నేతలకు సన్‌స్ట్రోక్‌...చుక్కలు చూపిస్తున్న సూరీడు

నేతలకు సన్‌స్ట్రోక్‌...చుక్కలు చూపిస్తున్న సూరీడు
x
Highlights

అసలే మండుటెండలు ఇటు చూస్తే ఎన్నికల సీజన్. ఆకాశంలో భానుడి భగభగలు కింద భూమిలో నుంచి సెగలు. మరి ఎన్నికల్లో ఓటరు దేవుడి కరుణ కావాలంటే పోటీ చేస్తున్న...

అసలే మండుటెండలు ఇటు చూస్తే ఎన్నికల సీజన్. ఆకాశంలో భానుడి భగభగలు కింద భూమిలో నుంచి సెగలు. మరి ఎన్నికల్లో ఓటరు దేవుడి కరుణ కావాలంటే పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇంటింటికి తిరగాల్సిందే. అందుకే ఎండను కూడా లెక్క చేయకుండా అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పోలింగ్‌కు పట్టుమని 7 రోజులే ఉండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే భానుడి ప్రతాపానికి వారు తట్టుకోలేకపోతున్నారు. వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురవుతున్నారు.

ఏపీలో ఎన్నికల 'హీట్‌'కు 'సన్‌ స్ర్టోక్‌' తోడైంది. ఎన్నికలకు 7 రోజుల సమయమే ఉండటంతో ఆయా పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. అయితే మండే ఎండలు అభ్యర్థులను బెంబేలెత్తిస్తున్నాయి. ఏప్రిల్‌ మొదటివారంలోనే ఎండల తీవ్రత ఎక్కువవడంతో ప్రచారానికి ఆటంకం ఏర్పడుతోంది. భానుడి ప్రతాపంతో కార్యకర్తలు మధ్యాహ్న సమయంలో బయటకు రాకపోవడంతో అభ్యర్థులకు 'ఎండ' దడ మొదలైంది.

మండుటెండల్లో ప్రచారం చేస్తుండటంతో చాలా మంది వడదెబ్బకు గురవుతున్నారు. కార్లలో ఏసీలు, జేబుల్లో గ్లూకోజ్ ప్యాకెట్లు, నెత్తికి రుమాళ్లు, టవళ్లు కట్టుకుని ప్రచారానికి వెళ్తున్నా కొంతమంది అస్వస్థతకు గురవుతున్నారు. మొన్న మంత్రి భూమా అఖిలప్రియ, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్,కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి, విశాఖ ఉత్తర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, పి. విష్ణుకుమార్ రాజు, నిన్న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వైసీపీ అభ్యర్థి కిరణ్ వడదెబ్బకు గురయ్యారు. ప్రచారానికి వెళ్లిన సమయంలో అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ఎండల్లో ప్రచారం చేయడం వల్ల నేతలు డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎండ రోజు రోజుకి పెరుగుతుండటంతో ఉదయం 10 గంటలకల్లా అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. మధ్యాహ్నం ఒకటి, రెండు గంటలు విశ్రాంతి తీసుకుని సాయంత్రం 4 గంటలకు మరలా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో నేతలు పాదయాత్రగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

మొత్తంమీద అభ్యర్థుల్లో 'ఎండ'దడ మొదలైంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు మొదలుకాగా మార్చి మొదటి వారంలో రాయలసీమ, దక్షిణకోస్తాల్లో వడగాడ్పులు కూడా వీచాయి. ఇదే తీవ్రత మున్ముందు కొనసాగకపోయినా ఈ వేసవిలో ఎండలు ఎక్కువగానే ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఓ వైపు వెదర్ హీట్ మరోవైపు పొలిటికల్ హీట్‌ను నేతలు ఎలా తట్టుకుంటారో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories