మధ్యప్రదేశ్‌లో ఓ పోలీస్‌ సాహసం

మధ్యప్రదేశ్‌లో ఓ పోలీస్‌ సాహసం
x
Highlights

రక్షకభటుడు అన్న పదానికి నిజమైన అర్థాన్ని చూపించాడో పోలీస్‌. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడిని అత్యవసర పరిస్థితిలో తన భుజాన ఎత్తుకుని మరీ ఆస్పత్రికి...

రక్షకభటుడు అన్న పదానికి నిజమైన అర్థాన్ని చూపించాడో పోలీస్‌. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడిని అత్యవసర పరిస్థితిలో తన భుజాన ఎత్తుకుని మరీ ఆస్పత్రికి తరలించాడు. మధ్యప్రదేశ్‌లో రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి పడ్డ అజిత్‌ అనే 20 ఏళ్ల యువకుడు తీవ్రగాయాలపాలయ్యాడు. విషయాన్ని తెలుసుకున్న స్థానికుడు ఒకరు పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారాన్ని అందజేశాడు. దీంతో లోకల్‌ కానిస్టేబుల్‌ పూనమ్‌ బిల్లోర్‌ డ్రైవర్‌ రాహుల్‌ సకల్లేతో కలిసి ఘటనాస్థలికి వచ్చాడు. కానీ పట్టాలపై పడి ఉన్న అజిత్‌ను ఆస్పత్రికి తరలించేందుకు అవకాశం లేకుండా పోయింది.

తీవ్రగాయాలతో అజిత్‌ ఉన్న ప్రదేశానికి వాహనాలేవీ వచ్చే పరిస్థితి లేదు. కానిస్టేబుల్‌ బిల్లోర్‌ వచ్చిన వాహనం కూడా కిలోమీటర్‌కు పైగా దూరంలో ఆపాల్సి వచ్చింది. దీంతో చేసేదేం లేక ప్రమాదంలో ఉన్నవారిని ఆదుకోవాలనే సంకల్పంతో అజిత్‌ను కానిస్టేబుల్‌ బిల్లోర్‌ తన భుజానెత్తుకున్నాడు. పట్టాలపై పరుగులు పెట్టాడు. కిలోమీటర్‌కి పైగా దూరంగా ఉన్న తన వాహనం దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి వాహనంలో అజిత్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాడు. దీంతో బిల్లోర్‌ చూపించిన తెగువతో అజిత్‌ ప్రాణాలు దక్కాయి. సరైన సమయంలో చికిత్స అందడంతో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

కానిస్టేబుల్‌ బిల్లోర్‌ చేసిన సాహసాన్ని సమాచారం అందించిన వ్యక్తే వీడియో తీశాడు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో బిల్లోర్‌ చేసిన సాహసాన్ని నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒరిజినల్‌ పోలీస్‌ అంటే బిల్లోర్ అంటూ అతడికి సెల్యూట్‌ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories