రెండు లక్షల కోట్లు దాటనున్న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ..

రెండు లక్షల కోట్లు దాటనున్న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ..
x
Highlights

తెలంగాణ తాత్కాలిక బడ్జెట్‌ నేడు అసెంబ్లీ ముందుకు రానుంది. ఆర్థికశాఖ సైతం తనవద్దే ఉండటంతో సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఓ...

తెలంగాణ తాత్కాలిక బడ్జెట్‌ నేడు అసెంబ్లీ ముందుకు రానుంది. ఆర్థికశాఖ సైతం తనవద్దే ఉండటంతో సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఓ ముఖ్యమంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టనుండటం తెలంగాణలో ఇదే తొలిసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంలుగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి, కొణిజేటి రోశయ్య ఆర్థికశాఖ బాధ్యతలను స్వయంగా పర్యవేక్షించడంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు అదే తరహాలో కేసీఆర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. సరిగ్గా ఉదయం 11.30గంటలకు ఆయన బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ సారి బడ్జెట్ రెండు లక్షల కోట్లు దాటే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మరికొద్ది గంటల్లో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రవేశపెట్టబోతున్నారు. మంత్రులకు శాఖలు కేటాయించిన తర్వాత కీలకమైన శాఖలు తన దగ్గరే ఉంచుకున్న కేసీఆర్ కీలమైన ఆర్థికశాఖ కూడా ఎవరికీ కేటాయించలేదు. దీంతో అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆయనే ఈ సారి ప్రవేశపెట్టనున్నారు.

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన బుధవారం తెలంగాణ మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా సాగింది. విస్తరణ తర్వాత తొలిసారిగా ప్రగతి భవన్‌లో సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అసెంబ్లీలో సమర్పించనున్న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌, ప్రత్యేక ప్రకటనలపై మంత్రివర్గం చర్చించింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఓటాన్ బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదించింది. అలాగే, 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిమాండ్లకు అనుబంధ గ్రాంట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

మరోవైపు గతంలో జీఎస్టీ చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేశారు. ఈ ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లుకు మంత్రివర్గం ఆమోదించింది. అయితే, శాసనసభలో సీఎం కేసీఆర్‌, మండలిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయలు దాటొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఆర్థిక శాఖను తన వద్దే పెట్టుకున్న కేసీఆర్ సీఎం హోదాలో బడ్జెట్ ప్రసంగం చేయనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories