రఫేల్‌ డీల్‌ : కేంద్రంపై మరో బాంబు

రఫేల్‌ డీల్‌ : కేంద్రంపై మరో బాంబు
x
Highlights

రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ప్రతిపక్షాల ఆరోపణలకు మరింత ఊతమిచ్చే వార్తను ఫ్రెంచ్ పత్రిక లే మాండే ప్రచురించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాఫెల్...

రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ప్రతిపక్షాల ఆరోపణలకు మరింత ఊతమిచ్చే వార్తను ఫ్రెంచ్ పత్రిక లే మాండే ప్రచురించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందాన్ని ప్రకటించిన అనంతరం అనిల్ అంబానీ నేతృత్వంలోని ఓ కంపెనీకి సుమారు 162.6 మిలియన్ డాలర్ల మేలు జరిగినట్లు ఆ పత్రిక తెలిపింది. ఈ విషయమై కాంగ్రెస్ ‌పార్టీ మరోసారి బీజేపీని టార్గెట్ చేసింది. లే మాండే పత్రిక ప్రచురించిన అంశాలపై మరోసారి విమర్శలు కురిపిస్తోంది.

రాఫెల్ యుద్ధ విమానాల వివాదం రోజు రోజుకి ముదురుతున్న నేపథ్యంలో తాజాగా మరో సంచలన కథనం బయటపడింది. ఫ్రాన్స్‌కు చెందిన లీ మోండే పత్రిక ఒక కథనం ప్రచురిస్తూ అనిల్ అంబానీకి చెందిన ఫ్రాన్సు కంపెనీకి అక్కడ ప్రభుత్వం 1100 కోట్ల మేర పన్ను మినహాయింపులు ఇచ్చినట్లు రిపోర్ట్ చేసింది. రిలయన్స్ ఫ్లాగ్ అట్లాంటిక్ ఫ్రాన్స్ పేరిట ఓవర్సీస్‌లో కార్యకలాపాలు కొనసాగించిన ఈ కంపెనీకి రాఫెల్ డీల్ కుదిరిన కొన్ని నెలల్లోనే రుణమాఫీ జరిగిందని లీ మోండే కథనంలో ప్రధానంగా పేర్కొంది.

అయితే, దీనిపై రాజకీయంగా అప్పుడే దుమారం ప్రారంభమైంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా స్పందిస్తూ మోడీ ఉంటే ఏదైనా సాధ్యమే అని విమర్శించారు. ప్రధాని మోడీ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని, ఇంకా మరెన్ని కంపెనీలు ఫ్రాన్సులో ఇలా పన్నుమినహాయింపులు పొందాయో తెలపాలని విమర్శించారు. అంతేకాదు ఈ వ్యవహారంలో క్విడ్ ప్రోకో చోటు చేసుకుందని సూర్జేవాలా ఆరోపించారు.

మరోవైపు రిలయన్స్ కమ్యూనికేషన్స్ లే మాండే కథనాన్ని ఖండించింది. సదరు పత్రిక చేసిన ఆరోపణలు నిరాధారమైనవని తెలిపింది. అంతేకాదు. రిలయన్స్ ఫ్లాగ్ అట్లాంటిక్ ఫ్రాన్స్ సంస్థకు చెందిన ట్యాక్సు వివాదం ఇప్పటిది కాదని సుమారు 10 సంవత్సరాలక్రితం నాటిదని తెలిపింది. అంతేకాదు ఫ్రాన్స్ కు చెందిన సంస్థకు 20 కోట్ల మేర నష్టాలు సంభవించినట్లు, అలాగే ఫ్రాన్స్ ట్యాక్స్ అథారిటీలు భారీ మొత్తంలో 1100కోట్ల పన్నులు విధించినట్లు పేర్కొంది.

అయితే, ఫ్రెంచ్ టాక్స్ సెటిల్ మెంట్ ప్రాసెస్ అండ్ లా ఆధారంగా, అక్కడి ప్రభుత్వంతో మ్యూచువల్ సెటిల్ మెంట్ అగ్రిమెంట్ కింద 56కోట్లు చెల్లించామని ఆర్ కామ్ వర్గాలు తెలిపాయి. అయితే ఫ్రెంచ్ పత్రిక ఆరోపణలను మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కూడా ఖండించింది. పన్ను వ్యవహారానికి, రాఫెల్ జెట్ కొనుగోలు వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని, రెండు వ్యవహారాలకు మధ్య సంవత్సరాల తేడా ఉందని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories