Top
logo

కొడాలిని అవినాష్‌ ఢీకొంటారా...గుడివాడపై బాబు, జగన్‌ల వ్యూహమేంటి?

కొడాలిని అవినాష్‌ ఢీకొంటారా...గుడివాడపై బాబు, జగన్‌ల వ్యూహమేంటి?
X
Highlights

ఒకరు మాస్‌ లీడర్‌. మరొకరు నూనుగు మీసాల కుర్రాడు. ఒకరు గ్రౌండ్‌లెవల్లో దుమ్మురేపే ఆటగాడు. మరొకరు ఇప్పుడే...

ఒకరు మాస్‌ లీడర్‌. మరొకరు నూనుగు మీసాల కుర్రాడు. ఒకరు గ్రౌండ్‌లెవల్లో దుమ్మురేపే ఆటగాడు. మరొకరు ఇప్పుడే గ్రౌండ్‌లోకి అడుగుపెడుతున్న న్యూ బౌలర్. మరి సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోతున్న వెటరన్‌ మాస్‌ ప్లేయర్‌ను, కొత్తగా వచ్చిన కుర్ర బౌలర్‌ కట్టడి చేయగలడా వికెట్‌ పడగొట్టగలడా ఒక వెటరన్ హిట్టర్‌ బ్యాట్స్‌మెన్, మరొకరు న్యూఎంట్రీ బౌలర్‌ మధ్య సాగుతున్న ఆ మ్యాచ్‌లో ఎవరి సత్తా ఏంటి? గుడివాడ గ్రౌండ్‌లో ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌ను తలపిస్తున్న టోర్నీలో ఎవరు హీరో ఎవరు జీరో?

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ బలంగా ఉందని భావిస్తున్న కొన్ని నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు. అలాంటి సెగ్మెంట్‌లలో పసుపు జెండా పాతేందుకు పక్కా స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. చంద్రబాబు లిస్ట్‌లో ఉన్న ఆ సెగ్మెంట్‌లలో ఒకటి, గుడివాడ. ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం.

గత ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా గుడివాడలో మాత్రం విజయం సాధించలేకపోయింది. అంతకుముందు రెండు ఎన్నికల్లో టీడీపీ తరపున గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. స్థానికంగా తిరుగులేని నేతగా ఎదిగారు.

కృష్ణా జిల్లాలో టీడీపీకి కొరకరాని కొయ్యగా మారిన కొడాలి నానిని, ఓడించడానికి చంద్రబాబు అనేక స్ట్రాటజీలు వేస్తున్నారు. ఆయనను ఢీ కొట్టేందుకు బలమైన అభ్యర్థి కోసం అన్వేషించారు. ఆ అన్వేషణలో చంద్రబాబుకు కనిపించిన ఆయుధం, దేవినేని అవినాష్.

మాజీమంత్రి దేవినేని నెహ్రూ తనయుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్‌. తొలిసారి ఎన్నికల రణక్షేత్రంలోకి దిగుతున్నారు. అదీ కూడా స్థానికంగా బలమైన నాయకుడైన, కొడాలి నానిపై.

టీడీపీ నుంచి గుడివాడ సీటు కోసం రావి వెంకటేశ్వరరావు పోటీ పడినా యువకుడైన అవినాష్‌ను గుడివాడ నుంచి బరిలోకి దింపితే, కొడాలి నానికి చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారు చంద్రబాబు.

గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే. మాస్‌ లీడర్‌. స్థానిక నాయకుడు. రాజకీయాలు చేయడంలో దిట్ట. సుదీర్ఘ రాజకీయ అనుభవం. కులాలవారీగాను ఆకట్టుకునేందుకు వ్యూహాలు పన్నడంలో తిరుగులేని లీడర్. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే, కమ్యూనిటీ పరంగా తానే సీనియర్‌ అని, మంత్రి పదవి ఖాయమని ఆశిస్తున్నారు కొడాలి నాని. గత ఎన్నికల్లో పవన్‌ ఇంపాక్ట్‌ ఉన్నా, టీడీపీ అనేక స్ట్రాటజీలు వేసినా, గుడివాడలో మాత్రం, నాని విజయాన్ని ఆపలేకపోయారు. కాపుల మద్దతునూ కూడగట్టి, వైసీపీ జెండా ఎగురవేశారు. సీనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని. హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌లకు కుడిభుజంగా వ్యవహరించారు నాని. జూనియర్ ఎన్టీఆర్‌ కూడా, కొడాలి నాని గెలవాలని అభిలషిస్తారు. ఇలా అనేక రకాల వ్యూహాలతో గుడివాడలో తనకు తిరుగులేదంటున్నారు కొడాలి నాని.

అయితే, కొడాలి నానికి కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. మూడుసార్లు గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచినా, అంతగా అభివృద్ది జరగలేదన్నది స్థానికుల విమర్శ. దూకుడుగా ఉంటారని, ఎవరినీ లెక్క చేయరని కూడా ఆరోపణలున్నాయి. మొత్తానికి గుడివాడలో కొరకురాని కొయ్యలా మారిన కొడాలి నానిని, ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు అనేక వ్యూహాలు వేస్తున్నారు. దేవినేని అవినాష్‌ ఒక్కడే, నానిని ఢీకొట్టగలడని నమ్ముతున్నారు.

ఇక దేవినేని అవినాష్ విషయానికి వస్తే, యువకుడు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు. వారసత్వంగా మంచి ఫాలోయింగ్ ఉంది. స్థానికంగా అనేక ధర్నాలు, ఆందోళనలు చేసి, నిత్యం వార్తల్లో ఉంటారు. మొదటి ఎన్నికలోనే, కొడాలి నాని వంటి ఉద్దండ నాయకుడిపై పోటీ చేస్తుండటంతో, అందరి దృష్టి అవినాష్‌పై పడింది. ఇప్పటికే ప్రచారాన్ని సైతం ప్రారంభించారు అవినాష్.

అయితే అవినాష్‌కు అనేక ప్లస్ పాయింట్స్‌‌ కనిపిస్తున్నా, కొడాలి నానిని ఢీకొట్టడం మాత్రం పెద్ద సవాలేనని, స్థానికులంటున్నారు. గుడివాడకు అవినాష్‌ నాన్‌లోకల్. తొలిసారి పోటీ. సామాజిక సమీకరణలు చూసుకోవడంలో అనుభవం లేదు. అయితే, చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాలు, తన తండ్రి క్లీన్‌ ఇమేజ్, తెలుగు యువత అధ్యక్షుడిగా సేవలు, స్థానిక సమస్యలపైపోరాటం, వంటి అనేక సానుకూలాంశాలు తనకున్నాయని, వీటితోనే నానిని ఢీకొడతానంటున్నారు అవినాష్.

మొత్తానికి గుడివాడ ఫైట్‌‌, రాష్ట్రవ్యాప్తగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. కొరకురాని కొయ్యగా మారిన కొడాలినాని ఓడించాలని చంద్రబాబు వ్యూహం, మరోవైపు తన సత్తా కొనసాగిస్తానని కొడాలి పట్టుదలతో, గుడివాడ సెగ్మెంట్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. చూడాలి, గుడివాడలో ఎవరి వ్యూహం ఫలిస్తుందో.

Next Story