కేబినెట్ విస్తరణలో కేసీఆర్ మార్క్ ...కేటీఆర్‌, హరీష్‌రావులకు కీలక...

కేబినెట్ విస్తరణలో కేసీఆర్ మార్క్ ...కేటీఆర్‌, హరీష్‌రావులకు కీలక...
x
Highlights

ముందస్తు ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండో విడత అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్‌ దీర్ఘకాల ప్రయోజనాలతో మంత్రి వర్గ విస్తరణ చేపట్టారు. గత మంత్రివర్గంలో...

ముందస్తు ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండో విడత అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్‌ దీర్ఘకాల ప్రయోజనాలతో మంత్రి వర్గ విస్తరణ చేపట్టారు. గత మంత్రివర్గంలో ఉన్న నలుగురికి మాత్రమే ఈసారి ఆయన చోటు కల్పించారు. పార్టీ విధేయతతో పాటు సమర్ధత, సామాజిక సమీకరణాలు, గత పనితీరు ఆధారంగా కొత్త వారికి మంత్రి వర్గంలో చోటు కల్పించారు. ఇదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో క్వీన్ స్వీపే లక్ష్యంగా హరీష్‌రావు, కేటీఆర్‌లకు స్ధానం కల్పించ లేదనే ప్రచారం జరుగుతోంది.

సీఎం కేసీఆర్ రెండో విడత మంత్రి వర్గ విస్తరణలో తనదైన రాజనీతిని ప్రదర్శించారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత పూర్తి స్ధాయి కేబినెట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్న కేసీఆర్ పరిపాలనకు ఇబ్బందులు కలగకుండా సీనియర్ల సేవలు పార్టీ వినియోగించుకునేలా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే గతంలో మంత్రులుగా ఉన్న వారిలో నలుగురికి మాత్రమే ఈ సారి చోటు కల్పించారు. వీరిలో తెలంగాణ తొలి ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్‌తో పాటు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్‌‌లు ఉన్నారు.

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటెల రాజేందర్‌కు కేసీఆర్‌ తన మంత్రివర్గంలో మరోసారి చోటు కల్పించారు. టీఆర్ఎస్‌ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంటే నడుస్తున్నారు ఈటెల. 2004 నుంచి 2018 వరకు ఓటమెరుగని వీరుడిగా ఈటెల గుర్తింపు పొందారు. వివాదరహితుడు, అత్యంత సౌమ్యుడిగా గుర్తింపు పొందడంతో పాటు అత్యంత కీలకమైన శాఖను సమర్ధవంతంగా నిర్వహించి ఈటెల ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇదే ఈటెలకు పెద్ద ప్లస్‌ పాయింట్‌గా మారింది.

నిర్మల్‌ నుంచి మరోసారి విజయం సాధించిన అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డికి కూడా కేసీఆర్‌ కేబినెట్ బెర్త్‌ కన్ఫామ్ చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటూ విజయం సాధించిన ఇంద్ర కరణ్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు పొందారు. పార్టీలకు అతీతంగా సొంత బలంతో గెలుపొందిన ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి టీఆర్ఎస్‌ అత్యధిక సీట్లు గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించారు. దీంతో ఈయనకు మరో అవకాశం దక్కింది.

గత మంత్రివర్గంలో అత్యంత కీలకమైన విద్యుత్ శాఖను నిర్వహించిన సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్‌ రెడ్డికి సీఎం కేసీఆర్ మరో అవకాశం కల్పించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడుస్తున్న జగదీష్‌ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. కేసీఆర్‌ టీంలో అతి ముఖ్యమైన వ్యక్తిగా తెరవెనక కీలకపాత్ర పోషించారు.

ఇక జంట నగరాల్లోని సనత్‌నగర్‌ నుంచి మరోసారి గెలుపు బావుట ఎగువేసిన తలసాని శ్రీనివాసయాదవ్‌కు కూడా ఈసారి చోటు దక్కింది. 1994లో రాజకీయాల్లోకి వచ్చిన తలసాని 1994, 99, 2008, 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. కేసీఆర్ కేబినెట్‌లో బీసీ వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన తలసాని బీసీలను పార్టీకి దగ్గర చేయడంలో కీలకపాత్ర పోషించారు. దీంతో మరోసారి ఈయనకు అవకాశం దక్కింది.

పార్లమెంట్ ఎన్నికల దృశ్యా పలువురు సీనియర్లకు చోటు కల్పించలేకపోయిన కేసీఆర్ గెలుపే లక్ష్యంగా సార్వత్రిక ఎన్నికలకు వ్యూహరచన చేస్తున్నారు. ఇదే సమయంలో కేటీఆర్‌, హరీష్‌రావులకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశమున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories