Top
logo

తెలంగాణలో రసవత్తర పోటీకి రంగం సిద్దమవుతోందా?

తెలంగాణలో రసవత్తర పోటీకి రంగం సిద్దమవుతోందా?
Highlights

అసెంబ్లీ సమరాన్ని మించిన సందర్భం మరోటి రాబోతోందా పార్లమెంట్‌ యద్ధాన్ని తలపించే మరో రణక్షేత్రం తొడగొట్టేందుకు...

అసెంబ్లీ సమరాన్ని మించిన సందర్భం మరోటి రాబోతోందా పార్లమెంట్‌ యద్ధాన్ని తలపించే మరో రణక్షేత్రం తొడగొట్టేందుకు సిద్దమవుతోందా కొన్ని పరిణామాలు వీటికి అవుననే సమాధానమిస్తున్నాయి. ఎందుకంటే, అక్కడ పోటీకి దిగుతారు అంటూ వినిపిస్తున్న ఇద్దరి పేర్లు, మామూలు పేర్లు కాదు. శాసన సమరాన్ని తలపించే, మరిపించే సివంగులు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు ఎక్కడ తలపడబోతున్నారు...వారి వెనకున్న హేమాహేమీ నాయకులెవరు?

కల్వకుంట్ల కవిత నిజామాబాద్ మాజీ ఎంపీ సీఎం కేసీఆర్‌ గారాల కూతురు. పద్మావతి కోదాడ మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సతీమణి. వీరిమధ్య పోటీ జరగబోతోందన్నది, ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌హాట్‌గా సాగుతున్న చర్చ. అంటే కేసీఆర్ కూతురు, ఉత్తమ్ భార్య మధ్య ఎన్నికల యుద్ధానికి సర్వం సిద్దమవుతోందన్నది పొలిటికల్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. ఇంతకీ వీరిద్దరూ పోటీ చేస్తారన్న వార్త ఎందుకు వినిపిస్తోంది? ఇద్దరు మహిళా నేతలు ఎక్కడ పోటీ చేసే ఛాన్సుంది? ఆ నియోజకవర్గాన్నే ఇద్దరూ ఎంచుకోవడానికి కారణమేంటి?

హుజూర్ నగర్ నియోజకవర్గం. ఇపుడు తెలంగాణ అంతా మార్మోగుతున్న పేరు. ఇక్కడ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్‌కు, అందులోనూ ఉత్తమ్‌కు కంచుకోటగా మారింది హుజుర్ నగర్.

డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌ నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే మొన్న జరిగిన పార్లమెంట్‌‌ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎంపీగానూ గెలిచారు. రెండింట్లోనూ గెలవడంతో, ఏదో ఒక దానికి రాజీనామా చేయకతప్పదు. దీంతో హుజుర్ నగర్ ఎమ్మెల్యే పదవికి నేడోరేపో రాజీనామా చేయబోతున్నారు ఉత్తమ్. అంటే హుజూర్‌నగర్‌కు ఉప ఎన్నిక అనివార్యం. మరో మూడు నాలుగు నెలల్లో హుజుర్ నగర్‌లో బైపోల్స్ ఖాయం. హుజూర్‌నగర్‌ను నిలబెట్టుకోవాలని ఉత్తమ్‌ పట్టుదలగా ఉంటే, అటు కేసీఆర్‌ కూడా అదే సీటును లక్ష్యంగా చేసుకున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే, ఇప్పుడు ఈ ఇద్దరు నాయకులకు, హుజూర్‌ నగర్‌‌‌ చాలా కీలకం. ఇక్కడి నుంచి తన భార్య పద్మావతిని పోటీ చేయించాలని ఉత్తమ్ భావిస్తుంటే, కూతురు కవితను బరిలోకి దింపి, రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్‌ ఆలోచిస్తున్నట్టుగా పొలిటికల్‌ సర్కిల్స్‌లో ప్రధానంగా చర్చ సాగుతోంది.

నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడిపోయారు కవిత. దీంతో తదుపరి ఆమె రాజకీయ అడుగులేంటన్నది సహజంగానే అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. తన కూతురు భవిష్యత్తుపై కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నారన్నది ఆసక్తి కలిగించే అంశం. మళ్లీ ఎన్నికల వరకూ కవితను కేసీఆర్‌ ఖాళీగా ఉంచరని, ఏదో మార్గంలో ప్రజలతో మమేకయ్యేలా చేస్తారని గులాబీ నేతలంటున్నారు. కవితను ఎమ్మెల్సీ చేసి, మంత్రివర్గంలోకి తీసుకోవడం ఒక ఆప్షన్ అయితే, బైపోల్స్‌లో తిరిగి ప్రజాభిమానాన్ని సాధించడం మరో మార్గం. అయితే ఎమ్మెల్సీ చేయడం సులువే అయినా, షార్ట్‌కట్‌లో కూతురును గెలిపించారన్న విమర్శలు తప్పవు. అటు పార్లమెంట్‌లో, ఇటు ప్రజల్లో విశేష అభిమానం సంపాదించిన కవితకు కూడా ఇలా ఇష్టముండదని సన్నిహితులే వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే బలమైన సీటులో పోటీ చేసి, దిగ్విజయంగా చట్టసభల్లోకి ప్రవేశించాలన్నది గులాబీ అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. అందుకు రానున్న హుజూర్‌ ఉప ఎన్నికకు మించిన ఆప్షన్‌లేదన్నది టీఆర్ఎస్ నేతల ఆలోచన.

2014 ఎన్నికలకు ముందు కూడా కవిత హుజుర్ నగర్‌లో పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. చివరకు ఆమె‌ నిజామాబాద్ నుంచి విజయం సాధించారు. అయితే గత పార్లమెంటు ఎన్నికల్లో మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుత రాజకీయ పరుస్థితుల్లో, టిపీసీసీ అధ్యక్షుడు ‌ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న హుజుర్ నగర్‌లో గులాబీ జెండా ఎగరవేయాలని టిఆర్ఎస్ ప్లాన్‌గా తెలుస్తోంది. అయితే ఒక పీసీసీ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న, అందులోనూ కాంగ్రెస్‌కు కంచుకోటగా చెప్పుకునే హుజూర్‌ నగర్‌నే ఎంచుకోవడం వెనక గులాబీ అధిష్టానం గురి వేరే ఉందని తెలుస్తోంది.

ఉత్తమ్ రాజీనామా చేసి, పార్లమెంట్‌కు వెళ్లిపోతారు. అప్పుడు భార్యనో, మరొకరినో బరిలోకి దింపుతారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లోనే హుజుర్ నగర్‌లో, టీఆర్ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి‌తో గట్టి పోటీ ఎదుర్కొన్నారు ఉత్తమ్. పీసీసీ అధ్యక్షుడై ఉండి కూడా, సొంత నియోజకర్గంలో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎక్కువరోజులు ఇక్కడే ప్రచారం చేశారు. సైదిరెడ్డిపై ఏడువేల పైచిలుకు ఓట్లతోనే నెగ్గారు. దీంతో కవితను హుజూర్‌నగర్‌లో నిలబెడితే, అభ్యర్థి ఎవరైనా తేలిపోతారని, సీఎం కుమార్తె, అందులోనూ నిజామాబాద్‌లో ఓడారన్న సానుభూతి ఓట్లు కూడా పడతాయని గులాబీ నేతలు లెక్కలేస్తున్నారు. టిఆర్ఎస్ క్యాడర్‌ మొత్తం ఇక్కడే మోహరిస్తుంది. మంత్రులు సైతం భారీగా రంగంలోకి దిగుతారు. దీంతో హుజూర్‌నగర్‌లో విజయం నల్లేరుపై నడకేనని టీఆర్ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడ కోటనే బద్దలుకొడితే, రాష్ట్రవ్యాప్తంగానూ కవితకు మంచి మైలేజ్ వస్తుందని ఆలోచిస్తున్నారు. మరి నిజంగానే హుజూర్‌ నగర్‌ నుంచి కవిత పోటీ చేస్తారా? ఒకవేళ ఇదే నిజమైతే, కవితను ఢీకొనేందుకు ఉత్తమ్ సతీమణి సిద్దమేనా?

ఒకవైపు కల్వకుంట్ల కవిత బరిలోకి దిగుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి తన కంచుకోట ఆక్రమణకు మరొకరు వస్తుంటే, ఉత్తమ్‌‌ ఊరికే ఉంటారా అస్సలుండరు. అందుకే తన భార్య పద్మావతిని అక్కడ నిలబెట్టి, యుద్ధానికి సిద్దమంటూ సిగ్నల్ ఇస్తున్నారు పీసీసీ చీఫ్. కోదాడ కాకుండా మరో చోట పోటీ చేయనని ఆమె అంటున్నా, హుజూర్‌ నగర్‌ను వదులుకోవద్దన్న ఏకైక లక్ష్యంతో పట్టుదలతో ఉన్నారు ఉత్తమ్. మరి కవిత నిలబడితే ఉత్తమ్ వ్యూహాలేంటి?

హుజుర్ నగర్ బైపోల్స్‌లో టీఆర్ఎస్‌ నుంచి కవిత అంటూ టాక్ నడుస్తుంటే, కాంగ్రెస్ నుంచి ఎవరనేది ఇంకా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఉత్తమ్ సతీమణి, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె ఇందుకు విముఖతతో ఉన్నట్లు సమాచారం. కోదాడలో స్వల్ప ఓట్లతో ఓడిపోయారు పద్మావతి. పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీ వచ్చేలా పద్మావతి ఫ్లాన్ చేశారు. దీంతో కోదాడను వదులుకుంటే రాజకీయంగా భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని ఉత్తమ్‌ను వారిస్తున్నారు పద్మావతి.

కోదాడతో పాటు హుజుర్ నగర్‌లోను ఉత్తమ్ కుమార్ రెడ్డికి దీటుగా పద్మావతికి సైతం విస్తృతమైన సంబందాలున్నాయి. రెండు నియోజకవర్గాలలో ప్రతి ఒక్కర్నీ పేరు పెట్టి పిలిచే పరిచయాలున్నాయి పద్మావతికి. అయితే ఉపఎన్నిక అంటేనే భారీగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీంతో ఖర్చులకు ఇబ్బందిగా ఉండడంతో పాటు రాజకీయ ఇబ్బందులు సైతం తప్పవని, పోటీకి దూరంగా ఉండాలని పద్మావతి ఆలోచిస్తున్నారు. అయితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇందుకు ససేమిరా అంటున్నారని తెలుస్తోంది.

హుజూర్‌నగర్‌ను తనకు కంచుకోటగా భావించే ఉత్తమ్‌, అంత ఈజీగా ఆ స్థానాన్ని వదులుకోదల్చుకోలేదు. తన భార్య పద్మావతిని కాకుండా ఎవరినో ఒకర్ని బరిలోకి దింపినా, గెలుపు మీద అనుమానాలు తప్పవని ఉత్తమ్‌‌ ఆందోళన. కాంగ్రెస్‌లో ఎవరికో ఒకరు, లేదంటే ప్రత్యర్థులకో ఆ స్థానం వెళితే, ఐదేళ్ల తర్వాత తన పరిస్థితి ఏంటన్నది కూడా ఉత్తమ్‌ను వెంటాడుతోంది. ఎందుకంటే, ఎవరైనా ఒక్కసారి గెలిస్తే, ఆ నియోజకవర్గంపై పట్టు పెంచుకునే ఛాన్సుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే, సీఎం అభ్యర్థిగా డైరెక్టుగా చెప్పకపోయినా, తన అనుకూలవర్గం చేత చెప్పించుకున్నారు ఉత్తమ్. మరి ఐదేళ్ల తర్వాత రాజకీయ పరిణామాలు మారి, కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తే, తానెక్కడి నుంచి పోటీ చేయాలన్నది ఉత్తమ్‌ను కుదురుగా ఉండనివ్వడంలేదు. అందుకే తన భార్యను ఇక్కడ నిలబెట్టి, హుజూర్‌ నగర్‌ను నిలబెట్టుకోవాలని తపిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కావాలంటే తనను తిరిగి కోదాడకు పంపి, తాను మాత్రం హుజూర్‌ నగర్‌ నుంచే పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు. అందుకే భార్యకు ఇష్టంలేకపోయినా, సర్దిజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే హుజూర్‌ నగర్‌లో ఇటు పీసీసీ చీఫ్ సతీమణి, అటు కేసీఆర్ కూతురు హోరాహోరిగా తలపడ్డం ఖాయంగా కనిపిస్తోంది.

తెలంగాణలో టిఆర్ఎస్ ప్రతి ఉపఎన్నికల్లోనూ విజయం సాధించింది. బైపోల్స్‌ ఎలా గెలవాలో గలాబీ అధిష్టానానికి బాగా తెలుసు. ఆ రాజకీయ ఎత్తుగడలతోనే హుజుర్ నగర్ నుంచి రంగంలోకి దిగాలని భావిస్తోంది. అందుకే కల్వకుంట్ల కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కవిత కాదంటే సైదిరెడ్డి లేదా మరేవరైనా పోటీ అంటున్నారు. ఇక‌ కాంగ్రెస్ నుంచి పద్మావతితో పాటు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ లేదా జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే కవిత పేరు మాత్రం హుజూర్‌నగర్‌ బైపోల్స్‌లో మార్మోగుతుండటం, ఎన్నికను రసవత్తరంగా మారుస్తోంది.

అయితే ఇప్పటి వరకూ ఇవన్నీ ఊహాగానాలే. తెలంగాణ భవన్, గాంధీభవన్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాటలే. అధికారికంగా మాత్రం ఎవరూ హుజూర్‌ నగర్‌లో అభ్యర్థులను ప్రకటించలేదు. టీఆర్ఎస్‌ నుంచి కవితను నిలబెడతారన్న పుకార్లను తోసిపుచ్చేవారూ ఉన్నారు. ఎందుకంటే, ఆల్రెడీ నిజామాబాద్‌లో కవిత ఓడిపోయారు. కేసీఆర్ కూతురే ఓడిపోయారంటూ, అప్పుడే కారాలు మిరియాలు నూరారు. ఏడు ఎంపీ సీట్లూ ప్రతిపక్షాలకు వెళ్లిపోయాయని, టీఆర్ఎస్‌ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందనడానికి ఇవే నిదర్శనాలంటూ ప్రత్యర్థి పార్టీలు గట్టిగా మాట్లాడుతున్నాయి. ఒకవేళ హుజూర్‌నగర్‌లోనూ కవితను బరిలోకి దింపితే, మిగతా పక్షాలన్నీ ఏకమై, కవితను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డే ఛాన్సుంది. అక్కడా కవిత పరాజయం పాలైతే, ఆమె రాజకీయ భవిష్యత్తుకే ఇబ్బందని వ్యాఖ్యానించేవారూ ఉన్నారు. అందుకే కేసీఆర్‌ చాలా మేథోమథనం సాగిస్తున్నారు. అక్కడ పోటీకి దింపాలా, లేదంటే రాజ్యసభకు నామినేట్ చేయాలా అదీ లేదంటే ఐదేళ్లు జాగృతి తరపున జనంలోనే కవిత ఉంటారా అన్నది తేలాల్సి ఉంది. ఓడినా, గెలిచినా తాను మాత్రం నిజామాబాద్ ప్రజలతోనే ఉంటానని, కవిత వ్యాఖ్యానించడం కూడా, ఇందుకు బలాన్నిస్తున్నాయి.

మొత్తానికి హుజూర్‌ నగర్ ఉప ఎన్నికలు, మరోసారి యుద్ధకేత్రం కాబోతున్నాయని మాత్రం అర్థమవుతోంది. ఒకవేళ ఉత్తమ్ భార్య పద్మావతి, అటు సీఎం కేసీఆర్ కూతురు కవిత బరిలోకి దిగితే మాత్రం, హుజూర్‌ నగర్‌ ఎన్నిక మరో ఎన్నికల సంగ్రామాన్ని తలపించడం ఖాయం. అందరి దృష్టి హుజూర్‌ నగర్‌పైనే కేంద్రీకృతమవుతుంది. మరి ఈ ఊహాగానాలు నిజమవుతాయో, లేదంటే ఊహాగానాలుగానే మిగిలిపోతాయో చూడాలి.


Next Story

లైవ్ టీవి


Share it