ఎన్నికల వేళ అద్వానీ సంచలన రాతలు

ఎన్నికల వేళ అద్వానీ సంచలన రాతలు
x
Highlights

బీజేపీ కురువృద్ధుడు అద్వానీ నోరు విప్పారు. లోక్‌సభ టికెట్ దక్కని తర్వాత తొలిసారి మనసులో మాట బయటపెట్టారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ...

బీజేపీ కురువృద్ధుడు అద్వానీ నోరు విప్పారు. లోక్‌సభ టికెట్ దక్కని తర్వాత తొలిసారి మనసులో మాట బయటపెట్టారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ గురించి దేశంలో జరుగుతున్న పరిణామాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. గతాన్ని గుర్తు చేసుకోండి అంటూ అద్వానీ బీజేపీ నేతలకు ప్రజాస్వామ్యం పాఠాలు బోధించారు. అద్వానీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అద్వానీ చెప్పింది ప్రధాని మోడీ గురించేనని చంద్రబాబు సహా పలువురు విపక్ష నేతలు అంటున్నారు.

బీజేపీ వ్యతిరేకులు దేశద్రోహులు కారు

విమర్శకులు జాతి వ్యతిరేకులూ కాదు

ఏప్రిల్‌ ఆరో తేదీ బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ వ్యవస్థాపక నేత ఎల్‌.కె.ఆద్వానీ సొంత పార్టీ గురించి తన బ్లాగులో చేసిన వ్యాఖ్యలివి. రాజకీయంగా వ్యతిరేకించే వారిని బీజేపీ ప్రత్యర్థులుగా చూసిందే తప్ప, దేశద్రోహులుగానో, శత్రువులుగానో పరిగణించలేదని అద్వానీ అభిప్రాయపడ్డారు. భిన్నత్వాన్ని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించడం భారత ప్రజాస్వామ్యం గొప్పదనం అన్న అద్వానీ వ్యక్తిగతంగా, రాజకీయంగా ప్రతిపౌరునికి ఉన్న స్వేచ్ఛను బీజేపీ గౌరవించిందన్నారు. మీడియా సహా అన్ని ప్రజాస్వామిక సంస్థల స్వాతంత్య్రం, సమగ్రత, మంచితనం కాపాడాలని డిమాండ్ చేసేవారిలో బీజేపీ ఎప్పుడూ ముందంజలో ఉందని గుర్తు చేశారు.

తొలుత దేశం, తరువాత పార్టీ, ఆఖరున స్వప్రయోజనాలు అని అద్వానీ చెప్పారు. సత్యం, దేశంపట్ల అంకిత భావం, పార్టీలోను, బయటా ప్రజాస్వామ్యం అనే మూడు సిద్ధాంతాల ఆధారంగా బీజేపీ పనిచేస్తుందని గుర్తు చేశారు. గతాన్ని గుర్తు చేసుకోండి ఆత్మ విమర్శ చేసుకోండి అంటూ పార్టీ నేతలకు హితవు పలికారు. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక సంప్రదాయాలను పాటించాలని సుతిమెత్తగా ఉద్బోధించారు. దాదాపు అయిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అద్వానీ తన బ్లాగులో రాయడం విశేషం.

ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్‌ షా ఎన్నికల ప్రచారంలో జాతీయ భద్రతను ప్రధాన అంశంగా చేసుకోవడం, విపక్షనేతలు పాకిస్థాన్‌‌ వ్యక్తుల్లా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్న తరుణంలో ఆద్వానీ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. దేశంలో వ్యవస్థలను బీజేపీ నాశనం చేస్తోందంటూ విపక్షాలు ఆరోపిస్తున్న సమయంలో అద్వానీ రాతలు సంచలనంగా మారాయి. అద్వానీ వ్యాఖ్యలపై మోడీ స్సందించారు. పార్టీ కంటే దేశం ముఖ్యం ఆ తర్వాతే నేను అనే సూత్రం గురించి బాగా చెప్పారని కొనియాడారు. అద్వానీ వంటి గొప్ప నేతలు బీజేపీని బలోపేతం చేశారని, ఆ పార్టీ కార్యకర్తగా గర్వపడుతున్నానంటూ మోడీ ట్వీట్ చేశారు.

అయితే అద్వానీ చేసిన వ్యాఖ్యలు మోడీని ఉద్దేశించి చేసినవేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య విలువలు తెలియని మోడీలాంటి వ్యక్తి చేతిలో బీజేపీ ఉందని, ఆయనవల్ల దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని, అదే విషయాన్ని ఇప్పుడు ఆద్వానీ సున్నితంగా చెప్పారని చంద్రబాబు ట్విటర్‌లో తెలిపారు. జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా అద్వానీ వ్యాఖ్యలపై స్పందించారు. మోడీ ప్రధాని అయిన తర్వాత అద్వానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్న ముఫ్తీ ఈ ఐదేళ్ల కాలంలో ఆయన నోరువిప్పి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories