Top
logo

టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌ ఇంట్లో ఐటీ సోదాలు

టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌ ఇంట్లో ఐటీ సోదాలు
X
Highlights

ఎన్నికల సమయంలో మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇంట్లో ఐటీ సోదాలు జరగడం కలకలం రేపింది. అయితే...

ఎన్నికల సమయంలో మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇంట్లో ఐటీ సోదాలు జరగడం కలకలం రేపింది. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల సమాచారం కానీ అక్రమ నగదు కానీ లభ్యం కాకపోవడంతో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్లిపోయారు. ఐటీ దాడులపై తీవ్రంగా స్పందించిన సీఎం చంద్రబాబు ఇలాంటి సోదాలకు భయపడేది లేదన్నారు. ఎంత అణగదొక్కితే అంత రెచ్చిపోతామని హెచ్చరించారు.

కడప జిల్లా మైదుకూరు టీడీపీ అభ్యర్థి, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇంటిలో ఐటీ అధికారులు దాడులు చేశారు. వైఎంఆర్‌ కాలనీలో ఉన్న ఆయన నివాసంలో కడప, ప్రొద్దుటూరుకు చెందిన రెండు బృందాలు సుమారు 3 గంటలపాటు సోదాలు చేశాయి. పుట్టా సుధాకర్‌ మైదుకూరు ఎన్నికల ప్రచారంలో ఉండడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో తనిఖీలు జరిగాయి.

ఐటి అధికారులు పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో సోదాలు ముగించుకుని వెళ్లే సమయానికి టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ అక్కడికి చేరుకున్నారు. పుట్టా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్న సమయంలో ఎందుకు సోదాలు చేయవలసి వచ్చిందని ప్రశ్నించారు. ఎవరు పంపించారు సోదాల్లో ఏం దొరికిందో మీడియాకు చెప్పండంటూ నిలదీశారు. దీంతో అధికారులు నీళ్ళు నమిలారు. సోదాల్లో ఏమీ దొరకలేదని స్పష్టం చేశారు.

అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు పుట్టా నివాసానికి భారీగా చేరుకొని ఐటీ అధికారుల తీరుకు నిరసనగా ధర్నా చేపట్టారు. జగన్‌, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఐటీ శాఖ అధికారులను కావాలనే టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేయిస్తోందని సీఎం రమేశ్‌ ఆరోపించారు.

ప్రధాని మోడీ ఆదేశాల మేరకు టీడీపీ నేతలే టార్గెట్‌గా లోటస్‌పాండ్‌లో కుట్ర జరిగిందని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టాలనే వైసీపీ, బీజేపీ నేతలు కలిసి కుట్ర చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. పుట్టా సుధాకర్‌ యాదవ్‌ నివాసంపై ఐటీ దాడులపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఐటీ దాడులకు భయపడేది లేదని నరసరావుపేట ఎన్నికల ప్రచారంలో అన్నారు. తమలో పల్నాడు పౌరుషం ఉందన్నారు చంద్రబాబు.

మరికొందరు టీడీపీ నేతల ఇళ్ళపై కూడా ఐటీ దాడులు జరగొచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. కొద్ది రోజుల క్రితమే మంత్రి నారాయణ ఇంట్లో, నారాయణ మెడికల్ కళాశాలల్లో ఐటీ దాడులు జరిగాయని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

Next Story