అమేథీలో రాహుల్ ఓటమి ఖాయమేనా ?

అమేథీలో రాహుల్ ఓటమి ఖాయమేనా ?
x
Highlights

అధికారానికి కీలకమైన యూపీలో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.యూపీలో బీజేపీ ప్రభ తగ్గిపోయిందని, ఈసారి కనీసం 50 స్థానాలు అక్కడ తగ్గుతాయని కమలనాథుల...

అధికారానికి కీలకమైన యూపీలో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.యూపీలో బీజేపీ ప్రభ తగ్గిపోయిందని, ఈసారి కనీసం 50 స్థానాలు అక్కడ తగ్గుతాయని కమలనాథుల అంతర్గత సర్వేల్లో తేలడంతో ఆ లోటును భర్తీ చేసుకోడానికి బీజేపీ జోరు పెంచింది. అయితే ప్రియాంక వచ్చినా యూపీలో కాంగ్రెస్ తలరాత మారలేదని ఎగ్జిల్ ఫలితాలు చెబుతున్నాయి. అమేథీలో రాహుల్ ఓటమి ఖాయమేనా అనే సందేహాలు కలుగుతున్నాయి.

ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రతిపక్షాలకు నిద్ర పట్టనివ్వడం లేదు. బీజేపీకి పెద్దగా సీట్లు రావని కేంద్రంలో హంగ్ వచ్చే ఆస్కారముందని నానా హడావుడి చేసిన కాంగ్రెస్, మిత్ర పక్షాలు గురువారం రాబోయే అసలు ఫలితాలపై టెన్షన్ పడుతున్నారు. 300 సీట్లకు పైగా గెలిచి కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారం చేపడుతుందంటూ మెజారిటీ సర్వేలు తేల్చి చెప్పాయి. అధికారానికి కీలకమైన యూపీలో బీజేపీ నేతలు భయపడుతున్నంత డ్యామేజ్ జరిగే ఆస్కారం లేదని ఎగ్జిట్ పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి. 80 సీట్లున్న యూపీలో బీజేపీకి కనీసం 50 సీట్లు కోతపడతాయని బీజేపీ పెద్దలు లెక్కలేశారు. పోయిన ఆ స్థానాలను తిరిగి రాబట్టుకోడానికే ఇటు బెంగాల్ పై కన్నేశారు. దక్షిణాదిన కేరళ, తమిళనాడుల్లోనూ ఆ స్థానాలను భర్తీ చేసుకోవాలని అనుకున్నారు. కానీ చిత్రంగా యూపీలో కమల నాథుల హవా తగ్గలేదని తేలింది. కనీసం 50 సీట్లకు తగ్గకుండా గెలుస్తారని సర్వేలన్నీ తేల్చడమే కాదు ప్రియాంక ప్రచారంలోకి దిగినా కాంగ్రెస్ పరిస్థితి ఏం మెరుగు పడలేదని తేల్చాయి.

యూపీలో కాంగ్రెస్ ఒకటి లేదా రెండు సీట్లు మాత్రమే గెలుస్తుందని తేల్చాయి. అంటే ఆ సీట్లు ఖచ్చితంగా రాహుల్, సోనియాలవే అయి ఉండాలి. రెండు సీట్లు వస్తే ఇద్దరూ గెలిచినట్లు ఒకవేళ ఒకే సీటు గెలిస్తే అది సోనియాదే అవుతుందన్న రీజనింగ్ వినిపిస్తోంది. రాహుల్ అమేథీలో ఓడి పోవచ్చన్న భయంతోనే ముందు జాగ్రత్తగా కేరళలో వయనాడ్ నుంచి పోటీకి దిగారు. గత ఎన్నికల్లో స్మృతీ ఇరానీ ఓడిపోయినా రాహుల్ మెజారిటీని తగ్గించగలిగారు. ఇక ఈసారి పట్టుబట్టి మరీ ఆమె ఆ నియోజక వర్గానికి ఎన్నో అభివృద్ధి పథకాలు చేపట్టారు. తరచుగా అమేథీ సందర్శిస్తూ వచ్చారు. స్థానిక సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించారు. పోల్ షెడ్యూల్ ఖరారయ్యాక ఇక నియోజక వర్గంలోనూ ఉంటూ వాడ వాడా కలియతిరిగారు. స్మృతీ ఇంతలా ప్రజల మధ్యనుంటే రాహుల్ దేశమంతా ప్రచారం చేసినా అమేథీకి మాత్రం రాలేదు అమేథీ ప్రచారం మొత్తం ప్రియాంకే దగ్గరుండి చూసుకున్నారు. పోలింగ్ రోజు సైతం రాహుల్ అమేథీకి రాలేదు స్మృతీ ఇరానీ మాత్రం అమేథీలోనే ఉంటూ బూత్ బూత్ కి కలియ తిరుగుతూ ఓటర్లను పలకరించారు. ఈ అన్ని పరిణామాలను గమనిస్తే అమేథీలో రాహుల్ గెలుపు కష్టమేననే అనుమానాలు కలుగుతున్నాయి. 23న ఫలితాలు వస్తే తప్ప అమేథీ ఫలితం ఏమవుతుందన్నది తెలీదు.

Show Full Article
Print Article
Next Story
More Stories