Top
logo

కేసీఆర్‌కు కలిసొచ్చిన యాగాలు..మరో యాగానికీ రేడీ

కేసీఆర్‌కు కలిసొచ్చిన యాగాలు..మరో యాగానికీ రేడీ
X
Highlights

యాగాలు, యజ్ఞాలు సీఎం కేసీఆర్ కు కలిసి వచ్చాయి. ఆపద సమయంలో ఆదుకున్నాయి. ఉద్యమం నుంచి ఎన్నికల్లో గెలుపు వరకు యాగాలు అండగా నిలిచాయి. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో యాగాలు చేసిన గులాబీ బాస్ మరో యాగానికి సిద్ధమయ్యారు.

యాగాలు, యజ్ఞాలు సీఎం కేసీఆర్ కు కలిసి వచ్చాయి. ఆపద సమయంలో ఆదుకున్నాయి. ఉద్యమం నుంచి ఎన్నికల్లో గెలుపు వరకు యాగాలు అండగా నిలిచాయి. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో యాగాలు చేసిన గులాబీ బాస్ మరో యాగానికి సిద్ధమయ్యారు. ఈనెల 21 నుంచి 25 వరకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో చతుర్వేద పరస్పర మహారుద్ర సహిత సహస్ర చండీయాగం నిర్వహించనున్నారు. 200 మంది రుత్వికులు పాల్గొనే యాగానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.

దైవభక్తి, సెంటిమెంట్ అంటే గుర్తుకు వచ్చేది కేసీఆరే. ఆయన మొదలు పెట్టే ప్రతి పనికి ముందు గ్రహస్థితి, తిథి, వార, నక్షత్ర , వాస్తుబలం , ముహూర్తాలు, సంఖ్యా శాస్త్రం జాతకాలు, సిద్దాంతుల సూచనలు నమ్ముతారు. ఆ మూర్తాల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటారు కేసీఆర్. కేసీఆర్ ఏ యాగం , ఏ పూజ చేపట్టినా ఆసక్తికరంగా మారుతుంది. కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో యాగాలు ఒక భాగంగా మారాయి. ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచే యాగాలు చేస్తున్నారు గులాబీ బాస్. 1996లో సిద్దిపేటలో చిన్నజీయర్ ఆశీస్సులతో సహస్ర లక్ష్మీ సూక్త పారాయాణాలు, సహస్ర లక్ష్మీ సూక్త పారాయణ సహిత అభిషేకాలు చేశారు. 1997లో బాపిశాస్త్రి ఆధ్వర్యంలో చండీహవనం నిర్వహించారు. 2005 లో కేంద్రమంత్రిగా ఢిల్లీలోని తన నివాసంలో నవగ్రహ మఠం, చండీయాగం చేశారు.

2006లో సహస్ర చండీయాగం, 2007లో పాలకుర్తి నరసింహ రామశర్మ సిద్దాంతి ఆధ్వర్యంలో చండీయాగం, సుదర్శన యాగాలు చేశారు. 2008లో సిద్దిపేటలో కోటి లింగాల ఆలయంలో గాయత్రీ యాగం జరిపారు. 2009 ఎన్నికల అనంతరం లో తెలంగాణ భవన్ వేదికగా 27రోజుల పాటు నక్షత్ర మండల యాగం చేశారు. తర్వాత కేసీఆర్ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. 2010లో తెలంగాణ భవన్ లో చండీయాగం నిర్వహించారు. 2011లో బండ్లగూడలోని ఎంపీ జితేందర్ రెడ్డి వ్యవసాయక్షేత్రంలో శతచండీయాగం చేశారు.

2014లో తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2015 నవంబర్ 27న నవ చండీయాగం చేశారు. 2015 డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఆయుత శతచండీయాగాన్ని ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈయాగానికి ప్రాంతీయ, జాతీయ స్థాయి రాజకీయ నేతలు, అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యాగ పూర్ణాహుతి కార్యక్రమానికి విచ్చేశారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల సస్యశ్యామలంగా ఉండాలని యాగం జరిపినట్లు కేసీఆర్ చెప్పారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ తన సెంటిమెంట్ వర్కవుట్ చేశారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు వ్యవసాయ క్షేత్రంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో రాజశ్యామల యాగాన్ని రెండురోజుల పాటు నిర్వహించారు. పూర్ణాహుతి గావించిన రోజే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యంతో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది.

మరోసారి శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి ఆశీస్సులతో చతుర్వేద పరస్పర మహారుద్ర సహిత సహస్ర చండీయాగం నిర్వహించనున్నారు కేసీఆర్. ఈనెల 21 నుంచి 25 వరకు వ్యవసాయ క్షేత్రంలో యాగం జరిపేందుకు ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఆ పనులను కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 200 మంది రుత్వికులు పాల్గొనే ఈ యాగ క్రతువును తిలకించేందుకు ప్రజలకు అనుమతించాలా వద్దా అనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. మొత్తానికి కేసీఆర్ నిర్వహించబోయే యాగం ద్వారా జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాలను విజయవంతం చేయడంలో ఉపయోగపడుతుందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.

Next Story