అయ్యప్పను దర్శించుకున్న 51 మంది మహిళలు.. సుప్రీంకోర్టుకు చెప్పిన కేరళ ప్రభుత్వం

అయ్యప్పను దర్శించుకున్న 51 మంది మహిళలు.. సుప్రీంకోర్టుకు చెప్పిన కేరళ ప్రభుత్వం
x
Highlights

50 యేళ్ల లోపు మహిళలు ఏకంగా 51 మంది శబరిమలలోని అయ్యప్పను దర్శించుకున్నట్లు కేరళ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.

50 యేళ్ల లోపు మహిళలు ఏకంగా 51 మంది శబరిమలలోని అయ్యప్పను దర్శించుకున్నట్లు కేరళ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. తమకు రక్షణ కల్పించాలంటూ ఇద్దరు మహిళలు వేసిన పిటీషన్‌పై విచారణ సందర్భంగా కేరళ సర్కారు అధికారికంగా దర్శించుకున్న మహిళల వివరాలను వెల్లడించింది. సుప్రీం తీర్పు తర్వాత మహిళల దర్శనం ఎలాంటి అవాంతరాలు లేకుండా జరుగుతుందని వివరించింది.

దాదాపు 16 లక్షల మంది భక్తులు ఆలయ ప్రవేశానికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని వారిలో 7 వేల మంది మహిళలున్నట్లు కేరళ సర్కారు సుప్రీంకు సమర్పించిన జాబితాలో వెల్లడించింది. వారంతా 10 నుంచి 50 ఏళ్ల వయసులోపు వారేనని పేర్కొంది. 7 వేల మందిలో ఆలయంలోకి ప్రవేశించింది కేవలం 51 మందే అని వీరు ప్రవేశిస్తున్నప్పుడు ఎలాంటి అవాంతరాలు తలెత్తలేదని స్పష్టం చేసింది. వారంతా సన్నిధానం నుంచి బయటికు వచ్చాక టికెట్లకు పక్కాగా స్కాన్‌ చేసి పంపించామని తెలిపింది. 2018 లో ఇప్పటివరకు అయ్యప్పను దర్శించుకున్నవారి సంఖ్య 44 లక్షలని నివేదికలో తెలిపింది.

అయితే కేరళ సర్కారు సమర్పించిన జాబితాపై విమర్శలు వెల్లువెత్తాయి. నివేదికలో పేర్కొన్న మహిళల స్థానంలో కొందరు మగవారి పేర్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా దర్శించుకున్న మహిళల్లో కొద్దిమంది వయస్సు 50 ఏళ్లుగా పేర్కొన్నారు. దీంతో 50 ఆ పై వయస్సున్న మహిళలకు దర్శనం గతం నుంచీ ఉందని చెబుతున్నారు. మరోవైపు మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ వాదనలు వినిపించిన న్యాయవాది ఇప్పటివరకు అయ్యప్పను 50 ఏండ్ల లోపు మహిళలెవరూ దర్శించుకోలేదని తెలిపారు.

ఇటు అయ్యప్ప ఆలయంలోకి అడుగుపెట్టిన తొలి ఇద్దరు మహిళలు కనకదుర్గ, బిందు తమకు ప్రాణహాని ఉందన్న పిటీషన్‌పై విచారణ సందర్భంగా వారికి 24 గంటలూ భద్రత కల్పించాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే కోర్టు ఉత్తర్వులతో నిమిత్తం లేకుండా ఇద్దరు మహిళలకు ఇప్పటికే రక్షణ కల్పించామని, ఇక ముందూ కొనసాగిస్తామని కేరళ సర్కారు స్పష్టం చేసింది. ఇటు 50 ఏళ్లలోపు మహిళల ఆలయ ప్రవేశం తర్వాత అయ్యప్ప సన్నిధానాన్ని శుద్ధి చేయడాన్ని నిలిపివేయాలని పిటీషనర్ల తరపు న్యాయవాది కోరారు. అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం పిటిషనర్ల ప్రతిష్ఠకు భంగం కలిగించడమేనని వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఆలయ శుద్ధి చేపట్టవద్దని తాము ఆదేశాలివ్వలేమని స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories