల నుంచి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చి మరీ ఓట్లు వేయించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 902 మంది ఓటర్లు ఉండగా 883 ఓట్లు పోలయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1086 మంది ఓటర్లు ఉండగా 1073 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలో 806 ఓట్లకు గాను 797 మాత్రమే పోలయ్యాయి. అన్ని రకాలుగా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపిన టీఆర్‌ఎస్ పార్టీ వారి గెలుపుకోసం తీవ్ర ప్రయత్నాలు చేసింది.

అయితే, టీఆర్‌ఎస్ నేతలు ఈ సారి జాగ్రత్తలు పాటించినా క్రాస్ ఓటింగ్ దెబ్బతీస్తుందన్న భయంతో వణికిపోతున్నారు. నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల కంటే నల్లగొండ జిల్లాలో ఏం జరుగుతుందోనని సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఓటర్ల కుటుంబ సభ్యులను ప్రతిపక్షాలు ప్రలోబాలకు గురిచేశాయేమోనని భయపడుతున్నారు.

వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు కొంత జోష్‌లో ఉన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న నల్లగొండలో టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి మాత్రం కొంత టెన్షన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కూడా చిన్నపరెడ్డి బలంగా ఉన్నా క్రాస్ ఓటింగ్‌ జరగడంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. ఈసారి కూడా రాజగోపాల్‌రెడ్డి భార్య బరిలో ఉండటంతో ఎలాంటి వ్యూహాన్ని రచించారోనన్న భయం గులాబీ నేతల్లో కనిపిస్తోంది. మొత్తానికి ఎలాగైనా గెలవాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories