కాసేపట్లో ఏపీ హైకోర్టు భవనం ప్రారంభం..

కాసేపట్లో ఏపీ హైకోర్టు భవనం ప్రారంభం..
x
Highlights

రాజధాని అమరావతిలో హైకోర్టు భవనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగొయ్ కాసేపట్లో ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి 10-55 గంటలకు...

రాజధాని అమరావతిలో హైకోర్టు భవనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగొయ్ కాసేపట్లో ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి 10-55 గంటలకు శంకుస్థాపన జరిగే ప్రాంతానికి చేరుకుని శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. గ్యాలరీని పరిశీలిస్తారు. జ్యుడీషియల్ కాంప్లెక్స్ వద్ద పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఆ తర్వాత కోర్టు హాళ్లను పరిశీలిస్తారు.

12-25 గంటలకు సభా కార్యక్రమంలో పాల్గొంటారు. సీజేఐ జస్టిస్ రంజన్ గోగొయ్ తో పాటు ఏపీ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు.

ఈ భవన నిర్మాణాన్ని సీఆర్‌డీఏ 8 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసింది. రాజస్థాన్ నుంచి తెప్పించిన శాండ్ స్టోన్‌తో పూత చేసి భవనాన్ని సుందరంగా తీర్చి దిద్దారు.

ఈ జ్యుడీషియల్ కాంప్లెక్స్ భవనంలో ఏపీ హైకోర్టును ఏర్పాటు చేస్తారు. ఈ భవనానికి పక్కనే శాశ్వత హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారు. శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యాక హైకోర్టును అందులోకి తరలిస్తారు. జ్యుడీషియల్ కాంప్లెక్స్ భవనంలో సిటీ సివిల్ కోర్టులు, ట్రైబ్యునళ్లు వంటివి ఏర్పాటవుతాయి. జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ భవనాన్ని జీ+2 విధానంలో నిర్మించారు. భవిష్యత్తులో జీ+5కి విస్తరించేలా దీని ఆకృతి రూపొందించారు. ఎత్తైన క్లాక్‌టవర్‌ ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ భవనం పనుల్ని 2018 జూన్‌లో ప్రారంభించారు. అప్పటినుంచి కొన్ని వందల మంది కార్మికులు, ఇంజినీర్లు ఈ భవన నిర్మాణంలో రాత్రింబవళ్లు శ్రమించారు. సాధారణంగా ఇలాంటి భవనాల నిర్మాణానికి రెండేళ్లు పడుతుందని, తాము ఎనిమిది నెలల రికార్డు సమయంలోనే నిర్మాణం పూర్తి చేశామని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. భవన నిర్మాణం, ఇంటీరియర్స్‌, పార్కింగ్‌ వసతి వంటి వాటితో కలిపి ఒక్కో చ.అడుగుకు సుమారు రూ.6,100 ఖర్చయింది. మొత్తం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.173 కోట్లు.

Show Full Article
Print Article
Next Story
More Stories